మీరెప్పుడన్నా తప్పిపోయారా ? మళ్ళీ దొరికారా?
పెళ్ళైన కొత్తలో ఇటువంటిదే ఒక సంఘటన జరిగింది. తలచుకున్నప్పుడల్లా అంత అనాలోచితంగా అలా ఎందుకు చేసానా అనిపిస్తుంది.
అప్పటివరకూ నా భార్య చూసిన అతిపెద్ద పట్టణం విశాఖపట్నం. అంతకుముందెప్పుడూ తెలుగు రాష్ట్రం దాటి బయటకెళ్ళింది లేదు. పెళ్లయిన మూడ్నెళ్లకు చెన్నై తీసుకెళ్ళాను. ఆరోజు సాయంత్రం సినిమాకు వెళదామని నిర్ణయించుకుని జురాసిక్ వరల్డ్ సినిమాకు టిక్కెట్లు బుక్ చేసుకున్నాం. సినిమా థియేటర్ మా ఇంటికీ, ఆఫీసుకి మధ్యలో ఉంటుంది. నేను ఆఫీసుకు వెళ్లి మళ్ళీ సాయంత్రం ఇంటికొచ్చి తనను సినిమాకు తీసుకెళ్లాలనేది మేము వేసుకున్న ప్లాన్.
కానీ ఆఫీసుకు బయల్దేరేటప్పుడు నా ప్రయాణ భారం తగ్గించుకునే ఆలోచన వచ్చి సినిమా సమయానికి తనే థియేటర్కి వచ్చేస్తే హడావిడి ఉండదుకదా అనిపించి నేను బస్సెక్కడానికి వెళ్ళేటప్పుడు తనను కూడా తీసుకెళ్లి ఇంటి నుండి బస్టాప్కి దారి చూపించాను. వెళ్లే దారిలో కొండగుర్తులాగా వినాయకుడి గుడి చూపించాను. అక్కడినుండి నేను ఆఫీసుకి వెళ్ళిపోయాను. తను ఇంటికి వెళ్ళిపోయింది.
సాయంత్రం సినిమా సమయానికి ఫోన్ చేసి తనను బయలుదేరి, బస్సెక్కిన పది నిమిషాలకు చెబితే నేనుకూడా ఆఫీస్ నుండి బయల్దేరతానని చెప్పాను. తను బయల్దేరిన పది నిమిషాలకు ఫోన్ చేసింది, పొద్దున్న చెప్పినట్లు వినాయకుడి గుడి దగ్గర కుడి వైపుకి తిరిగితే ఎంత ముందుకెళ్లినా మెయిన్ రోడ్డు రావడంలేదని. అప్పుడర్ధమయ్యింది దారి సరిగా చెప్పడంలో నేనేదో పొరపాటు చేసానని. అక్కడ వీధికొక వినాయకుడి గుడి ఉంది. ఎవరినైనా దారి అడగడానికి తనకు తమిళం రాదు. ఎవరిని అడిగితే ఏమవుతుందోనని అక్కడ గుడి దగ్గర పువ్వులమ్మేవారు, కొబ్బరికాయలమ్మేవారు ఎవరైనా ఉన్నారేమో వాళ్లకు ఫోన్ ఇమ్మని చెప్పాను. రోడ్డు మీద ఎవరో వెళుతుంటే వాళ్లకు ఫోన్ ఇచ్చింది. అతనితో తనకు బస్టాండుకు వెళ్ళడానికి దారి చూపించమని చెప్పాను. దారితప్పిపోయిందని నాక్కూడా భయమేసి వెంటనే ఆఫీస్నుండి బయల్దేరాను. ఆటో ఎక్కి తనకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం లేదు. నాకు దడ మొదలయ్యింది. మా బస్టాప్ కి వెళ్ళడానికి అరగంట పడుతుంది. నాకంత సమయం లేదనిపించి ఆటో డ్రైవరుకు పరిస్థితి చెప్పి కొంచెం తొందరగా వెళ్ళమని వేడుకున్నాను. సరిగ్గా బస్టాప్ కి వచేస్తున్నాననగా తన ఫోన్ నుండి కాల్ వచ్చింది. రింగ్ వినబడేలోపే ఫోన్ ఎత్తితే "ఇంకో పది నిమిషాల్లో థియేటర్ దగ్గర దిగుతాను" అని చెప్పింది. నవ్వూ, ఏడుపూ కలగలిపిన మొహంతో ఆటో సారథికి వెనక్కి తిప్పమని చెప్పి తిరిగి థియేటర్కి వెళ్ళాను.
Comments
Post a Comment