మీ కుటుంబ సభ్యులు కానివారు, మీ జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని వ్యక్తి ఎవరు? ఎందుకు?
నా మొట్టమొదటి టీమ్ లీడ్ నాగరాజన్ గారు.
కళాశాల నుండి నేరుగా ఉద్యోగంలో చేరిన కొత్తలో నాకు అక్కడి పరిస్థితులకు వెంటనే అలవాటు పడలేకపోయాను. ప్రాజెక్ట్ లో నేను కనుగొన్న సమస్యలను సరిగా వివరించలేకపోయేవాడిని. కోడింగ్ లో కూడా సమస్య పరిష్కరించడానికే చూసేవాడిని తప్ప, పక్కవారికి నా పరిష్కారం అర్ధం అవుతుందో లేదో ఆలోచించే వాడిని కాదు. నాగరాజన్ నాకు ఇటువంటి విషయాలు చాలా సమగ్రంగా వివరించేవారు. ముఖ్యంగా క్లయింట్స్ తో ఎలా మాట్లాడాలో నేర్పించారు. ఒక పనికి ఎంత సమయం పడుతుంది అని లెక్కవేయడానికి ఏమేమి పరిగణనలోకి తీసుకోవాలి లాంటి విషయాలు కూడా ఆయన దగ్గరే నేర్చుకున్నాను.
ఒకసారి మేము తయారుచేసిన ప్రోగామ్ ప్రొడక్షన్లో పనిచేయకపోవడంవల్ల కస్టమర్ రిపోర్టులు మొత్తం ఆగిపోయాయి. విషయం పైస్థాయి వరకు వెళ్లిపోవడంతో జరిగిన తప్పుని సరిదిద్దడానికి మాకు ఒక పనిరోజు సమయం ఇచ్చారు. కానీ అది ఒకరోజుతో పూర్తయ్యే పనిలాగా కనిపించలేదు. అదృష్టం కొద్దీ తర్వాతి రెండు రోజులు కస్టమర్ కి సెలవు కావడంతో మాకు అనధికారికంగా ఇంకో రెండు రోజులు అదనంగా లభించినట్లయింది. టీంలో ఉన్న ఇద్దరు డెవలపర్ల మీద భారం పడింది. అసలు వారాంతంలో ఆఫీసుకు రాకూడదని నిర్ణయించుకుని గురువారం సాయంత్రం పనిమొదలుపెడితే అది ఆదివారం రాత్రి పన్నెండింటికి పూర్తయ్యింది. ఆ మూడు రోజులూ పొద్దున్నే ఎనిమిదింటికి ఆఫీసుకి వచ్చి రాత్రి పన్నెండింటికి ఇంటికెళ్ళేవాళ్ళం. టీంలో మిగిలిన వాళ్ళు రాకపోయినా, అసలు డీబగ్గింగ్ తన పని కాకపోయినా ఆ మూడు రోజులూ నాగరాజన్ మాతోనే ఉన్నారు. నాకు బైక్ లేదని నన్ను షోలింగనల్లూరులో దిగబెట్టి తిరిగి మళ్ళీ తనింటికి వెళ్లేవారు.
ఆ తర్వాత రెండేళ్ళకి అదే ప్రాజెక్ట్ మీద నన్ను విదేశాలకు పంపి, అక్కడ నా రిపోర్టింగ్ మేనేజర్తో నేను తగువేసుకుంటే నాకు ఐటీ ఇండస్ట్రీలో ఎలా మెలగాలో దిశానిర్దేశం చేసారు. ఇప్పుడు వేరే వేరే కంపెనీలలో ఉన్నప్పటికీ అప్పుడప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం.
Comments
Post a Comment