మీరు ఎప్పుడైనా టికెట్ లేకుండా రైలు లేదా బస్సులో ప్రయాణించారా? మీ అనుభవం ఏమిటి?
టికెట్ లేకుండా సగం ప్రయాణం చేశాను. అది కూడా నా ప్రమేయం లేకుండా.
రాజమండ్రి నుండి భీమవరానికి ఎనిమిది:పది కి ఒక ప్యాసింజర్ రైలు ఉంది. అందులో ప్రయాణం చేసినప్పుడు దొరికే హాయి ఏసీ రైలులో కూడా ఉండదు. పండగ సీజన్లో తప్ప ఎప్పుడూ ఖాళీగా ఉండేది. కనిపించిన మొహాలే మళ్ళీ, మళ్ళీ కనిపించేవి. భీమవరం వచ్చేలోపు సమయం ఎలా గడుస్తుందో కూడా తెలియదు. పైగా స్టేషన్కు ఎనిమిదింటికి వచ్చినా తాయితీగా టికెట్ తీసుకుని ఎక్కొచ్చు.
ఒకరోజు తాతగారింటికి వెళ్లాల్సివస్తే నన్ను మా తమ్ముడు స్టేషన్లో దిగబెట్టాడు. వాడు బండి పార్క్ చేసి వచ్చేలోపు నన్ను టికెట్ తీసుకోమని చెప్పి వెళ్ళాడు. ఎప్పుడూ నా టికెట్ తీసుకుని వాడికోసం ప్లాట్ఫారం మీద వేచిచూస్తూ ఉండేవాడిని. కానీ ఆరోజు ఇంకా లైన్లోనే నిలబడి ఉన్నాను. నా ముందు ఒక పదిమంది ఉన్నారు. వాడొచ్చేలోపు నా వెనక ఇంకో ఐదారుగురు వచ్చారు. వరస అస్సలు కదలట్లేదు. కౌంటర్లో కుర్చున్నాయన మొహం చాలా చిరాగ్గా ఉంది. పక్క కౌంటర్ కూడా కదలట్లేదు. మా తమ్ముడొచ్చి ఏం జరుగుతుందో కనుక్కుందామని ముందుకు వెళ్లి అడిగాడు. నెట్వర్క్ ఇబ్బందులవల్ల టిక్కెట్లు ఇవ్వడం కుదరట్లేదని చెప్పారు. మరోపక్క రైలుకి టైమైపోతుంది. టెన్షన్ తట్టుకోలేక లైన్లలో నిలబడ్డవాళ్లు తోసుకోవడం మొదలెట్టారు. వీళ్ళెంత బలంగా తోసినా కౌంటర్ లో టిక్కెట్లు ఇవ్వకపోతే ముందున్నవాళ్ళు ఎలా కదులుతారు.
మనం ఆలస్యం చేసినప్పుడే రైళ్లు సమయానికొచ్చేస్తాయనే అపవాదుని నిజం చేస్తూ రైలు సరిగ్గా టైముకొచ్చేసింది. ఇద్దరు ముగ్గురు ప్లాట్ఫారం మీదకు వెళ్ళిపోయి లోకోపైలెట్ తో మాట్లాడి విఫలయత్నం చేసారు. అడిగినందుకు చిర్రెత్తిందనుకుంటా, ఆయనగారు ఠమ్చనుగా రైలు తీసేసారు. ఏదైతే అదయ్యిందని చాలామంది టికెట్ లేకుండానే ఎక్కేసారు. గుంపులో ఉంటే వచ్చే దైర్యం వల్ల అనుకుంటా. నాకు దైర్యం సరిపోక తరువాతి రైలుకి వెళతానంటే ఎక్కడ బండి తీసేసుకుంటానేమోనని భయమేసి మా తమ్ముడు నాకు ధైర్యం చెప్పి మిగతావాళ్ళతో పాటే నన్ను కూడా అదే పెట్టెలో ఎక్కించేసాడు.
రైలు గోదావరి బ్రిడ్జిమీదుంది. టిక్కెట్టు లేని జనాలందరూ పోగడి లెక్కేసుకుంటే పాతిక మందిదాకా తేలారు. వారిలో కొంతమంది టికెట్ తియ్యాల్సినవసరం లేదని అంటుంటే మరికొంతమంది తియ్యాలని అంటున్నారు. చివరికి తియ్యాలి అనేవాళ్లే ఎక్కువవడంతో వారిలో ముగ్గురిని ఎంచుకున్నారు. ఆ ముగ్గురికీ డబ్బులిచ్చి కొవ్వూరు స్టేషన్ నుండి ఆఖరి స్టేషన్కి పాతిక టికెట్లు తియ్యమని చెప్పారు. ఆ ముగ్గురిలో నేను కూడా తగలడ్డాను.
ఇక అక్కడితో మా పరుగు పందెం మొదలయ్యింది. ముందు కొవ్వూరులో ప్రయత్నించాము. కౌంటర్ దగ్గరికెళ్లేలోపే రైలు కదిలిపోతుందని అరుస్తుంటే టిక్కెట్లు తియ్యకుండానే తిరిగి లంఘించుకున్నాము. ఆ తర్వాత పసివెదలలో కూడా పనవ్వలేదు. ఎప్పుడూ చాగల్లులో క్రాసింగ్ అని అరగంట ఆపేసేవాడు, ఆరోజు ఐదునిమిషాలు కూడా ఆపలేదు. చివరికి నిడదవోలులో కౌంటర్ వరకూ వెళ్ళాము. టికెట్ తీసుకుని తిరిగి పరిగెడుతుంటే అప్పటికే జేబుదొంగల్లా తయారయిన మా వాటాలు చూసి ఒక రైల్వే కానిస్టేబులుగారు ఆపేసారు. ఆయనకి అసలు సంగతి చెప్పి, మేము రైలందుకోపోతే ఆ పాపం మీదేనని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే వదిలేసారు. కానీ అప్పటికే రైలు కదులుతుంది. పరిగెత్తుకుంటూ నా ముందున్న అబ్బాయి ఎక్కేసాడు. టిక్కెట్లు డబ్బులు నా జేబులోనే ఉన్నాయి. ఆ తర్వాత రన్నింగ్లో నేను ఎక్కేసాను. కానీ నా తర్వాత ఎక్కాల్సినాయన ప్లాట్ఫారం మీద పడిపోయాడు. ఆయన రైలుకి దూరంగానే పడిపోవడంతో అపాయం తప్పింది. ఏదో సాధించినట్లు మొహం పెట్టి లోపలికి వెళ్తే అక్కడున్న పెద్దమనుషులు నానా తిట్లు తిట్టారు. పైగా అందులో కొంతమంది మమ్మల్ని పంపించినవాళ్లు కూడా ఉండడం కొసమెరుపు. తీరా ఎవరి టిక్కెట్లు వాళ్ళు తీసుకుని చిల్లర పంచేసుకున్నాక ఒకావిడ "నిడదోలు నుంచి మా ఊరికి ఆర్రూపాయలే, నాకు ఇంకో రెండ్రూపాయలు వస్తాయి" అని ఏడుపు మొహం పెట్టింది.
Comments
Post a Comment