విదేశాల్లోని తెలుగువారు సంక్రాంతి ఎలా జరుపుకుంటారు?

 ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎవరి ఇళ్లల్లో వాళ్లే పండుగ జరుపుకుంటున్నాం గానీ 2019 వరకూ మా ఊళ్లోని చాలామంది భారతీయులు దీపావళి, సంక్రాంతి లాంటి పండుగలను సమూహంగానే జరుపుకునేవాళ్ళం.

మా ఊరిలోని భారతీయులందరికీ పెద్దన్నయ్యలాంటి నరసింహంగారికి మన సంస్కృతి, పండగ సంప్రదాయాలంటే మక్కువ. ఏదైనా పెద్ద పండగ వస్తుంటే ఆ సంబరాల ఏర్పాటుకు తొలిఅడుగు ఆయనే వేసేవారు. పండుగకు నెల రోజుల ముందే పండుగ జరుపుకోవడానికి ఎంతమంది ఆసక్తిగా ఉన్నారో కనుక్కుని దాన్నిబట్టి కమ్యూన్ కి చెందిన ఎదో ఒక హాల్ అద్దెకు తీసుకుంటాము. సంక్రాంతి పండుగకు ఇరవై నుండి నలబై కుటుంబాలు పాల్గొనేవి.

సంక్రాంతికి మా భోజనాలు మేమే ఏర్పాటు చేసుకుంటాం. పులిహోర, చిత్రాన్నం, అన్నం, సాంబార్, బూరె, చపాతీ, కుర్మా లాంటి మామూలు వంటకాలతో పాటూ ఎవరికైనా ఆసక్తి ఉంటే బొబ్బట్లు, గులాబ్ జామున్, జంతికలు లాంటివి కూడా చేసుకుని తీసుకురావొచ్చు. హాల్ అద్దె, మిగతా ఖర్చులు లెక్కేసుకుని ప్రతీ కుటుంబానికి ఎంత పడిందో నిర్ణయించుకుంటాం.

ఇక పండుగ రోజు కొంతమంది ముందుగా వెళ్లి హాలును అలంకరిస్తారు. హాలు అలంకరణంటే మన పెళ్లి మండపాలలా ఊహించుకోవద్దు. ఆరు జతల ప్లాస్టిక్ పూల దండలు, కొన్ని కాగితపు పూల కుచ్చిళ్ళు, రెండు ఓణీలు, ఒక పంచె. గత ఆరేళ్లుగా ఇవే వాడుతున్నాం. వీటితోపాటు పండుగ మొదలుపెట్టడానికి ఒక జత దీపపు కుందెలు కూడా సిద్ధం చేస్తారు. ఆ తర్వాత ఔత్సాహికుల, చిన్నపిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తర్వాత భోజనాలు, చివర్లో ఉట్టి కొట్టే కార్యక్రమం ఉంటుంది. పోయినేడాది నరసింహంగారు హరిదాసు వేషంలో అలరించారు.

మాకున్న కొన్ని పరిమితుల దృష్ట్యా కొన్ని సంప్రదాయాలను చేయలేకపోగా, మరికొన్నింటిని మాకు చేతనైనట్లు అనుకూలంగా మార్చుకుంటాము. ఉదాహరణకు భోగి మంట వెయ్యడానికి మాకు కమ్యూన్ నుండి అనుమతి ఉండదు. అది కావాలంటే పోలీసుశాఖ అనుమతితో, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో చెయ్యాలి. మాకంత ఓపిక లేక అది వదిలేశాం. పిల్లలకు భోగిపళ్లు పొయ్యడానికి రేగిపళ్ళు దొరకక బ్లూ బెర్రీలు వాడుతున్నాం. తంబుర లేక హరిదాసు చేతిలో గిటార్ పెట్టాము. ఉట్టిలో మట్టి కుండ బదులు తొలిచిన పుచ్చకాయలో చాకోలెట్లు వేసాము. ఏదేమైనా మా ప్రధాన ఉద్దేశ్యం సంబరాలు చేసుకోవడం, మా పిల్లలకు పండుగ ప్రాముఖ్యత చెప్పడం. ఆ రెండూ నెరవేరుతున్నాయని అనుకుంటున్నాను. కనీసం వచ్చే ఏడాదినుండైనా మళ్ళీ సంక్రాంతి ఇలా చేసుకోవాలని చిన్న ఆశ.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?