కులాలు, మతాల మీద నమ్మకం లేదు అనేవాళ్ళు తమ కులం, మతం వాళ్లనే పెళ్లిచేసుకోవడం హిపోక్రసీ అవుతుందా? కాదా? ఎందుకు?
ప్రేమ వివాహాలు సమాజాన్ని ఎలా పాడుచేస్తున్నాయో తన స్నేహితునితో ఒక అరగంట చర్చించిన తర్వాత ఆ స్నేహితుణ్ణి సాగనంపి ఒక మధ్యవయసాయన హలులోకి వచ్చి కూర్చున్నారు.
అమ్మ వంటగదిలో గారెలు వేస్తుంటే అక్కడ కూర్చున్న కొడుకు "నాన్నా! ఒకవేళ నేను ప్రేమ వివాహం చేసుకుంటే ఏం చేస్తారు?" అని అడిగాడు.
"అప్పుడు నాకు ఒక్కడే కొడుకనుకుంటాను". అటువైపు నుండి సింగల్ లైన్ సమాధానం.
"అయితే కచ్చితంగా నేను అలాంటి పెళ్లే చేసుకుంటాను. నీ కులమని చెప్పుకుంటున్న సంబంధం చేసుకోను" అని కొడుకు తిరిగి సమాధానం చెప్పాడు. ఆ సంభాషణతో మొత్తం ఇల్లంతా నిశబ్దం అలుముకుంది, మరుగుతున్న నూనెలో వేగుతున్న గారెల శబ్దం తప్ప ఇంకెవరు మాట్లాడలేదు.
ఇక్కడ తప్పొప్పుల గురించి మాట్లాడుకుంటే ఒకే కులంలో తప్ప ఇంకెవరినీ పెళ్లి చేసుకోకూడదు అనుకునే తండ్రిది తప్పైతే, ఒకే కులం అయితే వాళ్ళు పెళ్లిచేసుకుకోకూడదు అనుకునే కొడుకుది కూడా తప్పే.
పై సంభాషణలో ఆ తండ్రి మా నాన్నగారు. కొడుకు నేను. కానీ నిజానికి మా నాన్నగారి సమాధానం తర్వాత నేను తిరిగి ఛాలెంజ్ లాంటివేమీ చెయ్యలేదు. కేవలం ఆలోచనలను పోల్చడానికి ఆ డైలాగ్ జత చేశాను.
కానీ కాలంతో పాటు మా నాన్నగారి ఆలోచనలు కూడా మారాయి. నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత చుట్టాలెవరైనా నా పెళ్లి మాట ఎత్తితే అది నా ఇష్టప్రకారమే జరుగుతుందని మా నాన్నగారు సమాధానం చెప్తుండడంతో ధైర్యం చేసి నేనిష్టపడిన అమ్మాయికి పెళ్లి ప్రతిపాదన చేశాను. రెండేళ్ల సస్పెన్స్ తర్వాత వాళ్ళింట్లో కులాంతర వివాహం ఒప్పుకోట్లేదని చావు కబురు చల్లగా చెప్పింది. మా ఆరేళ్ళ పరిచయంలో మా ఇద్దరిమధ్య ఎప్పుడూ రాని అంశం ఆ చివరిరోజు వచ్చింది. తెగిపోయిందన్న విషయం తెలియక ఇంట్లో మా అమ్మ, తమ్ముడూ వెళ్లి మాట్లాడతామని అడుగుతుంటే ఆర్నెల్ల తర్వాత వాళ్ళకి జరిగింది చెప్పాను. ఇక నా పెళ్లిని వ్యక్తిగతంగా తీసేసుకున్న మా అమ్మ పెద్దలు కుదిర్చిన పెళ్ళికి ఒప్పించి నాకు సంబంధాలు చూడమని తనకు తెలిసినవారందరికీ దండోరా వేసి నాలుగు నెలల్లో ఒక సంబంధం తీసుకొచ్చింది. పరిచయకార్యక్రమంలో ఇద్దరూ గంట మాట్లాడుకున్నాం. నా నుండి ఒక విజ్ఞప్తి, తన నుండి ఒక విజ్ఞప్తి ఇచ్చిపుచ్చుకున్నాం. పెళ్ళికి ముందే తనకి కూడా జరిగింది చెప్పాను. ఇద్దరికీ ఇష్టం అవడంతో రెండునెలల తర్వాత తాంబూలాలు, వెంటనే పెళ్లి. మా అమ్మ, నేను తీసుకున్న ఆ నిర్ణయం నా జీవితంలోనే ఒక మంచి నిర్ణయం అని ఇప్పటికీ నమ్ముతున్నాను.
నా పెళ్లి కధంతా ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే అసలు ఈ ప్రశ్న నా పూర్వపు సమాధానం వల్లే వచ్చింది కాబట్టి. చివరగా చెప్పేదొకటే. పెళ్ళి తన కులం వారిని మాత్రమే చేసుకొవాలి అనడం మూర్ఖత్వం. తన కులం వారిని చేసుకోకూడదు అనడం కూడా మూర్కత్వమే. సర్దిచెప్పుకోవడానికి సవాలక్ష కారణాలు చెప్పొచ్చు అనుకోవచ్చు, అలా అనుకుంటే నేను చెయ్యగలిగింది ఏమిలేదు.
Comments
Post a Comment