స్వీడన్ లో ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు? ఆ దేశంలో నివసించడం, అక్కడ ఎటువంటి జాబ్ లకి డిమాండ్ ఉంది? దాని PR కి ఎలా అప్లై చేసుకోవచ్చు? భాష నేర్చుకోవడం సులువా? చదువు కోసం వెళితే మంచిదా లేదా పీ ర్ తీసుకొని వెళితే మంచిదా? కొంచెం వివరాలు చెప్పండి.
నేను గత ఐదేళ్లుగా స్వీడన్లో ఉంటున్నాను. ఈ ఐదేళ్ళలో కొన్ని సార్లు తిరిగి ఇండియా వచ్చేద్దామనుకున్న సందర్భాలు ఉన్నాయిగాని ప్రస్తుతానికి అన్నీ అనుకూలంగా ఉండడంతో ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాము.
నా అనుభవంలో స్వీడన్లో ఉండడానికి అనుకూలంగా ఉండే అంశాలు.
- జీతం: ఐదేళ్లక్రితం ఇండియాలో నాకొచ్చిన జీతంకంటే ఇక్కడ ఎక్కువ జీతం వచ్చింది. కానీ ఉద్యోగ అనుభవం పెరిగేకొద్దీ జీతాలమధ్య ఆ తేడా తగ్గిపోతుంది. కారణం ప్రతికూలతల్లో చెప్తాను.
- పని: నేను ఇండియాలో పని చేసేటప్పుడు పనిగంటల విషయంలో పద్దతి అంటూ ఏం ఉండేది కాదు. సగటున పదిగంటలు ఆఫీసులోనే ఉండాల్సి వచ్చేది. ఈ అధిక పనిగంటలన్నీ అనధికారంగా మాత్రమే. మేనేజర్లు ఒప్పుకొన్న గడువులని అందుకోవడానికి అలా చెయ్యాల్సొచ్చేది. స్వీడన్లో గత నాలుగేళ్లలో నేనెప్పుడూ లెక్కలోకి రాని పనిగంటల్లో పనిచేయలేదు. నా పనిగంటలకంటే ఎక్కువగా చేసిన పనికి రెండు నుండి మూడు రెట్లు అధిక జీతం వస్తుంది.
- ప్రభుత్వ పనితీరు: స్వీడన్ పౌరులకున్న దాదాపు ప్రతి సౌకర్యం వలసదారులకి కూడా ఉంటుంది. ఉచిత(దాదాపుగా) వైద్యం, ఉచిత విద్య(ఉద్యోగి పిల్లలకు, ఉద్యోగి, ఉద్యోగి భాగస్వామికి కూడా) , పని భీమా, భాగస్వామికి కూడా ఉద్యోగం చేస్కునే హక్కు, నిరుద్యోగ భృతి, నిర్బంధ సెలవులు, తల్లిదండ్రులకిద్దరికి ఉదారమైన ప్రసూతి సెలవులు, స్థానిక ఎన్నికల్లో ఓటుహక్కు ఉన్నాయి.
- ప్రయాణాలు: నాకు ఆఫీసుకి ఇంటికి రోజు ప్రయాణం సమయం అరగంట నడక లేదా పది నిముషాలు సైకిలు. మా అమ్మాయి బడి, నా భాషా బడి నా ఆఫీస్ పక్కనే. అన్ని పట్టణాల్లో ఇలాగె ఉండదు కానీ చెన్నై, బెంగళూరు లాంటి నగరాలతో పోలిస్తే ఇక్కడ ప్రయాణ సమయం బాగా తక్కువ.
ప్రతికూలతల చిట్టా కూడా పెద్దదే.
- నత్తనడక పనులు: ప్రతి నిర్ణయం చాలా ఆలస్యంగా తీసుకుంటారు. నా వీసా పొడిగించుకోవడానికి అక్షరాలా రెండేళ్లు వేచిచూడాల్సొచ్చింది. ఇటువంటి నమ్మలేని సమయాలు చాలా తక్కువ సందర్భాల్లో జరిగాయిగాని సగటున ఐదారు నెలలైనా పడుతుంది.
- ఇల్లు: స్వీడన్లో రెండు రకాల అద్దె ఇళ్ళు ఉంటాయి. స్థానిక ప్రభుత్వాలకి చెందినవి, ప్రైవేట్ సంస్థలవి. ప్రభుత్వ కంపెనీలు ఇచ్చే ఇళ్ళు నగరం మధ్యలో తక్కువ అద్దెకి ఉంటాయి. కానీ వీటికోసం రిజిస్టర్ అయ్యి వేచి చూడాలి. ముందు ఎవరు నమోదు చేసుకుంటే వాళ్ళకి కేటాయిస్తారు. వీటికోసం వేచిచూసే సమయం స్టాక్ హోమ్ లో 10-20 ఏళ్ళు, మా ఊళ్ళో 5-15 ఏళ్ళు ఉంది. వలసదారులు ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళకి పాతికేళ్ళు అనుకుంటే వాళ్ళకి ఇల్లొచ్చేటప్పటికి విశ్రాంత ఉద్యోగులు అవుతారు. స్వీడన్ దేశస్తులు వాళ్ళ చదువులు పూర్తి కాకముందే ఈ వరుసలో తమ పేర్లు నమోదు చేసుకుంటారు. మనకి ఆ అవకాశం లేదు. ప్రైవేట్ కంపెనీలు అంత తొందరగా విదేశీయులకి ఇవ్వవు. ఇచ్చినా అధిక అద్దె ఉంటుంది. గతిలేక చాలామంది తమకి తాహతు లేకపోయినా ఇళ్ళు కొనాల్సివస్తుంది. నేను కూడా అలాగే చేయాల్సొచ్చింది.
- వాతావరణం: నేను దక్షిణ కొనలో ఉంటున్నాను కాబట్టి మాకు సంవత్సరానికి ఐదు నెలలు సాధారణ వాతావరణం ఉంటుంది. మిగిలిన నెలలన్నీ చలీ, చీకటి. దానిని తట్టుకోవడం అనుకున్నంత సులభం కాదు. వచ్చిన కొత్తలో రోజుకి 20 గంటలు సూర్యుడుండడంతో మా ఆవిడ ఇన్సోమ్నియాతో బాధ పడి నిద్ర మాత్రలు వేసుకోవలసి వచ్చింది. గత సంవత్సరమంతా ఇంటినుండే పని చెయ్యడం, ఈ చలికాలం వేరే వ్యాపకం పెట్టుకోకపోవడంచేత కుంగుబాటు లక్షణాలు కనిపించడంతో వైద్యుణ్ణి సంప్రదించి సలహాలు తీసుకున్నాను.
- పెరుగుతున్న అతివాద భావజాలం: మిగతా దేశాలతో పోలిస్తే తక్కువైనప్పటికీ స్వీడన్లో గత పదేళ్లలో జాతీయవాద, అతివాద పార్టీలకి మద్దతు పెరుగుతుంది. వాళ్ళ ఉద్దేశ్యంలో స్వీడన్లోని ప్రతి సమస్యకి కారణం విదేశీయులు, వలసవాదులు. ఈ పార్టీలు అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోలేదు. వస్తే డోనాల్డ్ ట్రంప్ లాగా ఇప్పుడున్న చట్టాలు మార్చడానికి ప్రయత్నించొచ్చు.
- తల్లిదండ్రులకిచ్చే వీసా పరిమితులు: తల్లిదండ్రులను వీరు కుటుంబ సభ్యులుగా పరిగణించకపోవడం చేత వారికి కేవలం మూడు నెలల సాధారణ వీసా మాత్రమే లభిస్తుంది.
- పన్ను: మనకొచ్చే జీతం బట్టి 35, 50 శాతం పన్ను స్లాబులు ఉంటాయి. యజమాని ఉద్యోగి పేరుతో కట్టే పన్ను కూడా లెక్కగడితే 50-65 శాతం పన్ను పడుతుంది. కాబట్టి పేపర్ మీద ఉన్న జీతానికి చేతికి వచ్చే జీతానికి చాలా వ్యత్యాసం ఉంటుంది.
- సంఘాలు: ఇక్కడ ప్రతి ఉద్యోగానికి, ఉద్యోగం ఇచ్చేవాడికి కూడా సంఘాలు ఉంటాయి. మన జీతం ఎంత పెరగాలో ఉద్యోగుల సంఘం, కంపెనీల సంఘం మాట్లాడుకుని నిర్ణయిస్తాయి. ఆ మొత్తం ఇక్కడి ద్రవ్యోల్బణానికి కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే. కాబట్టి అనుభవం పెరిగేకొద్దీ జీతం పెరుగుదల వల్ల ఇండియాలోనే ఎక్కువ జీతం వస్తుంది. మంచి జీతం రావాలంటే తరచుగా కంపెనీ మారాలి. అదో పెద్ద తలపోటు.
ఉద్యోగావకాశాలు: ఈ దేశంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా టెలికాం, గేమింగ్, ఆటోమొబైల్ రంగాల్లో పనిచేసినవారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మెకానికల్ రంగంలో పనిచేసే ఇంజినీర్లకు ఉద్యోగాలు ఎక్కువ ఉన్నట్లుంది. నేను మా కంపెనీ ఇచ్చిన వర్క్ పర్మిట్ మీద వచ్చాను. నా ఆఫీసులో చాలామంది ఇక్కడ మాస్టర్స్ చదివి ఉద్యోగం సంపాదించారు. నేనైతే పని వీసా మీద వస్తేనే మంచిదనుకుంటున్నా. ఇక్కడ మాస్టర్స్ చదవడానికి ఉపకార వేతనం లేకపోతే 15-20 లక్షలు ఖర్చు అవుతుంది. ప్రతి మాస్టర్స్ విద్యార్థికి పార్ట్-టైం పనిచేసే హక్కు ఉంది. చదువుకి నష్టం కలగకుండా పని దొరికితే గరిష్టంగా వారానికి నలభై గంటలు పని చేయొచ్చు.
పని వీసా మీద వద్దాం అనుకునేవారికి మూడు అవకాశాలు ఉన్నాయి.
- ఇక్కడ పనిచేస్తున్న స్నేహితులు, బంధువులకి చెప్పి వారి కంపెనీల్లో అవకాశం ఉంటే తమ పేరు సూచించమని చెప్పడం.
- ఇప్పుడు ఇండియాలో పనిచేసే కంపెనీలోనే స్వీడన్ వచ్చే అవకాశం ఉన్న ప్రాజెక్ట్ అడగడం.
- నేరుగా లింక్డ్ఇన్ లో స్వీడన్లో ఉద్యోగాలు వెదకడం. ఇది కొంచెం శ్రమతో కూడుకున్నది. సమయం ఎక్కువ పడుతుంది. ఈ పద్దతిలో ఎవరికీ డబ్బులు కట్టోద్దు.
ఇక్కడ నాలుగేళ్లు పనిచేస్తే శాశ్వత వీసా వస్తుంది. ఆ నాలుగేళ్లలో కనీసం 44 నెలలు ఉద్యోగం ఉండాలి. ఐదేళ్లకి పౌరసత్వానికి ధరఖాస్తు చేసుకోవచ్చు. అంటే శాశ్వత వీసా వచ్చిన తర్వాత ఏడాదే పౌరసత్వానికి అర్హత సాధిస్తారు. ప్రస్తుతానికి శాశ్వత వీసా, పౌరసత్వానికి స్వీడిష్ భాష తప్పనిసరి కాదు. కానీ భవిష్యత్తులో తప్పనిసరి చేసే అవకాశం ఉంది.
భాష: ఇంగ్లీష్ కంటే కొంచెం కష్టంగా ఉందిగానీ నాకు తెలిసిన చాలామంది భారతీయులు సులువుగానే నేర్చుకున్నారు. బయట స్నేహితులనుండి, ప్రజలనుండి నేర్చుకోవడం దాదాపు అసాధ్యం. వాళ్ళు ఇంగ్లీషులోనే మాట్లాడతారు. ప్రభుత్వమే భాష నేర్పించడానికి ఉచిత సదుపాయాలు ఏర్పాటు చేస్తుంది. ఉద్యోగం చేసేవాళ్ళు సాయంత్రపు బడులకు వెళ్ళవచ్చు. స్థానికులతో మాట్లాడడానికి ఆరు నెలలనుండి రెండేళ్ల సమయం పట్టొచ్చు. నేను రెండేళ్ళనుండి చదువుతున్నా. వానాకాలం చదువులాగా సాగుతుంది. ఇప్పుడు కొంచెం పర్లేదు. వీళ్ళ టీవీ కార్యక్రమాలు చూద్దామనుకుంటే డార్క్ హ్యూమర్ అర్ధం చేసుకోవాల్సిందే.
ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే వ్యాఖ్యల్లో అడగగలరు.
Comments
Post a Comment