మీ సొంతూరు కాకుండా మీరు ఉద్యోగం కోసం మరో చోట ఉన్నట్టయితే ఆ ప్రదేశం విశేషాలు తెలుపగలరు?
నేను గత నాలుగేళ్లుగా ఉద్యోగరీత్యా నివసిస్తున్న ఊరు కార్ల్స్ క్రోనా(Karlskrona). నిజానికి అది ఒకటే పదం. మధ్యలో ఆ ఖాళీ తీసేస్తే కార్ల్స్క్రోనా అయ్యి సేమియా ఉప్మాలా కనిపిస్తుందని విడగొట్టాను.కార్ల్స్క్రోనా అంటే కార్ల్ యొక్క కిరీటం అని అర్ధం.
స్వీడన్ మెయిన్ లాండ్లోనే అతి చిన్న కౌంటీ అయిన బ్లేకింగే రాజధాని మా ఊరు. దేశానికి ఆగ్నేయకొనలో ఉన్న బ్లేకింగే ద్వీప సముదాయాలలోని 33 ద్వీపాలూ, ప్రధాన భూభాగంలోనికి కొంతదూరం ఈ ఊరు విస్తరించిఉంది. కమ్మ్యూన్ జనాభా అరవై వేలు, సిటీలో ఒక నలభై వేలమంది ఉంటారేమో. ఐరోపాలోని పొడవైన యూరో రహదారుల్లో ఒకటైన ఈ22 ద్వారా డెన్మార్క్ రాజధాని కోపెన్ హాగెన్ నుండి రోడ్డు మార్గం ఉంది. కోపెన్ హాగన్ విమానాశ్రయం నుండి నేరుగా రైలు మార్గం ద్వారా రెండున్నర గంటల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ రైలు మార్గంలో ఇదే చిట్టచివరి స్టేషన్.
డెన్మార్క్ దండయాత్రలను అడ్డుకోవడానికి నావికాబలగాలనుంచడానికి అనుకూలమైన ప్రాంతంగా గుర్తించి 18వ శతాబ్దంలో ఈ నగరాన్ని నిర్మించారు. మొదట్లో కేవలం ఒక నావికా స్థావరంగానే మొదలైన ఊరు క్రమేపి పెరిగి ఒక నగరం స్థాయికి చేరి చివరికి ఒక పట్టణంలా కొనసాగుతుంది. అప్పటి స్వీడన్ చక్రవర్తి 11వ కార్ల్ పేరుమీదుగా దీనికి కార్ల్స్ క్రోనా అని నామకరణం చేసారు. గత మూడు శతాబ్దాలుగా ఇదే స్వీడన్ దేశపు ప్రధాన నావికా స్థావరం. ఒకప్పుడు స్వీడన్ నేవీకి ఓడలను తయారుచేసిన కార్ల్స్క్రోనా షిప్ యార్డు ప్రస్తుతం తరువాతి తరం సబ్ మెరైన్ల తయారీలో కీలకంగా ఉంది.[1]
17-18 శతాబ్దాలలోని బరోక్ స్టైల్ కళలు ఆకృతులతో స్వీడన్లో నిర్మింపబడ్డ ఏకైక పట్టణమిది. పట్టణంలోని నడిబొడ్డులో ఉన్న స్తోర్తోర్యెత్ (stortorget/ పెద్ద చతురస్రం/కూడలి) పట్టణ వైశాల్యంతో పోల్చున్నప్పుడు మిగతా స్వీడిష్ పట్టణాలకంటే చాలా పెద్దదిగా అనిపిస్తుంది.
పట్టణానికి ఈశాన్యమూలన ఆనుకుని లికెబీ గ్రామంలో నీటి ప్రవాహంతో తిరిగే పిండిమిల్లు(Kronokvarnen) 1710లో నిర్మించారు. ఆ రోజుల్లో దేశంమొత్తమ్మీద ఇటువంటి పిండిమిల్లులు కేవలం రెండే ఉండేవి. ఆ సాంకేతికతతో పనిచేసే పిండిమిల్లులలో మనుగడ సాగిస్తున్నది దేశం మొత్తమ్మీద ఇదొక్కటే. ఈ పట్టణంలో నావికాదళ అవసరాలకు ఇది ఎంతగానో ఉపయోగపడేది.
పట్టణంలోని చాలా నిర్మాణాలు 18వ శతాబ్దంలో నిర్మించడంవల్ల, వాటికున్న చారిత్రక ప్రాముఖ్యత వల్ల పట్టణంలోని చాలా భాగం, పిండిమిల్లుని కలిపి 1993లో యునెస్కో ప్రపంచవారసత్వ సంపదగా ప్రకటించింది.[2]
ఇక వాతావరణపరంగా కూడా ఈ ఊరికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రతియేడు స్వీడన్ వాతావరణశాఖ ప్రకటించే అత్యంత వెలుగైన పట్టణాలలో (most sunniest cities) ఎప్పుడూ మొదటి మూడు స్థానాలలో ఉంటుంది. మనదేశంతో పోలిస్తే ఈ వెలుతురు ఒక మూలకైనా రాదు కానీ ఎండ కోసం పడిచచ్చిపోయే దేశంలో ఇదొక అదృష్టమనే చెప్పొచ్చు. ఒక అనవసరమైన లిస్టులో కూడా ఈ ఊరు ముందుంది. దేశంలోని అతి ఎక్కువ గాలి వీచే పట్టణాలలో ఒకటి కూడా. ముఖ్యంగా చలికాలంలో ఈ ఈదురుగాలులవల్ల వాతావరణం ఇంకా చల్లగా ఉందనే భావన కలుగుతుంది.[3]
ఈ ప్రాంత భాష స్వీడిష్ అయినప్పటికీ బ్లేకింగే యాసలో మాట్లాడతారు. విదేశీయులకు ఈ తేడా కనిపెట్టడం కష్టంకానీ వాటిలోని ఫాల్స్ ఫ్రెండ్స్(false friends) వల్ల స్వీడిష్ హాస్యంలో ఈ యాసలకు ప్రాధాన్యత ఉంటుంది.
క్రొప్కాకోర్ (body cakes) అని పిలవబడే మోదక్ లాంటి వంటకం ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన ఆహార పదార్థం. మొదటిసారి ప్రయత్నించినప్పుడు డోకొచ్చేటట్లు అనిపించినా ఆ తర్వాత్తర్వాత మీకిష్టమైన విదేశీ వంటకాలలో ఇది చేరే అవకాశముంది.
ఇన్ని ప్రత్యేకతలు కారణంగా ఎండాకాలంలో మా ఊరికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరెవరైనా మా ఊరు చూడాలని నిర్ణయించుకుంటే ముందే ఒక మాట చెప్పండి, ఇడ్లీపిండి కలిపి పెట్టుకుంటాను.[4]
Comments
Post a Comment