మీరు ట్రూకాలర్ యాప్ వాడితే ఆ యాప్‌తో మీకు కనిపించిన మంచి చెడ్డలు ఏమిటి?

 ఒకప్పుడు క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత అప్పులు ఇస్తామని ఫోన్లు చేసి చావగొడుతుంటే ఆ గోల తప్పించుకోవడానికి కొన్ని వారాలపాటు ట్రూకాలర్ అనువర్తనం ఉపయోగించాను. అనుకున్న పనైతే బాగానే చక్కబెట్టింది కానీ ఆ తర్వాత్తర్వాత నాకేదైనా సందేశం వచ్చిన ప్రతీసారీ డిఫాల్ట్ మెసెంజర్ మార్చమని, యాక్సెస్ ఇమ్మని సలహాలు ఇవ్వడంతోపాటు, ప్రకటనలు ఎక్కువయ్యాక ఇక అనవసరమనిపించి తీసేసాను.

మిగిలిన సమాధానాల్లో చెప్పినట్లుగానే మన చరవాణిలోని పరిచయాల సమాచారం సేకరించి వాటినుపయోగించి కొత్త నంబర్లకు పేర్లు కనుగొంటుంది. దీనివల్ల ఉన్న మంచి ఒకే ఒకటి. మనకు అనవసరమైన ఫోన్ కాల్స్ నిరోధించవచ్చు.

ఇక నష్టాల గురించి మాట్లాడుకుంటే ఈ మధ్యకాలంలో ట్రూకాలర్ అల్గారిథం ఉపయోగించి చేస్తున్న మోసాలు గురించి చెప్పుకోవచ్చు. విశాఖపట్నంలో ఒక ప్రబుద్దుడు అరెస్టయిన తనవారికి జామీను ఇప్పించడానికి ఒక ఐఏఎస్ అధికారి పేరు మీద ప్రభుత్వ వైద్యులకు, ఇతర అధికారులకు ఫోన్ చేయడంతో ఈ మోసం బయటపడింది.[1]

ఒక ఫోన్ నెంబర్ ని ఐదారు ఫోన్లలో ఒక పేరుతో నమోదు చేసుకుంటే ట్రూకాలర్ కూడా మిగతావారికి అదే పేరును చూపిస్తుంది. అది గమనించిన మోసగాళ్లు ఐఏఎస్ అధికారులు, న్యాయమూర్తులు, రాజకీయ నాయకుల పేర్లతో తమ నంబర్లను ట్రూకాలర్లో నమోదు చేసుకుని వాటిద్వారా తమ అవసరాలను చక్కబెట్టుకుని మోసగిస్తున్నారు. ముందు పేర్కొన్న సదరు వ్యక్తి అటువంటి మోసాలు ఇంతకు ముందు కూడా చేసినట్లు, చివరగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైన ఒక కేసు విషయంలో కూడా అదే పద్దతి అనుసరించినప్పుడు దొరికిపోయినట్లు పోలీసులు వివరించారు. సంఘంలో ప్రముఖుల దగ్గర పలుకుబడి ఉన్నట్లు జనాలను బురిడీ కొట్టిస్తున్న మోసగాళ్లందరూ ఈ ట్రిక్కే ఉపయోగిస్తున్నట్లు తెలుస్తుంది. భవిష్యత్తులో ఇదే పద్దతిలో మనల్ని కూడా ఎవరైనా మోసం చెయ్యొచ్చు లేక గవర్నమెంట్ ఆఫీస్ నుండి, పోలీసుల నుండి, బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నట్లు ఫోన్ చేసి మన సమాచారమే దొంగిలించవచ్చు. జాగ్రత్త!

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?