మీ ఊరిలో (పట్టణంలో, దేశం లో) మీ ఇంటి నుండి వచ్చే చెత్త (తడి, పొడి, శానిటరి) అంతా ఎక్కడకి పోతుంది? పర్యావణానికి కీడు ఎక్కువ కాకుండా ఉండ డానికి మనం ఇంకా ఏమి చేయగలుగుతాము?
నేను స్వీడన్ దేశంలో ఒక చిన్న పట్టణంలో నివసిస్తున్నాను. కౌంటీ( స్వీడిష్లో ల్యాన్), మున్సిపాలిటీ (కమ్యూన్) ఏదైనప్పటికీ వ్యర్ధ పదార్ధాల నిర్వహణకు మాత్రం దేశం మొత్తం ఒకే విధానం అమలులో ఉంది. కొన్ని ప్రత్యేక వస్తువుల విషయంలో కమ్యూన్ నిబంధనలు మారతాయి. వీటిని అమలుపరిచే విధానాలూ, దానికోసం వసూలు చేసే రుసుమూ స్థానిక ప్రభుత్వాలు నిర్ణయించుకోవచ్చు.
ఇళ్ళలో ఉత్పత్తి అయ్యే చెత్తను మా మున్సిపాలిటీ ప్రధానంగా ఎనిమిది రకాలుగా విభజించారు.
- ఆహార పదార్ధాలనుండి వచ్చే తడి చెత్త.
- పునర్వినియోగం చెయ్యగలిగే పాస్టిక్ ప్యాకింగ్, బాటిళ్లు, మూతలు
- అట్ట ప్యాకింగ్, టెట్రా ప్యాకింగ్
- వార్తా పత్రికలు
- లోపపు ప్యాకింగ్
- పారదర్శక గాజు సీసాలు
- రంగు గాజు సీసాలు
- పునర్వినియోగం చెయ్యలేని విష-రహిత చెత్త.
అపార్టుమెంట్లలో నివసించేవారికి వారి కాంప్లెక్స్ లోనే పైన చెప్పిన ఎనిమిది కేటగిరీలకు పెద్ద డబ్బాలతో ఒక పెద్ద చెత్త గది ఉంటుంది. అసోసియేషన్ పరిమాణం బట్టి వారానికి రెండు, మూడు సార్లు కమ్యూన్ వాళ్ళు చెత్తని తీసుకెళ్తారు. అపార్ట్మెంట్ ధర ఈ చెత్త గదుల నిర్వహణ మీద కూడా ఆధారపడి ఉంటుంది.
విల్లాలలో నివసించేవారికీ, అస్సోసియేషన్లో చెత్త గది లేనివారికి బయటి ప్రదేశాల్లో ఈ క్రింది విధంగా ఏర్పాటు చేస్తారు. ఆహార పదార్ధాలనుండి వచ్చే తడి చెత్తను, పునర్వినియోగం చెయ్యలేని విష-రహిత చెత్త కోసం ఇంటి ముందే రెండు పెద్ద డబ్బాలను ఏర్పాటు చేసుకుంటే కమ్యూన్ వారు ప్రతిరోజూ తీసుకెళ్తారు.
వాటిలో మొదటి ఏడు రకాలు ఆ పదార్థం బట్టి పునర్వినియోగింపబడతాయి. చెత్త నుండి వచ్చే మీథేన్ గ్యాస్ ను కొన్ని నగరాలు బస్సు ఇంధనంగా వాడుతున్నాయి. ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అవ్వడంతో మా ఊరిలాంటి చిన్న మున్సిపాలిటీలు ఈ విధానంలో ఇంకా మొదటి దశలోనే ఉన్నాయి. ఎనిమిదో రకాన్ని వేడి నీటిని ఉత్పత్తి చెయ్యడానికి ఇంధనంగా వాడతారు. ఈ విధానంపై ప్రస్తుతం పర్యావరణవేత్తల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నప్పటికీ ఆ చెత్తను భూమిలో కలిపేకంటే ఇలా హానికారక పదార్ధాలను వడకట్టి తగలబెట్టడం వల్ల జరిగే నష్టం తక్కువ, మరియూ ఉచిత ఇంధనం కూడా అవ్వడంతో మరికొన్నేళ్లు ఈ విధానం కొనసాగే అవకాశం ఉంది.
ఎలక్ట్రానిక్ వస్తువులను ఊరికి దూరంగా ఉండే పెద్ద వ్యర్ధాల నిర్వహణ ప్లాంటు దగ్గర అప్పజెప్పాలి. మా అపార్ట్మెంట్ అసోసియేషన్ వారు సంవత్సరానికి రెండు సార్లు ఒక పెద్ద ట్రక్కుని అద్దెకు తీసుకుంటారు. ఈలోపు పాడైపోయిన పెద్ద వస్తువులన్నీ బయట పారెయ్యకుండా జాగ్రత్త చేసి ఉంచుకోవాలి.
రెండు సంవత్సరాలక్రితం నుండి పునర్వినియోగం చెయ్యలేని ప్లాస్టిక్ బ్యాగుల విషయంలో కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. దానితో వాటి ధర పది రెట్లు పెరిగిపోయాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మన మాములుగా వాడే పలచని ప్లాస్టిక్ సంచి ధర ఇప్పుడు నాలుగు రూపాయలు చేసేసారు. అలాగే పెద్ద ప్లాస్టిక్ సంచి ధర 80 రూపాయలు ఉంది. ఇదెక్కడి దౌర్జన్యం అని అడుగుదామంటే ఆ ప్లాస్టిక్ సంచుల పక్కనే కాగితపు సంచులు ఉచితంగా ఇస్తున్నారు. ఇక ప్లాస్టిక్ సంచుల జోలికి వెళ్లాల్సిన అవసరం రావట్లేదు. ఈ విధానం మనకు కూడా ఉపయోగపడుతుందనుకుంటున్నాను.
Comments
Post a Comment