నాస్తికులు అని చెప్పుకునే వారు కేవలం హైందవ మతంలో మాత్రమే దోషాలను వెదుకుతూ ఉంటారు ఎందుకు?
స్థూలంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి.
నాస్తికుల అవగాహనాలోపం: ఒక ఆచారం లోని లోపాలు బయటినుండి చూసేవారికన్నా ఆ ఆచారాలు పాటించి మానేసినవారికే ఎక్కువ తెలుస్తాయి. మనదేశంలోని ఎక్కువమంది నాస్తికులూ హేతువాదులు ఒకప్పుడు హిందూ ఆచారాలు పాటించిన వారే. అందువల్లే వారికి ఆ ఆచారాల్లో ఉన్న దోషాలు, మూఢ నమ్మకాలూ కనిపిస్తాయి. పాశ్చాత్యదేశాలలోని నాస్తికులకు క్రైస్తవం, జుడాయిజం లాంటి మతాలలో, మధ్య ప్రాచ్యమువారికి ఇస్లాంలో దోషాలు ఎక్కువగా తెలిసే అవకాశం ఉంది.
ఆస్తికుల అవగాహనాలోపం: నాస్తికులందరూ మా మతాన్నే విమర్శిస్తారు అనే భావన కేవలం కొంత మంది హైందవుల్లోనే కాదు, ప్రపంచంలోని ప్రతీ మతంలోనూ ఉంది. ఈ భావన నిర్ధారణ పక్షపాతం (confirmation bias) వలన కలుగుతుంది. అంటే నాస్తికులు వేరే మతాలపై చేసే విమర్శలను గుర్తించలేకపోవడం, ఆ మతాల విషయంలో నిజమే చెబుతున్నాడుగాని నా మతంవిషయంలో కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నాడు అనుకోవడం, వేరే దేశాల్లో నాస్తికులు ఎంత నిర్దాక్షిణ్యంగా విమర్శిస్తారో తెలియకపోవడం లాంటివి. ఈ నిర్ధారణ పక్షపాతాన్ని పక్కనపెట్టి చూస్తే ప్రపంచం నిండా చాలా ఉదాహరణలు కనిపిస్తాయి.
సవరణ: దోషాలను పట్టుకోవడానికి నాస్తికులే అవ్వనవసరంలేదు. హిందూ మతాన్ని సంస్కరించిన రాజా రామ్మోహన్రాయ్, వివేకానంద నాస్తికులు కాదు.
Comments
Post a Comment