చాప్‌స్టిక్స్‌తో ఆహారం తినడం మీకు వచ్చా? వస్తే ఎలా నేర్చుకున్నారు?
పాత జట్టుల్లో ఉన్నప్పుడు చాప్‌స్టిక్స్ ని వాడటం కాదు కదా, కనీసం దగ్గర్నుండి కూడా చూడలేదు. రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు కూడా చెయ్యి, మహా అయితే చెంచా, ఫోర్క్ మాత్రమే వాడేవాడిని. కానీ నాలుగేళ్ళ క్రితం కొత్త జట్టులో చేరాక పరిస్థితి మారింది. జట్టులో ఉన్నది ముగ్గురు స్వీడిష్ వాళ్ళు, ఒక రష్యన్-లాత్వియన్, ఒక ఇరానియన్, ఒక ఇథియోపియన్, ఒక భారతీయుడు. చేరిన కొత్తలో సభ్యుల మధ్య అనుబంధం పెరగడానికి అప్పుడప్పుడూ జట్టు భోజనాలకి వెళ్లాలని తీర్మానం జరిగింది.
భోజనానికి వెళ్లేముందు రెస్టారెంట్ ఎంపికకి ఎన్నికలు జరిగేవి. నేనూ, ఒక ఇరానీయుడూ ఇండియన్ రెస్టారెంట్ తప్ప మరోదానికి ఓటు వేసేవాళ్ళం కాదు. కాబట్టి ఎక్కడికెళ్ళేదీ మిగిలిన ఐదుగురి మీద ఎక్కువ ఆధారపడి ఉండేది. ఎక్కువగా భారతీయ రెస్టారెంట్ కే వెళ్లినా ఒకసారి మా దురదృష్టం వెకిలి నవ్వు నవ్వడంతో సూషీ రెస్టారెంట్ ఎంపిక చేసారు. నిండా మునిగాక చలెందుకులే అనుకుని వెళ్లి కూర్చున్నాం. అందరూ అపరిమిత సూషీ భోజనం చెప్పుకుంటే, నేనొక్కడినే వివిధ రకాలున్న ఎనిమిది సూషీలు కొనుక్కున్నాను. ఆ పచ్చి చేపల అన్నం ముద్దలు మింగడమే అతి పెద్ద సవాలు అనుకుంటున్న నాకు చాప్‌స్టిక్స్ రూపంలో పెను సవాలు ఎదురయ్యింది.
ఆరడుగుల ఎత్తు, ఒక క్వింటా బరువుండే స్వీడిష్ సహోద్యోగి ఒకడు అప్పటికే ఒక డజను సూషీలు లేపేసి, మళ్ళీ ప్లేటు నింపుకోడానికి లేచాడు. నేనేమో నా ఐదువేళ్ళ మధ్యా ఆ రెండు పుల్లల్ని ఇరికించడం దగ్గరే ఆగిపోయాను. మరో పరక సూషీలు పట్టుకొచ్చి కూర్చుని నా వైపే విచిత్రంగా చూస్తున్నాడు. "నువ్వంతకుముందు చాప్‌స్టిక్స్ వాడలేదు కదా" అని అడిగాడు. "లేదు, సూషీ కూడా తినలేదు" అని సమాధానం చెప్పా. ఎలా పట్టుకోవాలో సవివరంగా చూపించి "తినడం నువ్వే చూసుకో" అని వదిలేసాడు. "అద్భుతంగా వివరించావు. ఇప్పుడు ఎడమ చేత్తో ఎలా పట్టుకోవాలో చెప్పు" అని అడిగితే ఒక పెద్ద నవ్వు నవ్వి ఈరోజుకి ఫోర్క్ తో తినేసి ఆఫీసుకి ఆ రెండు పుల్లలు తెచ్చుకోమన్నాడు, అక్కడ నేర్పడానికి. నాకిచ్చిన ఎనిమిది ముక్కల్లో తినగలను అని నమ్మకం ఉన్న ఒక నాలుగు ప్రయత్నించాను. సాల్మన్, దోసకాయ, రొయ్య(ఉడకబెట్టింది) మెత్తగా వెళ్లిపోయాయి గాని ట్యూనా సూషీ మాత్రం నా వల్ల కాలేదు. మిస్టర్ బీన్ లాగా కనబడిన చోటల్లా ఆ ట్యూనా ముక్కలు కూరేసి ఆ రెండు పుల్లలు పట్టుకుని బతుకు జీవుడా అని ఆఫీసుకి పరిగెత్తాను.
ఆ తర్వాత నిర్ణయించుకున్నాను, సూషీ తినడం కంటే ముందు ఆ పుల్లలు వాడడం నేర్చుకోవాలని. ఆ పూటంతా ఆఫీసులో ఎరేజర్లు, పెన్నులు, కాగితాలు ఇలా ఏది దొరికితే దాన్ని చాప్‌స్టిక్స్ తో ఎత్తి మరో పక్క పెట్టడం ఒక పనిగా పెట్టుకున్నా. ఇంటికెళ్ళేటప్పుడు మూడు జతల చాప్‌స్టిక్స్ కొని ఇంటిదగ్గర కూడా ప్రయత్నించా. చివరికి వస్తువు కింద పడకుండా తినడం అలవాటయ్యింది గాని వాటిని పట్టుకోవడంలో ఆ స్టయిల్ రాలేదు. ఆ ధైర్యంతో సుషీ రెస్టారెంట్ కి వెళ్లగలుగుతున్నా గానీ అధిక ధరున్న అపరిమిత భోజనం కొనుక్కుని కేవలం నేను తినగలిగే ఆ మూడు రకాల సూషీ మాత్రమే మళ్ళీ మళ్ళీ వేసుకుంటా. నా వల్ల ఆ రెస్టారెంట్ యజమానికి ఎంత లాభమో కదా!
Comments
Post a Comment