మీ పూర్వీకులు వేరే ప్రాంతానికి వలసవెళ్ళి ఉంటే వారు వచ్చిన మూలస్థానమైన ప్రాంతాన్ని/గ్రామాన్ని మీరు ఎప్పుడైనా వెళ్ళి చూశారా? మీ అనుభవం ఏమిటి?

 మా నాన్నగారిది పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుమంట్ర అనే గ్రామం. వారి ముందు నాలుగు తరాల నుండీ కూడా అదే గ్రామం కానీ అంతకు ముందువారి గురించి తెలియదు. పెద్దలు చూసిన సంబంధం ఇష్టంలేక టీనేజీ వయసులో ఇంట్లో చెప్పకుండా విజయవాడ వెళ్లిపోయి పనిలో చేరి కొన్ని నెలల తర్వాత తిరిగొచ్చి మొదట చూసిన సంబంధమే చేసుకుని మళ్ళీ విజయవాడలోనే కాపురం పెట్టడంతో సొంతూరు అనే పదం మా జీవితాల్లో లేకుండా పోయింది.

విజయవాడనుండి మాకు ఊహ తెలియని వయసులోనే రాజమండ్రి వచ్చినప్పటికీ నేను పెనుమంట్రలో మొదటిసారి అడుగుపెట్టింది నా పందొమ్మిదో యేటనే. మొదటిసారి నన్నక్కడికి తీసుకెళ్లినప్పుడు మా నాన్న చుట్టాలు, బాల్య స్నేహితుల ఇంటికి తీసుకెళ్లి నన్ను పరిచయం చేసారు. దగ్గరి బంధువులను మొదటిసారి చూడడటంతో, మేనత్త, పిన్ని వరసలయ్యేవారు కన్నీటిపర్యమయ్యారు. ఆ రోజు ఒకరు మా ఇంట్లో అంటే ఇంకొకరు మా ఇంట్లో ఉండాలంటూ పట్టుబట్టడం ఇంకా గుర్తుంది. మళ్ళీఇంకెప్పుడైనా తీసుకొస్తానని చెప్పి తిరుగుప్రయాణం మొదలెట్టాము.

వెళ్ళేటప్పుడు మా నాన్నగారి ఒకప్పటి ఇల్లు ఉండే ప్రదేశాన్ని చూపించారు. అక్కడ ప్రస్తుతం మా చినతాతగారి సంతానం భవనం నిర్మించుకున్నారు. చివర్లో మా నాన్నగారు ఆడుకున్న ప్రాంతాలు, గోసనార అనే కాలువ చూపించారు. నేను చూసేటప్పటికి అది చాలా దుర్వావస్థలో ఉంది. ఊరంతా చూపించేటప్పుడు నాన్న కొంచెం భావొద్వేగం చెందారు కానీ నిజం చెప్పాలంటే అప్పటికే రాజమండ్రినే నా ఊరు అనే బలమైన నమ్మకం ఉండడంతో నాకు ఊరితో అంతగా అనుబంధం కలగలేదు.

నేను సెలవుల్లో భీమవరం వెళితే అక్కడివారు నన్ను "ఏరా బెజవాడా! ఎప్పుడొచ్చావ్?" అనేవారు. రాజమండ్రిలో బడిలో చదివేటప్పుడు స్నేహితులతో ఎప్పుడు తగువులాటైనా "ఈ పొరుగూరోళ్లంతా అంతే!" అనేవారు. ఆ తర్వాత కాలంలో ఎప్పుడైనా పెనుమంట్ర వెళ్ళినప్పుడు "రాజమండ్రి అన్నయ్య వచ్చాడు" అంటున్నారు. ఇప్పుడు ఈ ఊరు లేని వారసత్వం నా తర్వాతితరానికి కూడా వచ్చిందన్న ఆలోచన అప్పుడప్పుడూ మెదులుతుంది.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?