ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ కి అభిమానులు పెరిగినా కూడా వచ్చే ఎన్నికలలో ఒక్క స్థానం కూడా బీజేపీ కి రాదు అని చాలా మంది అంటున్నారు. దీనిమీద మీ అభిప్రాయం ఎంటి?
ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ నిలదొక్కుకోలేదని కచ్చితంగా చెప్పలేము. కానీ బీజేపీ రాజకీయ విధానం, ఆంధ్రా రాజకీయాలు గమనిస్తే దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రాలో బీజేపీ ప్రభావం తక్కువగా ఉండడానికి, భవిష్యత్తులో ఎదిగే అవకాశం ఉండడానికి ఈ క్రింది కారణాలు కనిపిస్తున్నాయి.
కులం:
ఆంధ్ర ప్రదేశ్లో రాజకీయాలు ఎప్పుడూ కులం చుట్టూ తిరుగుతుంటాయి. రాష్ట్రంలో ఆర్ధికంగా అత్యంత బలమైన సామజిక వర్గాలు తమ సొంత వర్గాలకు మద్దతు పలుకుతుండడంతో మత రాజకీయాలు చేసే వర్గాలు ఆంధ్రాలో తక్కువగా ఉన్నాయి.(MIM ఉన్నప్పటికీ దాని ప్రభావం స్వతంత్ర అభ్యర్థులకంటే తక్కువ). సప్త సముద్రాలు ఈది పిల్లకాలువలో మునిగిపోయినట్లు మతం పేరుతో దేశంలో ఏకఛత్రాధిపత్యం చేస్తున్న బీజేపీ రాష్ట్రంలోని కుల రాజకీయాలను ఇప్పటివరకూ అర్ధం చేసుకోలేకపోయింది. బీజేపీ కూడా ఈ దిశగా ఇప్పుడిప్పుడే తప్పటడుగులేస్తున్నట్లు కనిపిస్తుంది.
మతం:
ముందు చెప్పినట్లు బీజేపీకి అతి ముఖ్యమైన బలం మతం. బీజేపీ బలపడాలంటే ఆ ప్రాంతంలో చారిత్రాత్మకంగా ముస్లిం పాలన ప్రభావం ఎక్కువగా ఉండుండాలి. అందుకే ఆంధ్ర, తమిళనాడులో బీజేపీ ఓట్లు అడగడానికి సరైన కారణం కనిపించడంలేదు. తెలంగాణా చరిత్రలో ముస్లిం రాజుల పాలన ప్రభావం, ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో MIM హవా ఉండడంతో ఆంధ్ర కంటే ఎక్కువగా తెలంగాణాలో మరో మతపార్టీగా బీజేపీ ప్రబలుతోంది.
నాయకత్వం:
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్ర బీజేపీలో పేరున్న నాయకులు కనిపించడంలేదు. ఒకప్పుడు వెంకయ్యనాయుడు లాంటి నాయకులున్నా, వారు క్షేత్ర స్థాయిలో రాజకీయాలు నడిపింది తక్కువ. ప్రస్తుతమున్న బీజేపీ నాయకులు సోము వీర్రాజుగారు నా అభిప్రాయంలో ఒకరకంగా పార్టీకి బరువనే అనుకుంటున్నాను. ఆంధ్రా ఎన్నికలలో మోడీ బొమ్మ చూసి ఓట్లేస్తారనే అభిప్రాయం పక్కనపెట్టి కేడర్ స్థాయి నుండి దృష్టిపెడితే పరిస్థితి మారొచ్చు.
విభజన హామీలు:
విభజన జరిగిన విధానాన్ని మనసులో పెట్టుకొని కాంగ్రెస్ని భూస్థాపితం చేసిన ఆంధ్ర ప్రజలు రెండవ దోషిగా బీజేపీని చూస్తున్నారు. కానీ అమరావతి శంకుస్థాపనకు మట్టి, నీళ్లు తీసుకొచ్చిన ప్రధాని మాటలు విని కొంతవరకూ అభిప్రాయం మారినా ఆ తర్వాత పరిణామాలు మళ్ళీ పాత అభిప్రాయానికే వచ్చేలా చేశాయి. రాష్ట్ర విభజనని జీవితాంతం గుర్తుపెట్టుకోవడం సాధ్యం కాదు కాబట్టి గుర్రం ఎగిరేవరకూ కాంగ్రెస్ లాగా బీజేపీ కూడా ఎదురుచూడక తప్పదు.
ఇక ఆంధ్రాలో బీజేపీ పుంజుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఎంపీ సీట్లు గెలుచుకునే అవకాశం ఈ క్రింది అంశాలపై ఆధారపడి ఉంది.
ప్రధాన రాజకీయపక్షాల అసమర్ధత:
"రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి" అనేది మా ఎన్నికల స్లోగన్ అని బీజేపీ చెప్పుకుందంటే దేశ రాజకీయాల్లో ప్రతిపక్షం ఎంత దురావస్థలో ఉందొ అర్ధమవుతుంది. దానికితోడు మత రాజకీయం, గుజరాత్ మోడల్ ప్రచారంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ అదే పద్దతిని ఆంధ్రాలో ప్రవేశపెడుతున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రాజకీయ వైఫల్యాలను పక్కనపెట్టి కేవలం అతని మతం, విశ్వాసాలపై దృష్టి పెట్టి రాష్ట్రంలో కొత్త తరహా రాజకీయాలకు తెర లేపింది. ఈ తరహా రాజకీయం తెలుగు పార్టీలకు కొరకరాని కొయ్యలాంటిది. పరిస్థితి చూస్తుంటే ఈ విషయంలో బీజేపీ విజయం సాధించిందనే చెప్పొచ్చు.
ఆన్లైన్ ప్రచారం:
ఒకప్పుడు కమ్మ, రెడ్డి, కాపు వర్గాల మధ్య జరిగే రాష్ట్ర పార్టీల ఆన్లైన్ ప్రచారాల్లోకి కొత్త ఆటగాళ్లు ప్రవేశించారు. అవకాశం దొరికినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వ విఫల విధానాలను కూడా గొప్పగా చూపించడంలో వీళ్ళు సఫలీకృతమవుతున్నారు. వీరి ప్రచారం మరికొంత కొనసాగితే బీజేపీవైపు మరికొంతమంది మొగ్గుచూపే అవకాశం కనిపిస్తుంది.
బీజేపీ హామీలు:
మొన్నీమద్య సోము వీర్రాజుగారు మద్యంతాగే కోటిమంది బీజేపీకి ఓటు వేస్తే 75 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తామని హామీ ఇచ్చారు, అమ్మకం బాగుంటే 50 రూపాయలకే ఇస్తామని చెప్పారు [1] . అలాగే రాష్ట్రంలో జిన్నా టవర్, కేజీహెచ్, కాటన్ బ్యారేజి లాంటి పేర్లు చాలా ఉన్నాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే బీజేపీకి ఆంధ్రాలో రాజకీయ అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Post a Comment