కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార వికేంద్రీకరణ మరింతగా జరగాల్సిన అవసరముందా?

 ప్రజలపై కేంద్ర ప్రభుత్వ అజమాయిషీ ఎంత తగ్గితే దేశ అభివృద్ధికి, స్థానిక ప్రజాస్వామ్యాలకు అంత మంచిదనేది ఆర్ధిక నిపుణుల, రాజకీయ పరిశీలకుల అంచనా. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు అధికార వికేంద్రీకరణ, ఆర్ధిక స్వేచ్ఛ మరింత చెయ్యకపోయినా పర్లేదు కానీ ఇప్పటికే ఉన్నవాటిని లాక్కొని భవిష్యత్తులో రాష్ట్రాలపై ఉక్కు పిడికిలి బిగించకుండా ఉంటే సంతోషం. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఆ రెండోదానినే చేస్తుంది.

ఇటీవల పెట్రోల్ పెరుగుదలకు కేవలం రాష్ట్ర పన్నులే కారణమని, కేంద్రం ప్రజలపై ప్రేమతో 5 రూపాయలు తగ్గించినా రాష్ట్రాలు కనికరించకపోవడంతో పెట్రోల్ రేట్లు తగ్గడంలేదంటూ జరుగుతున్న ప్రచారంలోని నిజానిజాలను తెలుసుకోవడానికి పెట్రోల్, డీజిల్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల వివరాలను సేకరించాను.[1][2] ఆ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం యొక్క అతి తెలివితేటలు మరికొన్ని తెలిశాయి.

ఒకప్పుడు కేంద్ర సుంకాలలో రాష్ట్ర ప్రభుత్వాల వాటా 32% ఉండేది. అంటే ఒక రాష్ట్ర ప్రజలనుండి వసూలు చేసిన పన్నులలో వందకు 32 రూపాయలు తిరిగి ఆ రాష్ట్రప్రభుత్వానికే ఇవ్వాలి. అయితే జీఎస్టీని అమలుపరచడంతో రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం గణనీయంగా తగ్గుతుండడంతో 14వ ఆర్థికసంఘం సూచనమేరకు రాష్ట్రాల వాటాను 42 శాతానికి పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది[3] . పోనీలే ప్రత్యక్ష ఆదాయం తగ్గినా కేంద్రం ఇచ్చే వాటా పెరిగిందని రాష్ట్రాలు సరిపెట్టుకునేలోపు కేంద్రం తను వసూలు చేసే పన్నుల్లో ఎక్ససిస్ సుంకాన్ని తగ్గించి ఆ స్థానంలో రాష్ట్రాలతో పంచుకొనవసరం లేని సెస్సులను తీసుకొచ్చింది. ఉదాహరణకు 2014లో పెట్రోలుపై 10 రూపాయలు, డీజిల్ పై 4 రూపాయలు ఉండే సెస్సు పన్ను 2021 కి వచ్చేటప్పటికి వరుసగా 18 రూపాయలు, 12 రూపాయలు పెంచారు[4] . ఇలా పెంచేటప్పుడు ఎక్ససిస్ సుంకాన్ని తగ్గించడం ద్వారా రాష్ట్రాలకు వచ్చే ఆదాయానికి గండి కొట్టేసారు.ఈ సెస్సు వసూళ్ళలో పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వనవసరం లేదు. దీనితో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకప్పుడు ఉన్న 32% వాటా కంటే తక్కువ వస్తుంది. దీనికి తోడు 15వ ఆర్ధిక సంఘం సూచనలంటూ రాష్ట్రాల వాటాను 42% నుండి 41% కి తగ్గించేసింది.[5]

ఇక్కడ గమనించాల్సిన విషయం ఇంకొకటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోవడానికి బీజేపీ మద్దతుదారులు చెప్పే కారణాలలో అత్యంత హాస్యాస్పదమైంది రెండు సభలలో మద్దతు లేదని. కానీ పెట్రోలుపై ఎక్ససిస్ సుంకం తగ్గించి సెస్సు సుంకం పెంచడానికి అడ్డుగా ఉన్న ఆర్ధిక బిల్లు-2020 కి అసలు ఏ సభలోనూ చర్చకు తీసుకురాకుండానే మార్పు చేసేసారు. సంబంధంలేని చోట ప్రత్యేక హోదా వాదన తీసుకొచ్చానని నామీద విరుచుకుపడొద్దు. ఆంధ్రకు ప్రత్యేక హోదా కావాలని నేను కోరుకోవడంలేదు. దానికి నాకున్న కారణం మరిన్ని రాష్ట్రాలు తమకు కూడా హోదా కావాలని అడిగే అవకాశం ఉంది, ఈ రగడ ఏదో ఒక సమయాన దేశ సమిష్టికే భంగం కలగొచ్చు అని మాత్రమే. బీజేపీ మద్దతుదారులు ఈ కారణం చెప్పుంటే ఎంతో గౌరవంగా ఉండేది. కానీ వాళ్ళు అస్సలు నమ్మశక్యంకాని సభాబలం లాంటి చచ్చు కారణాలు చెప్పి జనాలను మభ్యపెడుతున్నారు. భవిష్యత్తులో ఆంధ్ర ప్రదేశ్ సీట్ల కోసం హోదాను ముందుకు తొయ్యోచ్చనే కుటిల ఆలోచన ఉంటే తప్ప ఇలాంటి కారణాలు చెప్పరు.

మళ్ళీ వికేంద్రీకరణ దగ్గరకు వచ్చేద్దాం. కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా రాష్ట్రాలను బలహీనపరిచడానికి కారణం పూర్తి అధికారం తన గుప్పిట్లో పెట్టుకుని రాష్టాల్లో జరిగే మౌలిక సదుపాయాల నిర్మాణాలను తమ పార్టీ పనులుగా చూపించుకోవడం కోసమే. తద్వారా రాష్ట్రాల్లో కూడా రాజకీయంగా బలపడొచ్చు అనే ఆలోచన ఉన్నట్లు కనిపిస్తుంది. దీనికోసం అధికార కేంద్రీకరణ చెయ్యడానికి కూడా వెనకాడడంలేదు. ప్రస్తుతం 41% గా ఉన్న రాష్ట్ర వాటాను 16వ ఆర్ధిక సంఘం తర్వాత మళ్ళీ 30లకు తెచ్చినా నేనేమీ పెద్దగా ఆశ్చర్యపోను.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?