మీ బాల్యంలో మీరు అత్యంత అమాయకంగా, తెలివితక్కువగా నమ్మిన విషయం ఏది?

 చిన్నప్పుడు అందరు పిల్లల్లాగానే నేను కూడా పిచ్చి పిచ్చి ప్రశ్నలతో మా అమ్మానాన్నలను వేధించేవాడిని. చాలామటుకు అనుమానాలను సహనంతో సమాధానాలు చెప్పేవారు. కానీ ఎప్పుడైనా మరీ చిరాకు పెడితే సమాధానం కూడా అలాగే వచ్చేది. కానీ అవి కొంటె సమాధానాలు అని తెలీక కొన్నింటిని నమ్మేసేవాడిని. వాటిలో ఎనిమిది, తొమ్మిదేళ్ల వయసులో నేను నమ్మిన సినిమా పనిచేసే విధానం ఒకటి.

నా చిన్నప్పుడు మా నాన్నగారు సినిమాహాలు నడుపుతుండేవారు. నా సాయంత్రాలూ, సెలవులూ ఆ సినిమాహాలు దగ్గరే గడిచేవి. ఒక ఆదివారంనాడు హాల్లో ఏదో పని చేయిస్తుంటే నేను అక్కడే ఉండి చూస్తున్నా. అప్పుడు తేరా వెనక్కెళ్ళి చూసిన తర్వాత నాకొక భయంకరమైన అనుమానం వచ్చేసింది.

"నాన్నా! దీనికి టీవీలాగా వెనకాల ఏమి లేదు. మరి బొమ్మ ఎలా వస్తుంది?", అని అడిగాను.

"ఆ ప్రొజెక్టర్ రూమ్ నుండి వస్తుంది.", అని ప్రొజెక్టర్ రూంకేసి చూపించారు.

"మరి ప్రొజెక్టర్ రూమ్ కి తెరకి కనెక్షన్ ఎక్కడినుండి ఉంది?", మళ్ళీ మరొక అనుమానం.

"అవును, కనెక్షన్ ఏమి ఉండదు. సినిమా టైమైనప్పుడు హీరో, హీరోయిన్లు తెరవెనక్కొచ్చి యాక్ట్ వెళ్ళిపోతారు.", అప్పటికే విసిగిపోయున్న మా నాన్నగారు సమాధానం చెప్పారు.

"ఓహో!" అని నా స్పందన తెలియచేసాను.

కానీ అక్కడ మా నాన్న గమనించనిదేమిటంటే ఆయన చెప్పిందే నిజం అని నేను నమ్మేసాను. అది కూడా ఏకంగా ఏడాది పాటు. యాక్టర్లందరూ థియేటర్ వెనకనుండి వెళ్ళిపోతున్నారేమో అనుకునేవాడిని. చివరికి వాళ్ళని ఒకసారైనా చూడాలనిపించి నేల టిక్కెట్ల దగ్గర కూర్చుని సినిమా అయ్యిన వెంటనే లేచి తెర దగ్గరికి వెళ్లి చూసేవాడిని. చాలా రోజులతర్వాత వాళ్లేందుకు కనిపించట్లేదని ప్రొజెక్షన్ అన్నయ్యని అడిగితే అసలు సంగతి చెప్పాడు.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?