వీరమాచినేని గారి డైట్ వల్ల జీవనశైలి వ్యాధుల నుండి శాశ్వతంగా బయటపడ్డారు. మల్లిక్ గారు అద్భుత చిట్కాలు చెప్తున్నారు కరోనాకి..ప్రభుత్వం తలచుకుంటే ..ఈ ఆహార విధానం లో ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో పూర్తిగా విశ్లేషించి ప్రభుత్వం మార్గనిర్దేశం చెయ్యచ్చు కదా.?

 మనం చదివిన ప్రాధమిక చదువులతో మనం సంపాదించుకునే ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే సమస్య ఎక్కడ ఉందో మనకే అర్ధం అవుతుంది. ఇక్కడ వాడిన ఇంగిత జ్ఞానం అనేది తిట్టు పదం కాదు. దానినే మనకర్ధమయ్యే భాషలో కామన్ సెన్స్ అంటారు.

నాకు తెలిసినంతవరకూ ఆరోగ్యానికి చెందిన ప్రయోగాలు, పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలు ఆయా రంగాలలో ఉన్నత విద్యనభ్యసించిన, అభ్యసిస్తున్న నిపుణులు చేస్తారు. వారు తాము గమనించిన, కనుగొన్న విషయాలను వివిధ రకాల పరిస్థితులలో పరిశోధన చేసి మరింత నిష్ణాతులైన వారి మార్గదర్శనంలో ఆ విషయంలోని నిష్ణాతులతో చర్చలతో, ముందుకు సాగుతూ కొత్త ఆవిష్కరణలు చేస్తారు. వీరి ప్రయోగాలలోని ఫలితాలతో శాంపిల్ డేటా పరిమాణాన్ని పెంచుకుంటూ మూడు నాలుగు దశలలో వారి ఆవిష్కరణల పనితీరుని, దుష్ఫలితాలను గమనిస్తూ పరిశోధన చేస్తారు. ఈ క్రమంలో నాకు తెలియని అనేక ఇతర అదనపు విధానాలు కూడా ఉంది ఉండొచ్చు. ఆ రంగంలో ఉన్నవారెవరైనా నేను రాసినదానిలో తప్పుంటే వ్యాఖ్యల్లో తెలుపగలరు. ఈ పరిశోధనలన్నీ ఆ రంగాల్లో నిపుణులే చెయ్యాలా? వేరే వాళ్ళు చేయకూడదా అని ప్రశ్నిస్తే, సమాధానం అవును, కాదు అని చెప్పాల్సొస్తుంది. కానీ ఎవరు చేసినా విధానంలో మాత్రం మార్పు ఉండకూడదు.

పైన ఈ విధానంలో ఎక్కడా యూట్యూబ్ వీడియోల్లో స్వయం ప్రమోషన్లు చేసుకోవడం, డాక్టర్లను దూషించడం, టీవీ ఛానెళ్లలో తొడలు కొట్టుకోవడం, మీసాలు మెలెయ్యడం, సవాల్ చేసుకోవడం లాంటివి ఉండవని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇక వీరమాచినేని గారు, మల్లిక్ పరుచూరి గారు ఏం చేస్తున్నారో, ఏం చెబుతున్నారో విడివిడిగా చూద్దాం.

వీరమాచినేని రామకృష్ణ:

ఈయన ఒక చార్టెడ్ అకౌంటెంట్. నాకు తెలిసి ఒక మూడు నాలుగేళ్లనుండి ఈయన కీటో ఆహారవిధానంలోని బాగా విమర్శింపబడే అంశాలను కొంచెం మార్చి, మరికొంత ప్రాంతీయతని చేర్చి వీరమాచినేని డైట్ గా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. కీటో మనకి కొత్త కావొచ్చేమోగాని పాశ్చాత్య దేశాలలో అదొక అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డు. ఐదేళ్లక్రితం ఒకరిద్దరు స్నేహితులు చెయ్యడం చూసాను గాని ఆ తర్వాత మానేశారు. బరువు తగ్గించడంలో దీని పనితీరుపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి.

కానీ వీరమాచినేని గారు బరువు తగ్గించే డైట్ మాత్రమే అని ప్రోమోట్ చేసే స్థాయి దాటిపోయారు. వారు చెప్పినట్లు చేస్తే చక్కెర వ్యాధి టైపు-1, టైపు-2 నుండి పూర్తిగా కోలుకోవచ్చని, కాన్సర్ కూడా నయమవుతుందని, లక్షమంది పైగా చక్కెర వ్యాధి బాధితులు, కాన్సర్ బాధితులు కూడా పూర్తిగా కోలుకున్నారని యూట్యూబ్ ఇంటర్వ్యూలలో చెప్పారు. కొన్ని రోజులకు ఇంకాస్త ముందుకెళ్లి డాక్టర్లు వారి స్వయంలాభం కోసం ఆ రోగులను ఆ జబ్బులతోనే జీవితాంతం ఉంచుతున్నారని అర్ధంలేని విమర్శ చేసారు. మాట్లాడితే లక్షలమంది టెస్టిమోని ఉంది అంటారుగాని ఆ ఫలితాలేంటో, ల్యాబ్ రిపోర్ట్స్ ఏంటో బయటపెట్టరు. ఈ మధ్య కొత్తగా చైనా యూనివెర్సిటీవారు వీరికొక అవార్డును ప్రకటించినట్లు, ఆ యూనివర్సిటీలో ఒక బ్లాకుకు ఈయన పేరు పెట్టినట్లు చెప్పారు. నేను ఇంటర్నెట్లో శోధించాను గాని ఈ విషయాన్నీ నిర్ధారించే ఒక్క ఆర్టికల్ కూడా కనిపించలేదు. నా ఉద్దేశ్యంలో ఈయనకి మంతెన సత్యనారాయణరాజుగారి లాంటి వ్యాపారం చేసి ఆలోచన ఉండి ఉండొచ్చు. అదే నిజమైతే మన రాష్ట్రంలోని అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తల్లో ఈయన కూడా చేరే అవకాశం ఉంది.

మల్లిక్ పరుచూరి:

ఈయనొక కెమికల్ ఇంజనీర్. వృత్తి రీత్యా యాష్ప్లే ఇటుకలు తయారుచేసే వ్యాపారంలో ఉన్న ఈయన, ప్రవ్రుత్తి రీత్యా నేచర్ లాంటి విజ్ఞాన జర్నల్స్ చదువుతుంటారు. కరోనా రెండవ అలలో జరిగిన వ్యవస్తీకృత తప్పిదాల వలన పెరిగిన ప్రజల అనాలోచిత కోపానికి ఈయన యూట్యూబ్, ఫేస్బుక్ వీడియోలు ఒక ఆయుధంలా కనిపించాయి. జరిగిన తప్పు మొత్తాన్నీ డాక్టర్ల మీదకి నెట్టేసి వాళ్ళనొక బూచిగా చూపించడం మొదలుపెట్టారు. రోగి చనిపోతే రోగితో పాటు డాక్టర్ సహగమనం కూడా జరిగిపోవాలనుకునే విష సంస్కృతి నచ్చేవాళ్ళకి ఈ మాటలు వినసొంపుగా అనిపించాయి. ఈయన అడిగే ప్రశ్నల్లో చాలా వరకు మాములు జనాలకి అర్ధం కావు. కానీ వాటన్నింటికీ డాక్టర్లు సమాధానాలు చెబుతున్నా అవి వినే పరిస్థితిలో ప్రజలు లేరు. జీవితంలో మానవ ఊపిరితిత్తులను చూడని ఈయన వెంటిలేటర్ గురించి చెప్పిన వివరణ చూసి నాలాంటోడికే నవ్వాగలేదు, మరి డాక్టర్లు ఎన్ని రోజులు నవ్వుకుని ఉంటారో. ఆయన తయారుచేసిచ్చిన మందులతో మెడికల్ రెప్రెసెంటేటివ్స్ ట్రైనింగ్ ఇస్తే తప్ప డాక్టర్లు వైద్యం చెయ్యలేరని ఇంకో మాట అన్నారు. అందులో ఎంత నిజముందో ఒక్కసారైనా డాక్టర్ల దగ్గర చికిత్స తీసుకున్నవారు కొంచెం కామన్ సెన్స్ తో ఆలోచించాలి. ఈయన కూడా తనకొచ్చిన పాపులారిటీని తన భవిష్యత్ అవసరాలకోసం వాడుకుంటే నేనేమి ఆశ్చర్యపోను.

చట్టపరంగా అయితే వీళ్ళిద్దరిమీద ప్రభుత్వమే కేసులు పెట్టి అరెస్టు చెయ్యాలి. కానీ కరోనా పచ్చళ్ళు అంటూ రోజుకొకరు పుట్టుకొస్తున్నా, ఎక్కడ ప్రజావేశానికి గురవుతామోనని భయంతో చోద్యం చూడడం తప్ప ఇంకేం చెయ్యని ప్రభుత్వాలు వీళ్లిద్దరిమీద కేసులు పెట్టే అవకాశం లేదు కాబట్టి వీళ్ళ వైద్య విధానాలకు అడ్డు ఉంటుందని అనుకోవడం లేదు. ఒక వర్గం దృష్టిలో వీళ్ళ వైద్య విధానాలు పాటించి ప్రాణం మీదకి తెచ్చుకునేవారికి అల్లోపతి వైద్యులు వైద్యం చేయకూడదు. కానీ నాకు తెలిసి వైద్యులు ఆ సమయంలో కక్ష తీర్చుకునేవాళ్ళు కాదు కాబట్టి వీళ్ళ ఆటలు సాగుతుంటాయి.

అప్డేట్:

మల్లిక్ గారు ఒక అనారోగ్య సమస్యతో అల్లోపతిక్ ఆసుపత్రిలో చేరినట్లు వార్త చూసాను. ఈయన వ్యాఖ్యల్లో విమర్శింపబడే అంశం డాక్టర్లపై విషప్రచారం చేసి, సూడో వైద్య విధానాలు ప్రచారం చేస్తున్నారని. ఆయన వ్యాఖ్యల వల్ల ఆయనకొచ్చే నష్టం ఏమి లేదు. కావాలంటే ఎంతైనా ఖర్చు పెట్టి వైద్యం తీసుకోగల సామర్ధ్యం ఆయనకుంది. కానీ ఆయన మాటలు నమ్మి వైద్యానికి దూరమయ్యేవాళ్లే నష్టపోతున్నారు.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?