కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో మీ హెయిర్ కట్ కోసం ఏం చేశారు?
స్టాక్ హామ్ కి వచ్చిన రెండో రోజే తగిలిన దెబ్బకి గడ్డంతో పాటే ట్రిమ్మర్ తో జుట్టు కత్తిరించుకోవడం అలవాటైపోయింది. మొదట్లో కొంచెం ఇబ్బంది అయ్యింది. కానీ దానర్ధం ఆ తర్వాత నేను ట్రిమ్మర్ తో జుట్టు కత్తిరించుకోవడంలో నిష్ణాతుడిని ఐపోయానని కాదు, నా జుట్టుని చూసి ఎదుటివారు ఏమనుకుంటున్నా పట్టించుకోవడం మానేసానని. ఆవిధంగా ఏమైనా ముఖ్యమైన సందర్భాలు ఉన్నప్పుడు తప్ప ఇంకెప్పుడూ సెలూన్కి వెళ్లకపోవడంతో అసలు ఈ కోవిడ్ సంక్షోభంలో నాకు జుట్టు గురించిన సమస్యే రాకూడదు. కానీ ఆ సమస్య నా పాసుపోర్ట్ రూపంలో వచ్చేసింది.
నేనుంటున్న దేశంలో లాక్ డౌన్ పెట్టలేదు. కానీ కోవిడ్ భయంతో స్వయం ప్రకటిత నిబంధనలు పెట్టేసుకుని సెలూన్ లాంటి అప్రధానమైన విషయాలను లిస్టులో నుండి తీసేసాను. కానీ సరిగ్గా అదే సమయానికి నా పాసుపోర్ట్ గడువు కూడా దగ్గర పడుతోంది. దాన్ని పునరుద్దరించాలంటే ఇటీవల దిగిన ఫోటో ఇవ్వాలి. ట్రిమ్మర్ తో గొరిగిన తిరుపతి మెట్లతో ఫోటో దిగడం ఇష్టం లేక సెలూన్కి వెళ్ళడానికే నిర్ణయించుకున్నాను. కానీ దేశం కానీ దేశంలో కరోనా తెచ్చుకోవడం ఎందుకని జంకి కొద్దీ రోజుల తర్వాత వెళదామని వాయిదా వేసాను. రోజులు కాస్తా వారాలైపోయాయి. వారాలు గిర్రున తిరిగి ఐదు నెలలయ్యాయి. నా జుట్టు ఊడలు వేసే స్థితికి దగ్గరగా వచ్చేసి జెడలబర్రె లాగా తయారయ్యాను. ఇంటికి ఫోన్ చేసినప్పుడల్లా మా అమ్మ, ఇక్కడ మా ఆవిడా "జుట్టు కత్తిరించు మహాప్రభో చూడలేక చస్తున్నాం!" అని ప్రాధేయపడసాగారు. కానీ మా అమ్మాయి మా ఆవిడ జుట్టుని వదిలేసి నా జుట్టుతో ఆడుకోవడం మొదలెట్టడంతో మా ఆవిడ సంతోషించి నా జుట్టు జోలికి రావడం మానేసింది.
మరోపక్క మూడో అల కెరటంలా లేచి పడింది. పాసుపోర్టుకి ఇంకా ఆరు నెలలు గడువు మాత్రమే ఉంది. ఇక తప్పక పోయిననెలలో ఒక కొత్త సెలూన్లో అడుగుపెట్టి పావనం చేశాను. నా అవతారం చూసి బార్బరుగారు దడుసుకుంటాడేమో అనుకున్నానుగాని, కరోనా దెబ్బకి వచ్చే గిరాకీలన్నీ నాలాగే ఉన్నాయేమోకాబోలు, మొహం మామూలుగానే పెట్టాడు. "ఎలా చెయ్యాలి, బ్రో" అని అడిగితే "మళ్ళీ ఆరునెలలు నీ మొహం చూడకూడదు, అంటకత్తిరేసేయ్" అని మరో ఆలోచన లేకుండా చెప్పేసాను. ఆ తర్వాత ఫోటో దిగి పాసుపోర్టుకి అప్లై చేసుకున్నాను.
Comments
Post a Comment