యూట్యూబ్ లో మీకు బాగా నచ్చిన ఒక పది ఛానెళ్ళు ఏమిటి? వాటి గురించి వివరించండి.
వెటకారం కోవకు చెందినవాటిని మాత్రం ప్రస్తావిస్తాను. నాకు బాగా నచ్చినవి, కానీ ఎవరికీ పెద్దగా ఉపయోగపడనివి. వీరిలో కొంతమంది ప్రస్తుతం చదువుకుంటూ తమకు సమయం కుదిరినప్పుడు మాత్రమే వీడియోలు చేస్తుంటారు. ఈ ఛానళ్లలో కొత్త వీడియో వస్తే వీలైనంతవరకూ వచ్చిన వారంలోనే చూస్తాను. ఎందుకంటే ఆలస్యమైతే విమర్శను తట్టుకోలేని కళాకారులు కాపీరైట్ స్ట్రైక్ కొట్టి వీళ్ళ వీడియోలు లేపేస్తారు కాబట్టి. వీటిలో కొన్ని వయోజన హాస్యం క్రిందకు వచ్చేవి కూడా ఉన్నాయి. వాటిని * తో రాస్తాను.
నేలబారు వీడియోల బెండు తియ్యడం అనే జోనర్లో నాకు పరిచయమయిన మొదటి ఛానల్ ఇది. ఈ అబ్బాయి పేరు సాత్విక్. తను చూసే చెత్త వీడియోలపై చిన్న చిన్న హావభావాలతోనే హాస్యం పండించడం ఈ అబ్బాయి ప్రత్యేకత.
మిస్ మజ్జిగ అనే పేరుతో రోస్ట్ చానెల్స్ లో ఫాలోయింగ్ ఉన్న అమ్మాయి. వీడియోలు తక్కువే కానీ మంచి కంటెంట్. యధాలాపంగా తన వీడియోల్లో కంటెంట్ చూసి ఇష్టపడేవాళ్లకంటే తన గొంతుకి అభిమానులు ఎక్కువ.
ప్రముఖ తెలుగు స్టాండప్ కమెడియన్ రాజశేఖర్ మామిడన్నగారి ఛానల్ ఇది. తెలుగులో, రామాయణం మీద స్టాండప్ కామెడీ చేసి, ఎవ్వరినీ నొప్పించకుండా అన్నివర్గాల ప్రశంసలు అందుకున్న రాజశేఖర్ గారు తన ప్రదర్శనలలో సందర్భం దొరికినప్పుడల్లా అంతర్లీనంగా మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు కౌన్సిలింగ్ కూడా ఇస్తుంటారు.
తాము చూసొచ్చిన సినిమాలపై తమ అభిప్రాయాలను తెలియచేయడానికి ఇద్దరు ఔత్సాహికులు ప్రారంభించిన ఛానల్ ఇది. మొదట్లో సినిమాలపై చిన్న చిన్న స్కిట్ల రూపంలో వ్యంగ్యబాణాలు వేసారు. ప్రస్తుతం రివ్యూలకు పరిమితమయ్యారు. వీరు రివ్యూ చెప్పే విధానం నాకు కొంచెం వినూత్నంగా అనిపించింది. కొంతమందికి అది అతి అనిపిస్తుందిగాని సినిమా బాగోపోతే వాళ్ళ చిరాకు అలా చూపిస్తారంతే.
ఈ అబ్బాయి పేరు తెలియదు. తను సమాజంలో/సోషల్ మీడియాలో కనిపించే హిపోక్రసి మీద వ్యంగ్యంగా విమర్శలు చేస్తుంటాడు. అప్పుడప్పుడు ఈ వీడియోలు చూసేవాళ్లకు కూడా గట్టిగా తగులుతుంటాయి. మనోభావాలు దెబ్బతినేవాళ్ళు దూరంగా ఉండాల్సిన ఛానల్. ఈ ఛానెల్లో చాలా వీడియోలు తొలగింపబడ్డాయనుకుంటా.
ఈ పిల్లమహానుభావుడివల్ల యూట్యూబ్ లోని కొన్ని కళాఖండాలు పరిచయమయ్యాయి. బెండుకాయ, స్నేహాసాగరం, బాయ్కాట్ చైనా వీడియోలు నాకు బాగా నచ్చిన వీడియోలు. ఈ అబ్బాయి చేసే కంటెంట్ సాత్విక్ కి దగ్గరగా ఉంటుందికానీ అక్కడక్కడా నాటుభాష వినిపిస్తుంది.
తెలిసినవారొకరు ఈ మధ్యనే పరిచయం చేసిన ఛానల్. క్లాసిక్ అనుకునే కొన్ని హిందీ సినిమాలను, బ్లాక్ బస్టర్ హిట్లను మరో కోణంలో చూడాలంటే ఈ ఛానల్ వీక్షించాలి. ముఖ్యంగా హిందీ పాటలకు నేపధ్య సంగీతం తీసేసి బొంగురుగొంతుతో పాట పాడి దానికి హీరోల నాట్యాన్ని జతచేసిన వీడియో ముక్కలు చూసి నవ్వలేక చచ్చాను. ఇటువంటిది తెలుగులో ఏమైనా ఉందేమో వెతకాలి.
భావసారూప్యతగల కొంతమంది యువతీయువకులు సోది ముచ్చట్లు పెట్టుకునే ఛానల్. అప్పుడప్పుడూ సినిమా రివ్యూలు, డేటింగ్ ప్రొఫైల్ తయారుచెయ్యడంలాంటి వీడియోలు కూడా చేస్తుంటారు. బడి, కళాశాలలో బేవార్స్ మందలు పెట్టే బేకార్ ముచ్చట్లు ఇష్టపడే వాళ్ళందరికీ నచ్చే అవకాశం ఉన్న ఛానల్ ఇది.
మిగతా నాలుగు చానెళ్లు దొరికాక సమాధానంలో తగిలిస్తా!
Comments
Post a Comment