మీకెప్పుడైనా Quora నుంచి బయటకొచ్చి ఖాతా తొలగించాలనిపించిందా?

 కొన్ని నెలల క్రితం ఆ అభిప్రాయం కలిగింది. మొత్తం కోరా అకౌంట్ తొలగించాలనిపించలేదు కానీ తెలుగు కోరా తొలగించాలనిపించింది.

కోరా ప్లాట్ఫారంతో నాకు ఎటువంటి సమస్య లేదు. ప్రత్యేకంగా పుస్తకాలు చదివే అలవాటులేని నాకు ఆంగ్ల కోరా చాలా బాగా ఉపయోగపడింది. కోరా తెలుగు ప్లాట్ఫారం వచ్చిన మొదట్లో ఇక్కడినుండి నేను పెద్దగా ఆశించినదేమి లేదు. ఎందుకంటే ఒక విషయం గురించి ఇంటర్నెట్లో వెదకడానికి ఆంగ్ల భాష అలవాటైపోయి ఆంగ్ల కోరా వాడడమే సులభం అనే అభిప్రాయం ఉండేది. కానీ ఇంకెక్కడా చదవలేని జీవితానుభవాలు, తెలుగు ప్రాంతాలకే ప్రత్యేకమైన కొన్ని విషయాలు, తెలుగు భాష గురించి ఇంతకు ముందు అసలు తెలియని విషయాలు, జిల్లా జిల్లాకు మారిపోయే ఆచార వ్యవహారాలు, వంటకాల వివరాలు నాలో తెలుగు కోరా మీద ఆసక్తిని పెంచాయి.

వీటికి తోడు ఆంగ్ల భాషలో రాసేటప్పుడు ఉండే బెరుకు తెలుగులో రాసేటప్పుడు లేకపోవడం చేత ఇక్కడ రాయడం కూడా చాలా సౌకర్యంగా అనిపించేది. నా మొదటి సమాధానాల్లో విచిత్రమైన పేరాలు, అచ్చుతప్పులు ఉంటే చాలామంది సాటి కోరన్లు సవరణలు చేసి, కొంచెం అర్ధవంతంగా ఎలా రాయాలో పరోక్షంగా నేర్పించారు.

పర్లేదు బాగుంది అనుకున్న సమయంలోనే తెలుగు కోరాలో ఆంగ్ల కోరాతో పోల్చితే మరొక తేడా గమనించాను. అదే తప్పుడు సమాచారాలు, వాటికొచ్చే ప్రతిస్పందనలు.

పురాణాల్లో డైనోసార్లు ఉన్నాయని, కోట్ల సంవత్సరాల క్రితమే మనుషులు, డైనోసార్లు కలిసి అడుగులు వేశాయని చెబితే విశేషమైన మద్దతు ఉంటుంది. ఇక సొంత మతంలోని తప్పులు వెదికితే గుక్కపెట్టి ఏడ్చేవాళ్ళు ఎదుటివాళ్ళ ఆచారాల్లో బొక్కలు వెతుకుతుంటారు. సంబంధం లేకుండా ప్రస్తుత విజ్ఞానశాస్త్రాలను మతగ్రంధాలను, మూఢనమ్మకాలను మిక్సీలో వేసి కలగాపులగం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వీటికి తోడు ఆధారాలు లేని చరిత్రను పుట్టించే సృజనాత్మకత కలిగినవారు ఇంకొంతమంది.

ఈ మధ్య మరొక సోషల్ మీడియాలో తెలుగు కోరా మీద ఉన్న అభిప్రాయం కనుక్కుంటే ఇలా సమాధానం వచ్చింది. ఇందులో కొంచెం అతిశయోక్తి ఉన్నప్పటికీ ఆ వ్యక్తి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను.

ఈ ఆలోచనతోనే కొన్ని నెలలక్రితం తెలుగుభాషను కోరా ప్రొఫైల్ తొలగించిన తర్వాత ఇద్దరు వాడుకరులు గీతోపదేశం చేసారు. ఇటువంటి తప్పుడు సమాచారాన్ని ప్రశ్నించే విషయంలో నన్ను నేను అతిగా ఊహించుకుంటున్నానని, నకిలీ సమాచారాన్ని ప్రశ్నించడంతో మరికొంతమంది కోరన్లు కూడా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారని వివరించి కొన్ని ఉదాహరణలు చూపించారు. దానితో నా ఓవరాక్షన్ ఆపి మళ్ళీ తెలుగు కోరా వాడడం మొదలుపెట్టాను.

ఒకవేళ భవిష్యత్తులో కోరాలోని ఆలోచనల్లో ముసలితనం పెరుగుతుందనిపిస్తే అప్పుడు వాడకం తగ్గిస్తానేమో!

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?