మీ అమ్మ చేసే వంటల్లో మీకు అత్యంత ఇష్టమైంది ఏంటి?

 మా అమ్మ చేసిన వంటల్లో నాకు బాగా ఇష్టమైనది పప్పు చారు. పప్పు చారు చేసిన రోజు పెరుగు కూడా వేసుకోను. కేవలం పప్పుచారుతోనే తింటాను. ఇప్పటికీ అదే అలవాటు. ఇక పప్పుచారుకి తోడుగా ఊరమిరపకాయలు ఉంటే అదే నాకు అమృతం లెక్క. ఈ లిస్టులో మా మేనత్త కూడా ఉంది. వాళ్ళింటికి ఎప్పుడు వెళ్లినా వెంటనే మా అమ్మని పప్పుచారు పెట్టమని అడుగుతుంది.

కానీ మా ఇంట్లో నేను తిన్న అత్యంత రుచికరమైన భోజనం వండింది మా అమ్మ కాదు. అసలు ఇష్టమైన కూరంటే అమ్మే చెయ్యాలనే స్టీరియోటైపుని బద్దలు కొట్టింది వంట చెయ్యడమే వృత్తిగా ఉన్న మా నాన్న. ఇంట్లో మా అందరికీ ఇష్టమైన కూరలు చేసి పొగిడించుకోవడం అంటే మా నాన్నకు చాలా ఇష్టం. కానీ రోజుకు పన్నెండు గంటల పనితో వంటకి అసలు ఖాళీ దొరికేది కాదు. ఎప్పుడైనా ఖాళీ దొరికితే మాంసాహారం వండడానికి ఇష్టపడేవారు. కానీ బిర్యానీ ముద్దలో యాలకులలాగా మా ఇంట్లో నేను తగలడ్డాను.

ఒకసారి మాత్రం నాకోసం ఆకాకరకాయ వేపుడు లాంటిది చేసారు. ఆ కూర చూడడానికి కిండర్ జాయ్ లోని చాక్లెట్ బంతుల్లాగా కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి. కోడి వేపుడనే అనుమానంతో తిననని చెబితే, కాదని ఒకటి తీసుకుని చూపించారు. అది ఆకాకరకాయే అని నిర్ధారించుకున్నాక చేత్తో ఒకటి తీసుకుని అలా నోట్లో వేసుకోగానే నా జీవితంలో ఎప్పుడూ తినని రుచి ఆ క్షణంలో ఆస్వాదించాను. కొబ్బరిపొట్టు మధ్యలోని ఆ ఆకాకర నాలుకపై జర్రున జారుతుంటే, అక్కడక్కడా ఆకాకర లేత గింజలు, వేగిన మసాలాలు కరకరలాడుతున్నాయి. అన్నం సగం కలిపేలోపే కూర మొత్తం లేపేసి బుల్లి బకాసురిడిలా పైకి లేచాను. మళ్ళీ ఇదే కూర నేను ఇంటర్ చదువుతున్నప్పుడు మరోసారి తిన్నాను. మిగిలిన అన్ని కూరలు నా స్నేహితుడొకడితో పంచుకునే నేను ఆ రోజు మాత్రం అయిష్టంగానే ఒక కొసరు విదిల్చాను. మొహమాటానికి మారుపేరైన వాడు అడిగి మరీ ఇంకో నాలుగు చెంచాలు వేసేసుకున్నాడు.

నేను భోజన ప్రియుడిని కాకపోయినా నాకిష్టమైన వంటల చిట్టా తయారు చేస్తే మిగిలినవన్నీ ఆ ఆకాకరకూరకి ఒక పది మెట్లు కిందే ఉంటాయి.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?