ప్రస్తుతం మీరు వినడానికి ఇష్టపడే వక్తలు (Speakers) ఎవరు?

 ప్రొఫెసర్ K.నాగేశ్వర్ గారు.

K నాగేశ్వర్ గారు ఉస్మానియా యూనివర్సిటీనుండి జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, రాజనీతి శాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేసి ప్రస్తుతం అదే యూనివర్సిటీలో సమాచార, పాత్రికేయ విభాగంలో ఆచార్యులుగా పనిచేస్తున్నారు. ఆయన గతంలో రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికై ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి చెందారు. ఆయన కేవలం ఆచార్యులు, పాత్రికేయులు, రాజకీయమే కాక సమకాలీన రాజకీయాలపై విశ్లేషణలు కూడా చేస్తుంటారు.

రాజకీయమంటే వ్యక్తిగత విమర్శలు, దాడులు, ప్రతిదాడులైపోయిన ప్రస్తుత పరిస్థితులలో, నిష్పక్షపాతంగా ఉండాల్సిన ప్రధాన మీడియా వారి సొంత ఎజెండాలపై పనిచేస్తున్న ఈరోజుల్లో, కేంద్రమూ, రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతిపక్షాలు దాదాపుగా చచ్చుబడిపోయినపుడు ఆ భాద్యతను కొన్ని ప్రైవేట్ యూట్యూబ్ చానళ్ళు, ట్రోల్ పేజీలు (హాస్యం కాదు, అక్షర సత్యం) తీసుకున్నాయి. అటువంటి గొంతుకల్లో నాకు అత్యంత విశ్వసనీయమనిపించింది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి రాజకీయ విశ్లేషణలు. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో మన దేశంలోని కోవిడ్ సంక్షోభంపై నాగేశ్వర్ గారి విశ్లేషణలు, వివరణలు మన పాలకుల నిర్లక్ష్యాన్ని కళ్ళకు కట్టినట్లు ఆధారాలతో చూపిస్తున్నాయి.

నాగేశ్వర్ గారు ఇచ్చే వివరణల్లో ఒక మూడు అంశాలు నాకు బాగా నచ్చుతాయి.

  • తన విశేషణలకు ఆయన చూపించే ఆధారాలు నమ్మదగిన సంస్థలనుండి తీసుకుంటారు. ముఖ్యంగా దేశంలోని ప్రముఖ ప్రభుత్వ సంస్థలు విడుదల చేసే వివరాలు, ప్రపంచస్థాయిలో మంచిపేరు ఉన్న మీడియా సంస్థల కవరేజ్లు ఉటంకిస్తారు.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవ్వరూ ఊహించని అసాధారణ నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఏ వార్తాపత్రికలోనూ రాలేని తెరవెనక కారణాలను తన అభిప్రాయాలతో పంచుకుంటారు. అది కేవలం తన అభిప్రాయమేనని అది ఎదుటివారికి నచ్చక్కర్లేదని మొహమాటపడకుండా చెబుతుంటారు.
  • తన విశ్లేషణలు వీలైనంతవరకు నిష్పాక్షికంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. జాతీయవాద పార్టీల నుండి, కమ్యూనిస్టు పార్టీలవరకు అన్ని పార్టీల వివాదాస్పద నిర్ణయాల మీద ఆయన తన విమర్శల గళం వినిపించారు.

పై మూడింటితో పాటు టీవీ చర్చలకొచ్చే మన రాజకీయనాయకులెవరికీ లేని ఒక లక్షణం ఆయనకుంది. అదే ఎదుటివారికిచ్చిన సమయంలో వారిని మాట్లాడనిచ్చే సభా మర్యాద.

స్టాండప్ కమెడియన్ రాజశేఖర్ మామిడన్న గారు.

ఇక వినోదం అందించే వక్తల్లో ఇష్టమైన వారు స్టాండప్ కమెడియన్ రాజశేఖర్ మామిడన్న గారు.

తెలుగులో మనకున్న అతితక్కువమంది స్టాండప్ కామెడియన్లలో రాజశేఖర్ గారు ఒకరు. ఆయన ప్రదర్శనకి వెళ్లే అవకాశం నాకు రాలేదు కానీ యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూసి ఆయన అభిమానినయ్యాను (చొక్కాలు చింపుకునేది కాదు).

తెలుగులో స్టాండప్ కామెడీ అంటే వంకర డైలాగులు అనుకునే ఈ రోజుల్లో ఎదుటివారిని కించపరచకుండా ఆయన పుట్టించే హాస్యం నాకు బాగా నచ్చుతుంది. ముఖ్యంగా చాలా చిన్న చిన్న వాక్యాలతో తన హావభావాలను జతచేసి ఆయన చేసే ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంటుంది. తను ఈ వృత్తిని ఎంచుకోవడానికి కారణం, దానివలన తను ఎదుర్కొన్న ప్రతిఘటనలు తనదైన శైలిలో జోష్ టాక్స్ అనే ప్రోగ్రాంలో వివరించిన తీరు చాలా హాస్యభరితంగా అనిపించింది. రామాయణ ఇతివృత్తాన్ని తన కధాంశంగా తీసుకుని ఎవరిని నొప్పించకుండా ప్రదర్శన ఇవ్వడం రాజశేఖరుగారికే చెల్లుతుందేమో.

రాజశేఖర్ గారిని మాఊరికి తీసుకొచ్చి ప్రదర్శన ఇప్పించేటంత డబ్బులేవు కాబట్టి నేనే హైదరాబాదు వచ్చినప్పుడు అవకాశం ఉంటే ఆయన ప్రదర్శన చూస్తాను.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?