దేశానికి నాయకత్వం వహించే నాయకులు మోడీ లా పన్నులు రుద్దుతూ కటువుగా ఉండి ఆర్ధిక వ్యవస్థ సరైన దారిలో నడపడం మంచిదా లేక నాదేం పోయింది, నేను ఉండగా అప్పులు చేసి (భావి ప్రభుత్వాల మీద భారం వదిలేసి) ప్రజలు సుఖం గా ఉంటే చాలు అనే మన్మోహన్ సింగ్ నాయకత్వం మంచిదా?

 ప్రశ్నలోనే మన ఉద్దేశ్యాలను చొప్పించి దానికి తగ్గట్లు సమాధానాలు ఆశిస్తే నా సమాధానం ప్రశ్న అడిగినవారిని నిరుత్సాహపరుస్తుంది.

ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం జనాలపై కటువుగా పన్నులు రుద్దుతుందని ప్రశ్నలోనే ఒప్పుకున్నారు కాబట్టి ఆ విషయం గురించి నేను వివరించనవసరం లేదు. కానీ పన్నులు పెంచుతున్నందుకు మోడీ ప్రభుత్వం విమర్శకు అర్హులా కాదా అనే అంశం వివరిస్తాను.

ఈ మాటలు మోడీగారు అధికారంలోకి రావడానికి ముందు చెప్పినవి. కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పెట్రోల్ ధరల పెంపును వ్యతిరేకించారు. జీఎస్టీని వ్యతిరేకించారు. రూపాయి మారకపు విలువ పడిపోవడానికి కారణం అవినీతి అన్నారు. వీటికి అదనంగా ఉండే గానా భజన గ్యాంగ్ మోడీగారు అధికారంలోకి రాగానే పన్నులు తగ్గిపోతాయి, రూపాయి విలువ డాలరుకి 30-40 కి పెరిగిపోతుంది, పెట్రోలు మంచినీళ్ళకన్నా చవకైపోతుంది అన్నట్లు ప్రచారం చేసి అరచేతిలో వైకుంఠం చూపించారు. ఈ మాటలు విన్న సగటు భారతీయుడికి ఏమనిపిస్తుంది? ఈయన అధికారంలోకి రాగానే ధరలు తగ్గి జీవితం సాఫీగా వెళుతుందని అనుకుంటాడా? లేక పన్నుల భారం పెరుగుతుందని అనుకుంటాడా?

పోనీ అధికారంలోకి రాగానే మాట మార్చి పన్నులు పెంచారేంటి అని అడిగితే బీజేపీ ప్రభుత్వం చెబుతున్న కారణాలు సహేతుకంగా ఉన్నాయా అంటే అదీ లేదు. పాత ప్రభుత్వాలు చేసిన అప్పులు తీర్చడానికి పన్నులు పెంచామని చెప్పారు. కానీ వసూలైన పన్నులకు, కట్టిన వడ్డీలకు అస్సలు సంబంధం లేదు. ఆయిల్ బాండ్లపై అప్పుల వల్ల పెట్రోల్ పై పన్నులు తగ్గించలేమని ఆర్ధికమంత్రి చేసిన వ్యాఖ్యల్లో అస్సలు నిజం లేదు. 2021లో ఆయిల్ బాండ్ల అసలు, వడ్డీ కలిపి కట్టింది కేవలం 13 వేల కోట్లు. కానీ పెట్రోలుపై పన్నులు పెంచడం వల్ల వసూలైన మొత్తం 4 లక్షల కోట్లు. అబద్దం చెప్పినా అతికినట్లుండాలి అనేది సామెత.

పాత ప్రభుత్వాలు అప్పులు చేసి భావి తరాల మీద భారం వదిలేస్తున్నారు అన్నారు. మరి మోడీ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో చేసిన అప్పుల సంగతేమిటి? 2014 లో 60 వేల కోట్లు ఉన్న కేంద్ర ప్రభుత్వ అప్పులు 2021 కి లక్ష కోట్లు ఎందుకు దాటాయి? 2024 కి ఎన్ని లక్షల కోట్లు అవుతాయి. ఇది భావి తరాల మీద భారం కాదా? కోరాలోనే ఒక విచిత్రమైన కుట్ర సిద్ధాంతం చదివాను. ప్రపంచ బ్యాంకు ఆంధ్ర ప్రదేశ్, కేరళ, తమిళ్ నాడు, పశ్చిమ బెంగాల్ లాంటి బీజేపీయేతర రాష్ట్రాలకు అప్పులు ఇచ్చి ఆ నాయకులతో కమీషన్ల వాటా పంచుకుంటుందని ఒక బీజేపీ అభిమాని రాసారు. మరి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ రాష్ట్రాలు తీసుకునే అప్పుల్లో కూడా కమిషన్లు వెళ్తే ఈ లక్షల కోట్ల అప్పుల్లో ఎవరెంత తిన్నట్లు?

ఇక కేంద్ర మంత్రులు, ఇతర నాయకులు చెప్పే కారణాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో! ఒకాయన "జనాలకు అలవాటైపోతుంది" అంటారు. మరొకరు "సైకిలు తొక్కుకోండి" అని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతారు. ఎలక్ట్రిక్ బళ్ళు కొనుక్కోమని ఒకాయన, రాహుల్ గాంధీని అడగమని మరొకాయన అంటుంటే ఎప్పుడో ఏభై ఏళ్ళక్రితం పోయిన నెహ్రూని ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్ రేట్లకు భాద్యుణ్ని చేసే వాళ్ళు మరికొంతమంది. చిరాకేస్తుంది, వీళ్ళ మాటలు వింటుంటే. ఇక ఆన్లైన్ భజన బృందాలైతే నాజీల ప్రచారానికి తక్కువేమీకాదు అన్నట్లు ఉంటాయి.

ఒకపక్క సామాన్య ప్రజల మీద పన్నులు పెరిగితే మరోపక్క కార్పొరేట్ పన్నులు తగ్గిపోయాయి. కనీసం నల్లడబ్బు వెనక్కి తీసుకొస్తామన్నారు కాదా ఎక్కడ అని అడిగితే అది జుమ్లా అని చెప్పినా అడగడానికి సిగ్గుండాలి కదా అని ఒక సోషల్ మీడియా ప్లాట్ఫారంలో ప్రశ్నించాడొక పెద్దమనిషి.

పన్నులు పెంచడానికో, మోడీ ప్రభుత్వానికో నేను బద్ద వ్యతిరేకిని కాదు. ఒకానొక సమయం వరకూ మోదీగారిని సమర్ధించినవారిలో నేనూ ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, గుజరాత్ మోడల్ ప్రచారాల వల్ల 2014లో బీజేపీ ప్రభుత్వం రావాలని చాలా బలంగా కోరుకున్న వాళ్లలో నేను కూడా ఒకడినే. కాకపోతే ఆ హైపు కి తగ్గ ఫలితాలు కనిపించకపోగా దానికి పూర్తి వ్యతిరేక దిశలో పయనిస్తున్నామని అనిపిస్తుంది.

మన్మోహన్ సింగ్ ప్రభుత్వం విఫలమయ్యిందనే బీజేపీ చేతికి అధికారమిచ్చారు. వీళ్ళేదో చక్కబెడతారు అనుకుంటే వాళ్ళతో పోల్చుకుంటే మా వైఫల్యాలు అసలు వైఫల్యలా అన్నట్లు అడుగుతున్నారు. ఇక్కడ ఒక సినిమా డైలాగ్ చెప్పొచ్చు. కానీ బీజేపీ ప్రభుత్వం మీద పడి ఏడుస్తున్నారు అని గోల పెడతారని చెప్పట్లేదు. సెలవు!

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

తెలుగు ప్రముఖుల్లో ఎవరి జీవితాలను బయోపిక్స్‌గా తీస్తే బావుంటుంది? ఎందుకు?

ఇంతకు మించిన హిపోక్రసీని ఈ జన్మలో చూడలేను ' అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపించి ఉంటే ఎవరిని చూసి, ఎందుకు అనిపించింది?