ఇండియా, అమెరికా మినహాయిస్తే మిగిలిన దేశాల్లో తెలుగు సినిమాలు ఏమాత్రం విడుదల అవుతాయి? అక్కడి ప్రవాస భారతీయులు కొత్త తెలుగు సినిమాలు చూడడానికి ఏం చేస్తారు?

 గత దశాబ్దంగా ప్రవాస తెలుగువారు ఎక్కువగా ఉండే దేశాల్లో మన రాష్ట్రాల్లో ఉన్నంత భారీస్థాయిలోనే తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. కానీ దేశమంతా కలుపుకుని యాభైవేల మంది భారతీయులు కూడా ఉండని ఉత్తర యూరోప్ దేశాల్లో అన్నిచోట్లా తెలుగు సినిమాలు విడుదలవ్వవు. అందులోనూ చిన్న పట్టణాలలో ఏడాదికి ఒకటి విడుదలైతేనే గగనం.

ఐదారేళ్లక్రితం కేవలం పెద్ద నగరాల్లో మాత్రమే తెలుగు సినిమాలు విడుదలయ్యేవి. కానీ బాహుబలి తర్వాత పరిస్థితి మారింది. పెద్ద అభిమాన సంఘాలు ఉండే కధానాయకుల సినిమాలు చిన్న చిన్న పట్టణాలలో కూడా విడుదలవ్వడం మొదలయ్యింది. ఈ ప్రాభవం మూడేళ్లు కొనసాగింది. ఆ మూడేళ్లు పెద్ద హీరోలనుండి మంచి సినిమాలు రాకపోవడంతో కొంతమంది డిస్ట్రిబ్యూటర్లకు తీవ్ర నష్టాలొచ్చాయి. దానికి తోడు మూలిగేనక్క మీద తాటిపండులాగా కోవిడ్ సంక్షోభంతో స్వీడన్ దేశంలో తెలుగు సినిమాలు విడుదలకు నోచుకోవడంలేదు. స్టాక్ హామ్, గోతెన్బెర్గ్ లాంటి నగరాల్లో అప్పుడప్పుడూ విడుదలవుతున్నాయి. కానీ విచిత్రంగా కేవలం పదివేలు జనాభా ఉండే ఎల్మ్ హుల్ట్ [1] అనే ఊళ్ళో మాత్రం మిగిలిన అన్ని నగరాల కంటే ఎక్కువగా తెలుగు సినిమాలు విడుదలవుతాయి. దానికి కారణం అక్కడ ఉండే నాలుగొందల భారతీయ కుటుంబాలు. వారిలో ఎక్కువమంది తెలుగువాళ్లు.

ఇక దూర నగరాలకు వెళ్లి సినిమాలు చూసే ఓపికలేని నాలాంటివాళ్లకు మా ఊళ్లోని తెలుగు విద్యార్థులు ఆపత్బాంధవులయ్యారు. వారే తెలుగు సినిమాలు కొని, వూళ్ళో సినిమాహాల్లోని ఒక తెర అద్దెకుతీసుకుని ప్రదర్శిస్తుంటారు. కోవిడ్ కాలంలో వారికి కూడా స్పందన లేకపోవడంతో మా వూళ్ళో తెలుగు సినిమాలు రావడంలేదు.

ఇక మాకు మిగిలిన చివరి అవకాశం ఓటీటీలు. ఈ మధ్య వాటిలో కూడా లొకేషన్ ఆధారంగా కొన్ని సినిమాలను ఆపేస్తుండడంతో సినిమా కరువుతో కటకటలాడుతున్నాం.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?