బ్యాంక్ లలో జరిగే అవినీతి గురించి ఉదాహరణలు చెప్పండి?
ఇక్కడ అవినీతి జరుగుతుందో లేదో కచ్చితంగా చెప్పలేనుగాని మా ఊరి బ్యాంక్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కొంచెం అనుమానాస్పదంగా ఉన్నాయి.
మా ఊరిలో ఉన్న ఒక ప్రభుత్వ బ్యాంకులో నాకు తెలిసి సుమారు ఒక ఆరు వందల డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న డ్వాక్రా గ్రూపులన్నింటికీ ఈ బ్యాంకులోనే అకౌంట్లు ఉన్నాయి. కొంతమంది ఆ గ్రూపుల సంఖ్య వెయ్యి, రెండువేలు అంటారుగాని నేను విన్న అత్యల్ప సంఖ్య ఆరొందలు.
ఈ డ్వాక్రా గ్రూపుల సభ్యులలో దాదాపు సగం మంది నిరక్ష్యరాస్యులే. ఉన్న కొంతమంది చదువుకున్నోళ్ళు కూడా ఆరు, ఏడుతో చదువాపేసినోళ్లు. వీరికి డ్వాక్రా గ్రూపుల్లో చేరడానికి ముందు బ్యాంకు అకౌంట్లు లేవు. అసలు ఎప్పుడూ బ్యాంకులోకి కూడా వెళ్లనివారున్నారు. ప్రతినెలా ఒకటి-ఐదు తేదీల మధ్య ఈ డ్వాక్రా గ్రూపులు పొదుపు అప్పు కట్టడానికి నరకం చూస్తుంటారు. రెండు స్లిప్పులు నింపి డబ్బులు కట్టడానికి అక్కడ ఉండే ఒక ప్రైవేటు వ్యక్తి యాభై రూపాయలు తీసుకుంటాడు. సాయం చేసేవాళ్ళు లేనివాళ్లు ఆ సదుపాయం ఉపయోగించుకుంటారు.
కానీ అనుమానించాల్సిన విషయం ఈ గ్రూపులకు లోన్లు వచ్చినప్పుడు కనిపిస్తుంది. లోన్లు తీసుకోవడానికి మేనేజర్ దగ్గర గ్రూపు సభ్యులు చేతులు కట్టుకుని నిలబడితే ఆయన/ఆవిడ వీళ్లకు లోను ప్రాసెస్ చెయ్యాల్సిన డాక్యుమెంట్లు ఇమ్మని ఆదేశిస్తారు. అలా చేతులు కట్టుకుని నిలబడమని ఎవరైనా ఆదేశించారో, లేక అసంకల్పితంగా వీళ్ళే చేస్తున్నారో తెలియదు. యధావిధిగా అవి నింపడం వీళ్లకు చేతకాదు. ఈ పేపర్లు నింపడానికి ప్రత్యేకంగా ఒక వ్యక్తి ఉన్నారు. వారు బ్యాంకు అధికారి కాదు. కానీ వారు పూర్తి చేస్తేనే లోను ప్రాసెస్ చేస్తారు. ఆ మనిషి కాకుండా ఇంకెవరు చేసినా బ్యాంకు ఉద్యోగులు లోను కాగితాలను తిప్పి పంపేస్తారు. ఆ మనిషి పూర్తి చెయ్యాలంటే వచ్చే లోనులో వాటా ఇవ్వాలి. ఆ వాటా డబ్బులు మొత్తం ఆరొందల గ్రూపులకు లెక్కవేస్తే నా కళ్ళు బైర్లు గమ్మే అంకెలు కనిపించాయి. అంతేకాక అసలు కంటే కొసరు ముద్దు అన్నట్లు ఫోటోలు, ఆధార్ కార్డులు, డాక్యుమెంట్లు వాళ్లింట్లోనే ఫోటోకాపీ తీయించుకోవాలి. ఆ మనిషి డాక్యూమెంట్లు నింపితేనే ప్రాసెస్ చెయ్యడానికి కారణం ఏంటో అంతు చిక్కడం లేదు. కారణం మరేదో అయ్యుంటుందని సరిపెట్టుకుంటున్నానంతే.
Comments
Post a Comment