ఇండోనేసియా 2022లో కొన్న రఫేల్ విమానాలకు, భారతదేశం 2016లో కొన్న రఫేల్ విమానాలకు మధ్య ఖరీదులో చాలా తేడా ఉంది. ఎందుకని?

 ఒకే మోడల్ కి చెందిన కార్లలో కూడా వినియోగదారుడి ఇష్టాయిష్టాల మేరకు ధరలో మార్పు సహజమే. అటువంటిది ఒక దేశ వైమానిక దళం కూడా తన అవసరాలకు అనుగుణంగా తమ యుద్ధ విమానాలను ఎంచుకోవడం వల్ల ధరలో మార్పు కనిపిస్తుంది.

రాఫెల్ యుద్ధ విమానాల విషయంలో మనదేశానికి పడిన ధరతో పోల్చితే ఇండోనేషియాకు తక్కువ ధరకు వచ్చినట్లు కనిపిస్తున్నా దానికి తగ్గ కారణాలు సమంజసంగానే తోస్తున్నాయి.

భారతదేశ అదనపు అవసరాలు: మన పొరుగుదేశాల వైమానిక బలాల దృష్ట్యా ఫ్రాన్స్ దేశం అమ్మజూపిన బేసిక్ వెర్షన్ కు మించిన అదనపు సాంకేతికత, ఆయుధ వ్యవస్థ మన వైమానికదళానికి అవసరం. ఈ అదనపు ఆయుధ వ్యవస్థ ఇండోనేషియా రాఫెల్ యుద్ధ విమానాలలో లేవు.

ఆర్డర్ పెట్టిన సమయం: భారతదేశం 2016లో ఆర్డర్ పెడితే ఇప్పటికే కొన్ని యుద్ధ విమానాలను అప్పగించారు. ఇండోనేషియా 2022 లో కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది, యుద్ధ విమానాలు తన వైమానిక దళంలో చేరేటప్పటికి మరికొన్నేళ్లు పట్టొచ్చేమో. ఏ సాంకేతికతైనా వచ్చిన మొదట్లో కొత్త వాడుకరులకు ఎక్కువ ధర పడడం మాములు విషయమే. తక్కువకే కావాలనుకుంటే ఒక రెండేళ్ళాగి కొనుక్కోవచ్చు. కానీ అప్పటికి మన వైమానిక అవసరాలు తీరకపోగా ఒకడుగు వెనకంజలో ఉంటాము.

ఒప్పందంలో భారత ప్రభుత్వ నిబంధనలు: ఒప్పందంలో భాగంగా దస్సో సాంకేతికతను భారతీయ కంపెనీలకు ఇవ్వాల్సి వస్తుంది. ఈ నిబంధన ఇండోనేషియా, ఖతార్ దేశాల ఒప్పందాలలో లేదు. అయితే మొదట్లో ప్రభుత్వ సంస్థ అయిన హాల్ కి తయారీ పనులు అప్పజెప్పాలని మాటలు జరిగినా చివరికి అది అంబానీ రిలయన్స్ డిఫెన్స్ చేతికి వెళ్ళింది.

ప్రతిపక్షాలు ఒప్పందంలో హాల్ ని తప్పించి రిలయన్స్ డిఫెన్స్ ని తెచ్చిన వివాదాస్పదమైన అంశాన్ని గాలికొదిలి డీలక్స్ బస్సు, ఆర్డినరీ బస్సు టికెట్ రేట్లు పోల్చినట్లు ఇతర దేశాల ఒప్పందాలతో లాజిక్ లేకుండా పోల్చడం వల్ల కలిగే ప్రయోజనం శూన్యం.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

తెలుగు ప్రముఖుల్లో ఎవరి జీవితాలను బయోపిక్స్‌గా తీస్తే బావుంటుంది? ఎందుకు?

ఇంతకు మించిన హిపోక్రసీని ఈ జన్మలో చూడలేను ' అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపించి ఉంటే ఎవరిని చూసి, ఎందుకు అనిపించింది?