ఎవరైనా మీతో అత్యంత అహంకారంగా ప్రవర్తించిన సందర్భం ఉందా?
నేను పాఠశాలలో చదువుకునే రోజుల్లో ఒకసారి మా చుట్టాలింటికి వెళ్ళాను. ఎప్పుడూ వెళ్లే ఇల్లే కావడంతో నాకు కొత్త, పాత అని ఏమి ఉండేది కాదు. ఎప్పటిలాగానే ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు చక్కబెట్టేస్తుంటే ఒక వాక్మాన్ కనిపించింది. దానిని వాక్మాన్ అంటారన్న సంగతి కూడా అప్పుడు నాకు తెలియదు. మా ఇంట్లో ఉన్న పెద్ద టేపురికార్డు తప్ప అంతకుముందెప్పుడూ వాక్మాను లాంటి వస్తువుని చూడకపోవడంతో ఆసక్తి పెరిగిపోయి ఆ హెడ్సెట్ తలపై తగిలించేసి పాటలు లేకపోయినా "నా ఆటోగ్రాఫ్" సినిమాలో సునీల్ లాగా ఊగిపోతుంటే వెనక నుండి వచ్చిన మా చుట్టాలబ్బాయి భుజం మీద ఒక దెబ్బేసి ఈ వస్తువు నాలాంటివాళ్ల కోసం చేసింది కాదనే అర్ధం వచ్చేలా ఒక మాటన్నాడు. దాన్ని వాడొద్దంటున్నాడు అనే విషయం వెంటనే అర్ధం అయ్యిందిగాని తాను వాడిన పదంలోని అసలర్థం తెలియడానికి చాలా కాలమే పట్టింది.
ఇక నేను చేసిన ఘనకార్యం తలచుకుంటే మా చుట్టాలబ్బాయి చేసింది జుజుబీ అనిపిస్తుంది. ఇంజనీరింగ్ చదివే రోజుల్లో చాలా మంది కుర్ర సన్నాసుల్లాగానే నేను కూడా వెకిలి మాటల్నే హాస్యం అని నమ్ముతున్న సమయమది. రూముల్లో కూర్చుని సోది కబుర్లు చెప్పుకుంటుండగా నా స్నేహితుడొకడు బ్యాంకు పరీక్షలకి సన్నద్ధమౌతున్నాడని చెప్పాడు. బుర్రా బుద్ధి పనిచేయకుండా వెంటనే నేను "ముందు బ్యాంకు స్పెల్లింగ్ చెప్పారా!" అనేశాను. ఆ తర్వాత నుండి ఆ అబ్బాయి నాతో సరిగ్గా మాట్లాడడం మానేసాడు. అది నేను గమనించేటప్పటికే కొన్ని నెలలు గడిచిపోయాయి. అది గమనించి విషయమేంటని ఆరా తీస్తే మరొక స్నేహితుడు అసలు సంగతి చెప్పాడు. తప్పు తెలిసొచ్చి క్షమించమని అడిగినా అది మనసు నుండి రాలేదనే భావంతో ముదుసరిగానే మాటలు నడిచాయి. ఇప్పుడు ఎవరి జీవితాల్లో వాళ్ళు నిలదొక్కుకుని అప్పుడప్పుడూ మాట్లాడుకుంటున్నా నేనన్న మాట మాత్రం మర్చిపోలేకపోతున్నాను.
Comments
Post a Comment