మహాభారతానికి , కృష్ణుడి ద్వారకా నగరానికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. ఒకవేళ మహాభారతం నిజంగా జరిగింది అంటే భారతంలో చాలా మంది ఎప్పుడో జరిగిన యుగాల్లో మనుషులు కూడా ఉంటారు. మరి డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం తప్పు అవుతుందా?
శాస్త్రీయ ఆధారాలున్నాయని ప్రశ్నలోనే తీర్మానించేసారు కాబట్టి ఇక ఆ అంశంలో చర్చకు అవకాశం లేదని అనుకుంటున్నాను.
ఇదే ప్రశ్నకు నేను మొదట చదివిన సమాధానంలో చెప్పినట్లు ఇతిహసాలు, మతగ్రంధాల ముఖ్యోద్దేశ్యం నైతికత నేర్చుకోవడం మాత్రమే, మిగిలినవి విజ్ఞానశాస్త్రానికి అప్పజెప్పండని చదివి సంతోషపడ్డాను. కానీ మెజారిటీ సమాధానాలు, వాటికొచ్చిన స్పందన చూసి ఒక్కొక్క సమాధానానికి వ్యాఖ్య రాసే ఓపిక లేక ఇక్కడే అడుగుతున్నాను. దయచేసి వివరించగలరు.
ఒక సమాధానంలో సాక్ష్యంగా చూపిన కాలిముద్ర, గంట ఫోటోలు కరుడుగట్టిన క్రైస్తవ సృష్టివాద వెబ్సైటు నుండి ఎత్తుకొచ్చినవి. ఆ వెబ్సైట్లలో ఆ ముద్ర, గంటతో పాటూ నోవాస్ ఆర్క్ కి, ఆడమ్, ఈవ్ కి కూడా ఆధారముంది. ఆ రుజువులు సృష్టించిన వ్యక్తికి బైబిలు తప్ప మిగిలిన గ్రంధాలన్నీ అబద్దాలే. మరి ఆయనగారి ఆధారాలు ఉపయోగించి మన విశ్వాసాలను నిరూపించుకోవడం ఎంతవరకు సబబు?
అబ్బే! మాకు మాకూ ఏమైనా ఉండొచ్చు. విజ్ఞానశాస్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడాలన్నప్పుడు ఒకరి సాయం ఒకరు తీసుకుంటాం, ఆ తర్వాతే మాలో మేము కొట్టుకుంటాం, అప్పటివరకూ జీవపరిణామసిద్ధాంతం నిజం కాదు అని నమ్ముతాం అంటే నాదొక విజ్ఞప్తి. మీరు మీ స్కూల్ పుస్తకాలలో పరిణామం గురించి చెప్పినప్పుడు అది అబద్దమని చెప్పే ధైర్యం లేకో, చెబితే మార్కులు రావేమో మనకు మార్కులు వస్తే చాలని మిమ్మల్ని మీరు మోసం చేసుకునో జీవపరిణామం నిజమని, మనిషి రాతియుగం, కాంస్య యుగం మతగ్రంధాల టైం లైన్ తర్వాతే దాటాడని రాసేసుంటారు. కనీసం ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకుని మీ పిల్లలకు, మనవళ్లకు, తమ్ముళ్లకు, చెల్లెళ్లకు అబద్దం చెప్పకండి. మార్కులుపోయినా పర్లేదు. ఇంకొంచెం ముందుకెళ్లి మీ పిల్లల టీచర్లతో వాదనకి దిగండి. వాళ్ళకి ఎంత ధైర్యముంటే తరతరాలుగా అబద్దం చెబుతారు?
ముఖ్యంగా బైపీసి విద్యార్థులను, హిస్టరీ విద్యార్థులను తలచుకుంటే జాలేస్తుంది. మీరంతా నడుం కట్టి వాళ్ల పూర్తి సిలబస్ మార్పించాలని ప్రార్ధన. మీ కృషి ఫలించి ఎప్పటికైనా మన పాఠ్యపుస్తకాలు పక్కన పడేసి నిజమైన విజ్ఞానం ఉన్న పుస్తకాలు బోధించాలని ఆశిస్తున్నాను.
అలాగే మరికొన్ని చోట్ల పరిణామక్రమం ముందుగా మనవాళ్లే కనిపెడితే అన్యాయంగా ఆ డార్విను దొబ్బేసాడని అనుకుంటున్నారు. పాపం ఆ అమాయకులకు కూడా చెప్పండి, అది కూడా అబద్దమే అసలు పరిణామమే జరగలేదు డై్నోసార్లు, మనుషులు కలిసి గోళీకాయలు ఆడుకునేవారని. చెబుతారు కదూ! మీ పిల్లల పాఠ్యపుస్తకాల సంగతి మరవొద్దు. సెలవు.
అదనపు వినతి: జీవపరిణామం జరగదని తెలియక కరోనా వైరస్ లలో రకరకాల వేరియాంట్స్ వచ్చాయని శాస్త్రవేత్తలు భ్రమపడుతున్నట్లున్నారు. అటువంటిదేం లేదు, వైరస్ పుట్టినప్పుడు ఎలా ఉందొ ఇప్పుడు కూడా అలాగే ఉందని వాళ్ళక్కూడా చెప్పండి.
Comments
Post a Comment