తిరుమల ఆలయ ప్రవేశానికి ఇతర మతస్థులు ఇవ్వాల్సిన మత డిక్లరేషన్ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? రద్దు చేయాలన్న ఆలోచనలు కరెక్టా? కాదా? ఎందుకు?
ఆలయ ప్రవేశానికి ఆ దేవునిపై నమ్మకం ఉన్నట్లు డిక్లరేషన్ ఇవ్వాలనే విషయంలో నాకు అస్సలు అభ్యంతరం లేదు. కులం పేరు చెప్పో, మతం పేరు చెప్పో ఆపడం కంటే నమ్మకముంటే ఎవరైనా రావొచ్చు అనేది కొంచెం సమంజసంగానే ఉంది.
ఇక తిరుమలలో ఇవ్వాల్సిన డిక్లరేషన్ అనేది కేవలం ఇతర మతస్తులకే కాదు, హిందువులు కానీ వారందరికీ. అంటే దైవం అనే భావన లేనివారు కూడా. ఇక ఇది కరెక్టా కదా అనే విషయం చర్చించాలంటే కాసేపు నేనొక సెలబ్రిటీ అన్నట్లు ఊహించుకోవాలి. నా ఇంటిపక్కోళ్లకి కూడా ఎవరినో తెలియని నాలాంటి అనామకుడిని ఎవరూ పట్టించుకోరు కాబట్టి ఈ సమాధానం చదివేవారకూ దయచేసి నన్నో సెలబ్రిటీ అనుకోండి.
తిరుపతికి ఇప్పటివరకూ పదిసార్లు వెళ్ళుంటాను. మొదటి రెండుసార్లు, చివరి రెండుసార్లు తప్ప మిగిలినవన్నీ మనసులో భక్తితోనే వెళ్ళినవే. నాకు నమ్మకం ఉన్నప్పుడైనా లేనప్పుడైనా తిరుపతి వెళ్లడం అంటే నాకు ఎప్పుడూ ఇష్టమే. దానికి మొదటి కారణం నా కుటుంబసభ్యులు, రెండవది నా ఆసక్తి. తిరుపతికి వెళ్లే క్రమంలో ఆ సంప్రదాయాలకు తగ్గట్లు పంచె కట్టుకోమన్నా, తిరునామం పెట్టుకోవాలన్నా, చివరికి గుండు కొట్టించుకోవాలన్నా నాకేం అభ్యంతరం లేదు. కానీ దేవుని మీద నమ్మకం ఉండాలి అనే సంతకం పెట్టమంటే కొంచెం అభ్యంతరం. అయినా ఇదేమి నన్ను విపరీతంగా ఇబ్బంది పెట్టే విషయం కాదు కాబట్టి సంతకం పెట్టేసి వెళ్ళిపోతాను. ఎందుకంటే నేనొక్కడినే ఇంటిదగ్గరో, రూములోనో కూర్చుంటే నా కుటుంబసభ్యులు వెళ్లి దర్శనం చేసుకుని రారు. మా అమ్మాయి అస్సలు వెళ్ళదు. తనకు గుడి చూపించాలి కాబట్టి నేను కూడా వెళ్తాను. దానికోసం నా అభిప్రాయం చంపేసుకోవడానికి వెనకాడను. మా అమ్మాయి నాస్తికురాలు అవ్వడానికి ఎంత అవకాశం ఉందో హిందువు అవ్వడానికి కూడా అంతే అవకాశం ఉంది. పట్టుదలతో నా అభిప్రాయాలను తనమీద బలవంతంగా రుద్దాలనుకోవడం లేదు.
ఇక తనను తాను మోసం చేసుకోవడం ఇష్టం లేక సంతకం పెట్టని వారు కూడా ఉంటారు కదా. ఒకవేళ అలాంటివారు వెళ్లకపోతే, వారికోసం వారి భార్య/ భర్త, పిల్లలు వెళ్లకపోతే ఒక హిందువుని గుడికి వెళ్లకుండా ఆపకుండానే ఆపినట్లవుతుంది. మరో మనిషిని హైందవం పాటించకుండా అడ్డుకున్నట్లవుతుంది. దానికి కారణం డిక్లరేషన్ అయితే ఆ విధంగా అది హైందవానికి నష్టం చేస్తుందో లాభం చేస్తుందో ఆలోచించుకోవాలి.
Comments
Post a Comment