ఒక ప్రణాళిక వేసుకున్నాకా చివరకు ఏవో పరిస్థితులు ఎదురై అది జరగదు. అసలు ప్రణాళిక వేసుకోవడమే అనవసరమా? ఈ విషయాన్ని ఎలా తీసుకోవాలి?

 ప్రశ్న చూడగానే ఏడాదిక్రితం నేను ఇండియా ప్రయాణానికి ముందు నేను వేసుకున్న ప్రణాళికా, దాని అమలు గుర్తొచ్చాయి.

కొన్ని అనుకోని కారణాలవల్ల మేము నాలుగేళ్లపాటు ఇండియా వెళ్ళడానికి కుదరలేదు. చివరికి అన్నీ కుదిరి మా బావమరిది పెళ్ళికి ఇండియా ప్రయాణం పెట్టుకున్నాము. నాలుగున్నరేళ్ళపాటు మనదేశంలో లేకపోవడంతో అక్కడ నేను చెయ్యాల్సిన పనులు కొండలా పేరుకుపోయాయి. ప్రయాణానికి రెండు నెలలముందు నుండే చెయ్యాల్సిన పనులు చిట్టా రాయడం మొదలుపెడితే ఒక పాతిక వరకు తేలాయి. అక్కడితో ఆగకుండా ఏరోజు ఏం చెయ్యాలో కూడా ప్రణాళిక వేసేసుకున్నాను.

వచ్చిన రెండో రోజే ఏటిపీతలు తెచ్చి కూర వండించుకుని తినేసి నా చిట్టాలో ఉన్న మొదటి పనిమీద గీత పెట్టుకున్నాను. కానీ ఆ తర్వాతే మొదలయ్యింది అసలు సమస్య. బ్యాంకులో ఒక పూటలో అయిపోతుందనుకున్న పనికి మూడు రోజులు పట్టింది. ఆ తర్వాత బావమరిది పెళ్లి పనుల్లో ఇంకో పది రోజులు పోయాయి. మా అమ్మాయి వీసాకి ఢిల్లీ వెళ్లాల్సి రావడంతో ఇంకో రెండ్రోజులు ఎగిరిపోయాయి. చుట్టాలింటికి ప్రయాణాలు, స్నేహితులను కలవడాలు లాంటి ప్రణాళికలోలేని ముఖ్యమైన పనులవలన చిట్టాలో ఐదారు తప్ప మిగిలినవేమి చెయ్యకుండానే తిరిగి ఉద్యోగానికి వచ్చేసాను. ఈసారి వెళ్ళేటప్పుడు ప్రణాళిక వేయకూడదని తిట్టుకున్నాను.

కానీ తర్వాత ఆలోచిస్తే ప్రణాళికలో నలభై రోజుల్లో పూర్తి చెయ్యలేనన్ని పనులు పెట్టుకున్నానని అర్ధం అయ్యింది. రాసుకున్న చిట్టాలో ముఖ్యంగా చెయ్యాల్సిన పనులు ముందు చెయ్యకుండా పీతలకూర, చేపలపులుసు అంటూ మొదలుపెట్టాను. నా చేతుల్లో లేని బ్యాంకు పనులకు ముందుచూపుతో ఒక వారం రోజులు కేటాయించాల్సి ఉండాల్సింది.

ఇండియాలో ఉంటున్నవారినుండి సమాచారం తీసుకోకుండా నా పనులకు అయ్యే ఖర్చు, సమయం నేనే ఊహించుకున్నాను. అందులోనూ నేను ఒక పెళ్ళికి వస్తున్నానని, నాకు ఒక చిన్న పాప ఉందన్న అంశాలను పరిగణాలలోకి తీసుకోలేదు. ఇంకెప్పుడైనా ప్రణాళిక వేసేటప్పుడు ఇవన్నీ ఆలోచించాలిగాని అసలు ప్రణాళిక వెయ్యకూడదని అనుకోకూడదు అని నిర్ణయించుకున్నాను.

కాబట్టి ప్రణాళిక వేసుకునేటప్పుడు మనకున్న సమయంబట్టి పనులు నెత్తిన పెట్టుకోవాలి. ముఖ్యమైన పనులు ముందు పూర్తి చేసుకోవాలి. మన చేతుల్లో లేని పనులకు ఎక్కువ సమయం కేటాయించాలి. చెయ్యబోయే పనులగురించి తెలిసినవారిని అడిగి సమాచారం తీసుకోవాలి. మరోసారి ప్రణాళిక వేసినప్పుడు ఇవ్వన్నీ దృష్టిలో పెట్టుకుని దాని ఫలితం ఎలా ఉందొ తెలియచేస్తాను.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?