కొంతమందికి కారు కొనే ఆర్ధిక స్థోమత ఉన్నా కొనకపోవటానికి గల కారణాలు ఏంటో చెప్పగలరు ?
ఒకప్పుడు నాకు కారొక అందని ద్రాక్ష. కనీసం సరదాకి కూడా డ్రైవర్ సీట్లో కూర్చోలేదు. మూడునాలుగేళ్ల క్రితం వరకు అలాంటి పరిస్థితే ఉంది. కానీ ఆ తర్వాత కారు కొనే స్తోమత ఉన్నా ఆ ఆలోచన చెయ్యట్లేదు. దానికి క్రింది కారణాలున్నాయి.
అవసరం లేకపోవడం: ఇంతకు ముందు సమాధానాల్లో చెప్పినట్లు మేముండే ఊరు చాలా చిన్నది. కావలసిన సదుపాయాలు దగ్గర్లోనే ఉండడంతో కాలినడకన, సైకిలు ప్రయాణంతో పనులు జరిగిపోతాయి. ఎప్పుడైనా అవసరం అయితే ప్రజా రవాణా ఉపయోగిస్తాను. చివరికి పురిటి నొప్పులు మొదలైతే సిటీబస్సులో ఆసుపత్రికి వెళ్లిన ఘనత నా భార్యది.
లైసెన్స్: అంతకు ముందు మేము ఇండియాలో ఎప్పుడూ కారు నడపకపోవడంచేత కారు నేర్చుకోవడానికి ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పారు. తర్వాతి సారి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ప్రయత్నించి ఇక్కడ నేర్చుకుందాం అనుకుంటూనే వాయిదా వేసేస్తున్నాం.
కారు నిర్వహణ: కారు కొన్నా దాన్ని రోజూ వాడాల్సిన అవసరం లేదు. కనీసం రెండువారాలకొకసారైనా వాడతానో లేదో. ఆ మాత్రం దానికి అంత ఖర్చు ఎందుకా అనిపించింది. ఇక్కడ కారుకంటే దానిమీద పడే పన్నులు, పార్కింగ్ డబ్బులు, అపరాధ రుసుములు ఎక్కువవుతాయి.
ఇప్పటివరకు కారు లేకపోయినా నెత్తుకొచ్చేశాం. అత్యవసర పరిస్థితులలో నా స్నేహితులు సాయం చేసారు. కానీ మా అమ్మాయి పుట్టిన తర్వాత కారు అవసరం ఉందేమో అనిపిస్తుంది. వచ్చే సంవత్సరం కూడా అలాగే అనిపిస్తే నా బకెట్ లిస్టులో ఉన్న కారు కొనుగోలుని పైకి లాగి రెండేళ్లలో కొనే అవకాశం ఉంది.
Comments
Post a Comment