మీరు చిన్నప్పుడు ఆడిన ఏయే ఆటలు ఇప్పటి పిల్లలు ఆడటం లేదు? ఆ ఆటలతో ఉన్న మీ అనుబంధం ఎటువంటిది? ఆ ఆటలు ఇప్పుడు ఎందుకు కనుమరుగు అయ్యినాయి?
నత్తగుల్లలాట.
ఈ ఆట ఇప్పటిపిల్లలు ఆడకపోవడం ఒకరకంగా సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే అది కొంచెం అసహ్యమైనదీ, గాయపడే అవకాశం కూడా ఎక్కువ. ఇప్పటిపిల్లలే కాదు, నా చిన్నప్పుడు కూడా ఆక్వా సాగు ఎక్కువగా జరిగే గ్రామాల్లో తప్ప ఇంకెక్కడా ఆడేవారుకాదు. ఆ గ్రామాల్లో మాత్రమే పెద్దమొత్తంలో నత్తలను ఆక్వా సాగులో మేతగా వాడడంతో మాకు ఆడుకోవడానికి నత్తగుల్లలు ఎక్కువగా దొరికేవి. ఇప్పుడు ఆ ఊళ్ళల్లో కూడా ఆడడం మానేసారు.
ఆట విధానం:
- ముందుగా నత్తగుల్లల కుప్పని పిల్లలందరూ సమానంగా పంచుకుంటారు.
- ఆ తర్వాత ఇద్దరిద్దరుగా పోటీపడతారు.
- ప్రతీ ఆటగాడు తన వాటాగా వచ్చిన నత్తగుల్లల్లో ఒక బలమైన, పెద్ద నత్తని ఎంచుకోవాలి. దీనిని సేవ నత్త అంటారు.
- ఆటగాళ్లు ఇద్దరిలో ముందు ఎవరు మొదలుపెట్టాలో తేల్చడానికి బొమ్మా బొరుసు వేస్తారు. గెలిచినవారు దాడి చెయ్యడం మొదలుపెట్టొచ్చు.
- సేవ నత్తని అచ్చం క్రికెట్ బాల్ పట్టుకున్నట్లు ఈ క్రింది విధంగా రెండు వేళ్ళతో నత్తగుల్ల లోపలినుండి పట్టుకోవాలి.
- ప్రత్యర్ది ఆటగాడు తన దగ్గరున్న నత్తగుల్లల్లో ఒకదానిని బల్లపరుపుగా ఉన్న రాయిమీదగాని, చెక్కమీదగాని పెడతారు. ఇదే పిచ్ అన్నమాట. అలా పెట్టడాన్ని కాయడం అంటారు.
- దాడి చేసే ఆటగాడు తన సేవ నత్తతో దానిని బలంగా కొడతాడు. ఒకవేళ కాసిన నత్త పగిలిపోతే ప్రత్యర్ది ఆటగాడు మళ్ళీ ఇంకో నత్త పెట్టాలి. ఈ ప్రక్రియ సేవ నత్త పగిలే వరకు కొనసాగుతుంది.
- ఒకవేళ సేవ నత్త పగిలిపోతే దాడి చేసే వంతు ప్రత్యర్ది ఆటగాడిదవుతుంది. ఇప్పటివరకూ దాడిచేసిన ఆటగాడు ఇప్పుడు తన నత్తగుల్లలను కాయాలి.
- ఇదంతా ఎవరోఒకరి దగ్గర నత్తలన్నీ ఐపోయేవరకు సాగుతుంది. చివరికి ఎవరిదగ్గర నత్తలు అయిపోతే వాళ్ళు ఓడిపోయినట్లు.
గెలిచిన ఆటగాడు తన సేవ నత్తను ఒక ట్రోఫీలాగా ఇంటికి తీసుకెళ్తాడు, తర్వాతిరోజు మళ్ళీ వాడుకోవడానికి. ఈ ఆట ఆడే క్రమంలో బలంగా కొట్టడంవల్ల పగిలిన గుల్లపెంకులు ఒక్కోసారి వేళ్ళల్లో దిగిపోయేవి. సలుపు తట్టుకోలేక ఆ రాత్రంతా దొర్లుతూ మమ్మల్ని మేమే తిట్టుకునేవాళ్ళం. మళ్ళీ తెల్లారగానే ఎక్కడ నత్తగుల్లలున్నాయో వెతుక్కునేవాళ్ళం. నేను నత్తగుల్లలాట ఆడానన్న సంగతి అమ్మమ్మ, తాతకి తెలిసినా ఏమనేవాళ్ళు కాదుగాని మా అమ్మకి తెలిస్తే వీపు విమానం మోత మోగేసేది. తుమ్మ తోటల్లో నత్తగుల్లలు పొసే చోటే పాములుంటాయని మా అమ్మ భయం.
అప్పట్లో ఏదో అలా ఆడేసేవాళ్ళంగాని ఒకవేళ ఇప్పటిపిల్లలకు అవకాశం దొరికేసి ఆడతామంటే ఆడొద్దనే చెబుతాను.
ఆ నత్తగుల్లలు ఈవిధంగా ఉంటాయి.
Comments
Post a Comment