ముందుగా మనదేశ పౌరులకు కరోనా వాక్సిన్ వెయ్యకుండా ఇతర దేశాలకు ఎగుమతి చెయ్యడానికి కేంద్రం ఎందుకు అనుమతిని ఇచ్చింది?

 ప్రపంచంలోనే అత్యధికంగా టీకాలు ఉత్పత్తి చేసే మనదేశం ఎందుకు కోవిడ్ టీకాల కొరత ఎదుర్కొంటుంది అనే ఆలోచనే ఈ ప్రశ్న అడగడంలో ముఖ్యోద్దేశ్యం అని అనుకుంటున్నాను.

భారతదేశంలో అతి పెద్ద కోవిడ్ టీకాల ఉత్పత్తిదారులు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ), భారత్ బయోటెక్ రెండూ ప్రైవేట్ సంస్థలే. ఎస్ఐఐ ఆస్ట్రాజెనెకా వారి టీకాను కోవీషీల్డ్ పేరుతో ఉత్పత్తి చేస్తుంటే, భారత్ బయోటెక్ మనదేశ సాంకేతికతతో తయారుచేసిన కొవాక్సీన్ ని ఉత్పత్తి చేస్తుంది. అంకెలలో ఎస్ఐఐ సామర్ధ్యం పెద్దది కాబట్టి తదుపరి ఉదాహారణలతో దానినే ఉటంకిస్తాను.

ఎస్ఐఐ ఉత్పత్తి ప్రారంభించడానికి ముందే ఐరాస నుండి(కోవాక్స్ ప్రోగ్రాం) , అమెరికా, యూకే, ఐరోపా సమాఖ్య వంటి దేశాలనుండి ఆర్డర్లు పోటెత్తాయి.

  • టీకా మీద సర్వహక్కులు ఉన్న ఆస్ట్రాజెనెకా కంపెనీ కూడా 100 కోట్ల డోసులకు మెమోరాండం తీసుకుని, దానిలో 40 కోట్ల డోసులు 2020 చివరికి అప్పజెప్పాలనే నియమంతో ఉత్పత్తి హక్కులు ఎస్ఐఐకి అప్పగించింది ఈ డోసులన్నీ కూడా కోవాక్స్ ప్రోగ్రాం ఒప్పందంలో భాగంగా ఎగుమతి చెయ్యాల్సినవి.[1]
  • యూకే ప్రభుత్వం ఆస్ట్రాజెనెకాతో చేసుకున్న 10 కోట్ల డోసుల ఒప్పందం ప్రకారం కోటి డోసులు ఎస్ఐఐ నుండి ఫిబ్రవరి 2021 లోపు ఎగుమతి చెయ్యబడ్డాయి.[2]
  • అమెరికా కూడా టీకా కోసం 2020 లోనే భారీగా ఆర్డర్లు పెట్టింది. ఆ ఒప్పందంలో భాగంగా ఆస్ట్రాజెనెకా నుండి 2021 మొదటి త్రైమాసికం లోపు వెళ్లాల్సిన టీకా డోసుల సంఖ్య 15 కోట్లు. దానిలో ఎస్ఐఐ వాటా కనీసం 20 శాతం ఉండొచ్చు.[3]
  • ఇవి కాక ఇతరదేశాలనుండి, కొన్ని స్వచ్చంద సంస్థలనుండి కూడా ఎస్ఐఐకి 2020 లోనే ముందస్తు ఆర్డర్లు, భవిష్యత్తు ఆర్డర్ల ప్రమాణాలు అందాయి.

ప్రభుత్వం చేసిన మంచి పనేంటంటే దేశం నుండి ఉత్పత్తి అయ్యే టీకాలను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడానికి, వివిధ దేశాలనుండి మనదేశ టీకా ఉత్పత్తిదారులకి వచ్చిన ఆర్డర్లను ఎగుమతి చెయ్యడానికి అన్ని రకాలుగా సహకరించింది. టీకాలకోసం జరుగుతున్న ఈ పోటీలో అవకాశంలేని కొన్ని దేశాలకు సాయం చేసి కనీసం అక్కడి ఫ్రంట్ లైన్లో పనిచేసేవారికి టీకాలు అందే అవకాశాన్ని కల్పించింది. ఈ నిర్ణయం తీసుకోడానికి మానవతా దృష్టి ఒక కారణమైతే, ఈ టీకా దౌత్యంతో దేశ ప్రతిమని ఇనుమడింపచెయ్యాలి అనుకోవడం మరొక కారణం. ఇది నా ఉద్దేశ్యం కాదు, మన విదేశాంగ శాఖే దీనిని టీకా దౌత్యంగా అభివర్ణించింది. టీకా దౌత్యం అనేది తప్పుడు నిర్ణయం కాదుగానీ, ఈ నిర్ణయం తీస్కోడానికి మన నేతలు రెండవ అల వస్తుందని ఊహించకపోవడం ఒక కారణమని నేననుకుంటున్నాను. ఎందుకంటే రెండవ అల విజృభించాక వేరే దేశాలకు వెళ్లే టీకాల ఎగుమతిపై ప్రస్తుతం మన దేశం ఆంక్షలు పెడుతుంది.

మనదేశ ప్రభుత్వం ఎస్ఐఐకి 2021 ఫిబ్రవరిలో 2.1 కోట్ల టీకాలకు మొదటిసారి ఆర్డర్ పెట్టింది. అది కూడా భవిష్యత్తులో మరొకసారి ఆర్డర్ పెడతాం అనే సమాచారం ఇవ్వలేదు. దీనివలన ఎస్ఐఐకి దేశీయ అవసరాలకు ఉత్త్పత్తి చేసే సంసిద్ధం అయ్యే అవకాశం లేకపోయింది అని ఎస్ఐఐ అధిపతి ఆధర్ పూనావాలా వ్యాఖ్యానించారు[4].ఆ తర్వాత దేశంలో కేసులు పెరుగుతుండడంతో మార్చిలో 11 కోట్ల డోసులు, మళ్ళీ ఏప్రిల్ చివర్లో భారీగా ప్రభుత్వం టీకాలు ఆర్డర్లు పెట్టింది.

పైన చెప్పిందంతా అసలు సమాధానానికి కావలసిన సమాచారం మాత్రమే. ఇప్పుడు సమాధానానికి వస్తే ప్రైవేట్ కంపెనీలకు తమ ఒప్పందాలకు లోబడి ముందు వచ్చిన కొనుగోలుదారుడికి ముందే సరుకు అప్పజెప్పాలి. ఎస్ఐ, భారత్ బయోటెక్ కంపెనీలు అదే చేసాయి. ఆలా చెయ్యడానికి మన ప్రభుత్వం ముందు సహకరించింది. ఆ తర్వాత కొంపలంటుకున్నాయి కాబట్టి నూతులు తవ్వడం ప్రారంభించింది. సొంత దేశం అనే ప్రేమతో ఆ ప్రైవేట్ కంపెనీలు ఆపత్కాలములో ఎక్కువ డోసులు ఇవ్వడానికి ఒప్పుకున్నాయి.

ఇక్కడితో అడిగిన ప్రశ్నకు సమాధానం ఐపోయింది. ఈ క్రిందదంతా నా పైత్యం.

  • టీకాలు వేయించుకోవడానికి భారతీయులు జంకిన మాట వాస్తవం. ఆ తర్వాత దాని అవసరం అర్ధమై ఎగబడడం కూడా వాస్తవమే. కానీ ఆ ప్రవర్తనకు టీకా లోటుకు సంబంధం లేదు. ముందు మనం కొనుగోలు చెయ్యకపోతే టీకాలు ఎక్కడినుండి తీసుకొచ్చి వేస్తారు?
  • టీకా 100% పనిచేస్తుందని ఏ శాస్త్రవేత్త, ఏ ప్రభుత్వమూ ఎటువంటి ప్రకటన చెయ్యలేదు. కానీ అసలు టీకా తీసుకోకపోవడం కంటే టీకా తీసుకోవడం వల్ల నష్టాన్ని తగ్గించొచ్చు. దానికి నా కుటుంబమే ఉదాహరణ. నా కుటుంబంలోని ఒక డోసు తీసుకున్న ఒకరికి టీకా తీసుకోవడం వల్ల రోగ తీవ్రత చాలా తక్కువ, రెండు డోసులు తీసుకున్న మరొకరికి అసలు కోవిద్ సోకలేదు కూడా. అందరికీ ఇలాగే జరగాలని లేదు, కానీ సంఖ్యలు టీకాకి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి టీకా విషయంలో భయపడొద్దు.
  • జరిగిన తప్పుని ఎత్తిచూపడానికి ముహుర్తాలు పెట్టుకోఅక్కర్లేదు. ఈ విమర్శలన్నీ తదుపరి అలలు రాకుండా ప్రభుత్వానికి ఒక సలహాలు లాంటివే. భావజాలాలు పక్కనబెట్టి ఆలోచించాల్సిన సమయం ఇది.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?