మీరు ప్రభుత్వ లేదా ప్రైవేట్ కార్యాలయాల్లో ఏదో ఒక రూపంలో లంచం ఇవ్వవలసి వచ్చిన సందర్భాలు ఎదురయినపుడు మీరు ఎలా స్పందించారో వివరించగలరు?
ఇంజనీరింగ్ అయిపోయి, వచ్చిన ఉద్యోగం పిలుపు కోసం వేచిచూస్తున్న రోజుల్లో పాసుపోర్టు ఉంటే భవిష్యత్తులో ఉపయోగపడుతుందేమోనని దానికి అప్లై చేసుకుందామని నిర్ణయించుకున్నాను. దానికి కావలసిన తప్పనిసరి పత్రాలలో జనన ధ్రువీకరణపత్రం, రెండు చిరునామా రుజువులు కూడా ఉన్నాయి. రేషన్ కార్డు, ఓటు గుర్తింపు కార్డు మీద వేరువేరు చిరునామాలు ఉండడంతో మరో ధ్రువపత్రం కావాల్సొచ్చింది.
జనన ధ్రువీకరణపత్రం కోసం ఇంట్లో అడిగితే అటువంటివేం లేవు, నీకు కావాలంటే వెళ్లి అప్లై చేసుకుని తెచుకొమ్మని పంచాయితీ ఆఫీసుకి తోలేసారు. అక్కడ రికార్డుల్లో నా పేరు లేదని, ఎమ్మార్వో ఆఫీసుకి సాగనంపారు. పనిలోపనిగా చిరునామా ధ్రువపత్రానికి కూడా అర్జీ పెట్టుకుని, ఆరోజే ఎమ్మార్వోగారి సంతకం కూడా తీసుకున్నాను. కానీ దాన్ని నా చేతిలో పెట్టడానికి అక్కడి గుమాస్తాగారు "ఎంతో కొంత ఇవ్వాలి కదా బాబు" అని అడిగితే, నిజమేకదా అనుకుని జేబులో ఉన్న కొత్త ఐదు రూపాయల బిళ్ళ ఆయన చేతిలో పెట్టాను. ఆ బిళ్ళ వంక, ఆ తర్వాత నా వంక తదేకంగా చూస్తూ ఉండిపోయిన గుమాస్తాగారు కాసేపటికి తేరుకుని దాన్ని సంతకం పెట్టిన పేపర్తో సహా నా మొహం మీద కొట్టారు. పోన్లే ఐదు రూపాయలు మిగిలాయి అనుకుని పనిలోపని ఆ జనన ధ్రువీకరణపత్రం కూడా ఇప్పించమని అడిగితే మళ్ళీ కనిపించావంటే కాళ్ళిరగ్గొడతానని మర్యాదగా చెప్పారు. ఇదంతా గమనించిన మరో ఉద్యోగి రేపు రమ్మని చెబితే అలాగేనని మళ్ళీ తర్వాతిరోజు కరెక్టుగా పదింటికి వెళ్లి నిలబడ్డాను. గుమాస్తాగారు గుర్తుపట్టి లోపలికి వెళ్ళిపోతే వెనకనున్న ఆ మరో ఉద్యోగి లోపలున్న ఇంకొక సారు దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ ఒక పదినిమిషాలు లైనులో నిలబడ్డాక అసలు నా జననం నమోదు చెయ్యలేదని, దానికోసం సబ్ కలెక్టర్ ఆఫీసులో అర్జీ పెట్టుకుంటే వారు ఆర్దరు వేస్తే అప్పుడు నమోదు చేస్తామని చెప్పి పంపించేశారు. ఇక తదుపరి దండయాత్ర రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీసుపై చేశాను.
నోటరీ చేయించి, కట్టాల్సిన ఏడొందలు ఫైను కట్టేసి అర్జీ పెట్టుకున్న నలభై రోజులకి కలెక్టర్గారు ఆర్దరు ఇచ్చారని కబురొచ్చింది. తెచ్చుకోవడానికి వెళ్తే అక్కడ ఉన్న మరో ఆఫీసరు గారు "నీ తెలుగు చాలా కృత్రిమంగా ఉందేంటి, నువ్వు తెలుగోడివేనా?" అని అడిగారు. నేను మాట్లాడితే "మీది తూ.గో.జీ నా? ప.గో.జీ నా" అని అడిగేవాళ్లే తప్ప "నీదేం తెలుగు?" అని అడిగిన మొట్టమొదటీ, చిట్టచివరి వ్యక్తి కూడా ఆయనే. అటజని కాంచె పద్యాన్ని గుక్కతిప్పకుండా చెప్పి నేనూ తెలుగోడినేనని నిరూపించుకుందామనుకున్నాను కానీ, "అదుగో! నువ్వు హిందీ మాట్లాడుతున్నావ్" అంటాడేమోననని భయమేసి, ఆహ నా పెళ్ళంటాలో నూతన్ ప్రసాద్ గారిలాగా నా పుట్టుపూర్వోత్తరాలు చెప్పుకుని నిరూపించుకున్నాను. చివరికి రెండొందలిచ్చి ఆర్డర్ తీసుకెళ్లమని చెప్తే ఇక నా వల్ల కాక ఇంటికి తిరిగొచ్చేసాను. మరో మూడ్రోజులకి ఆర్దరు పట్టుకెళ్ళమని మళ్ళీ ఫోన్ చేస్తే నీకివన్నీ అర్ధంకాదు, ఈ వందా ఇచ్చేయ్యని నాన్న జేబులో పెట్టి పంపించారు. ఆవిధంగా నేను ఇండియాలోనే పుట్టానని నిరూపించుకున్నాను.
Comments
Post a Comment