అంతర్జాతీయ ప్రయాణాల్లో బారిస్టర్ పార్వతీశంలా అమాయకంగా మీరు దెబ్బతిన్న సందర్భాలు ఉన్నాయా? ఏమిటవి?

 వీసా వచ్చి రెండు నెలలైపోయిందని గుర్తొచ్చిన మా లైన్ మేనేజర్ గారు ఉన్నట్లుండి ఒకరోజు హఠాత్తుగా నన్ను క్లయింట్ లొకేషన్ కి ప్రయాణ ఏర్పాట్లు చెప్పేసి తర్వాత ఏ విమానం టికెట్ (నలభై వేల లోపు) ఉందో దానికి వెళ్లిపొమ్మని ఆజ్ఞాపించారు. ఆఫీసులో పనులన్నీ పూర్తయ్యి మెయిల్ కి టికెట్ వచ్చేటప్పటికి ప్రయాణం ఇంకా మూడు రోజులే ఉంది. ఇక్కడున్నట్లు వచ్చేస్తానని రాజమండ్రి, తాడేపల్లిగూడెం వెళ్లి వీడ్కోలు చెప్పేసి ఆ ఏమరుపాటులో మాసిన గడ్డంతోనే విమానమెక్కేసాను.

రెండ్రోజుల ప్రయాణం(అక్షరాలా) ప్రయాణం తర్వాత ఒక శరదృతువు సాయంకాలానికి ఒక కొత్త దేశంలో దిగి, తర్వాతిరోజు శుక్రవారం ఆ దేశదిమ్మరి అవతరంతోనే క్లయింట్ ఆఫీసులో అడుగుపెట్టాను. అక్కడి జనాలందరూ నున్నటి బుగ్గలలతో మహేష్ బాబుల్లా ఉంటే నేనేమో వాళ్ళ మధ్య అమ్మోరు సినిమాలో ప్రతినాయకుడిలాగా కలిసిపోయే ప్రయత్నం చేశాను. ఆ రోజు భోజనానికి వాళ్లతోపాటు బయటకెళ్తూ ఎలివేటర్ అద్దంలో చూసుకుంటే రోహిర్రిమ్ సైన్యం మధ్యలో గాండాల్ఫ్ ది గ్రే లాగా కనిపించాను. ఇక ఆరోజే క్షవరం చేయించెయ్యాలని నిర్ణయించుకుని సాయంత్రం ఇంటికి బయల్దేరాను.

ఆఫీస్ నుండి పదినిమిషాల నడక దూరంలో ఇల్లు. అక్కడ లాప్టాప్ పడేసి గూగుల్లో సెలూనని కొడితే ఇంటెదురుగా రెండిళ్ళవతలే ఒక సెలూన్ ఉందని చూపించింది. ఆనందంతో ఎగురుకుంటూ వెళ్లి కుర్చీలో కూలబడ్డాను. ఆయనగారికి ఇంగ్లీష్ రాదు, నాకు స్వీడిష్ రాదు. జుట్టు వైపు, గడ్డం వైపు చూపించి కటింగ్ షేవింగ్ అని చెబితే అర్ధమయ్యినట్లు నవ్వి వెనక్కి కూర్చోమన్నాడు. పావుగంటలో పని పూర్తయ్యింది. అచ్చం మా ఊరి రాజులాగానే చేసాడని ముచ్చటపడి ఎంతయ్యిందని అడిగాను. "ఫీరా హుంద్రా ఓక్ ఫెమ్తీ తాక్" అన్నాడు, అర్ధం కాక పేమెంట్ అద్దం మీద చూస్తే నాలుగొందల యాభై క్రోనాలు వేసేశాడు. గట్టి గుండె కాబట్టి తట్టుకున్నానుగాని అదే మా సూరిబాబుగాడైతే కళ్ళు తిరిగి పడిపోయేవాడు. మన రూపాయల్లో కట్టినప్పుడు కూడా వందకు మించి ఎప్పుడూ కట్టలేదు. వీడు దానికి నలభై రేట్లు బాదేశాడు. తర్వాతి రెండ్రోజులూ ఆ పక్కకి కూడా వెళ్ళలేదు. మరో రెండేళ్లు అసలు సెలూన్కే వెళ్ళలేదు. అప్పటినుండి స్వయంకేశఖండనం అలవాటు చేసేస్కున్నాను.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?