ఒకప్పుడు మీరు ఎంతగానో నమ్మి, ఇప్పుడు పూర్తిగా వ్యతిరేకిస్తున్న సిద్ధాంతం ఏమిటి? దాని పట్ల ఎందుకు అంత వైముఖ్యత కలిగింది?

 ఒకప్పుడు కాదు, నిన్న సాయంత్రం వరకూ కూడా ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఆ తర్వాత అది తప్పని చూపించే కొన్ని ఆధారాలను చూసి నా అభిప్రాయం మార్చుకున్నాను.

తాబేలుకి డిప్ప ఎలా వచ్చిందో నాన్న చెప్పిన సమాధానం మనసులో ఇంకా ఇంకిపోని ఆ రోజుల్లో ఆదివారాలు మా బాధ భరించలేక మా పిన్ని వెంట సండే స్కూల్ కి పంపితే అక్కడ పాస్టరుగారు మరో కధ చెప్పారు. ఈ రెండింటిలో ఏది నమ్మాలో తెలియక సతమతమైపోతున్న రోజుల్లో నేనున్నానంటూ బళ్ళో సైన్స్ మేష్టారు మరో కధ చెప్పారు. ఈ కధ మొదటి రెండింటికీ పూర్తి వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడున్న జీవులకి అప్పుడెప్పుడో ఒక ఉమ్మడి పూర్వ జీవులు ఉండేవారని, కాలక్రమేణా పరిణామం చెంది పరిస్థితులకు నిలబడ్డ ప్రాణులు మనుగడలో ఉంటాయని దాని సారాంశం. వీటిలో ఏది నిజమో అప్పటికి తెలియదుకాని ఈ మూడోది వినడానికి కొంచెం నమ్మేలా ఉంది. దీనికి మద్దతుగా హోమోసెపియాన్ పరిణామక్రమాలు, సోషల్ సబ్జెక్టులో రాతియుగం కాంస్యయుగం కాలక్రమాలు కూడా చెప్పేవారు. పైగా ఇది నేర్చుకుంటే పరీక్షలలో మార్కులు కూడా వచ్చేవి. అందుకే జీవపరిణామ సిద్ధాంతం నమ్మేవాడిని.

పదోతరగతి తర్వాత నూటికి తొంబై మంది పిల్లలాగానే ఎం.పీ.సి లో పడడంవల్ల జీవపరిణామం గురించి ఆలోచించాల్సిన అవసరం లేకపోయినా ఆ పాఠం మర్చిపోలేదు. "మనం ఇలా వచ్చామంట నాన్నా" అంటూ వితండవాదం చేస్తుండేవాడిని. ఆ తర్వాత్తర్వాత పనిచేసేచోట విభిన్న సంస్కృతుల గురించి మాట్లాడుకుంటూ మనిషి కోతికి పుట్టలేదు అని వాదిస్తున్న ఇరాన్ దేశీయుడైన సహోద్యోగితో ఏకీభవించి "నిజమే! కోతి నుండి కాదు కానీ కోతికీ, మనిషికి ఉన్న ఉమ్మడి పూర్వీకుల నుండి!" అని పనికిరాని ప్రేలాపన చేసేవాడిని.

ఇలా నా ఊహల్లో నేను బతుకుతున్న సమయంలో తెలుగు కోరాలో ఒక సమాధానం చదివాను. ఆ సమాధానంలో మనిషి 30 కోట్ల సంవత్సరాలకంటే ముందే భూమి మీద తిరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. 10 కోట్ల సంవత్సరాలకు మునుపే మనుషులకు నాగరికత ఉందని నిరూపించారు. నాకు పాఠ్యాంశంగా బోధింపబడి ఇన్నాళ్లు నేను నిజమని నమ్మిన పరిణామసిద్ధాంతం అబద్దమని ఒప్పుకోవడానికి నా అహం అడ్డొచ్చింది. నిజాన్ని మనసుకు తీసుకోలేక చాలాసేపు వాదించాను. పరిణామసిద్ధాంతానికి మద్దతుగా ఒకరిద్దరి సమాధానాలు చూసి ఆనందపడిపోయాను. కానీ ఆ పాదముద్ర, చెంబు సమాధానానికి వచ్చిన మద్దతు చూసి నాలో రెండో ఆలోచన మొదలయ్యింది. ఒకవేళ మా బడిలో చెప్పినది, ప్రస్తుతం డాక్టర్లకు చెప్పినది అబద్దం అయ్యే అవకాశం ఉందేమోనని అనిపించింది. ఇలా ఆత్మ పరిశీలన చేసుకుని ఆ ఆధారాలకోసం మరోసారి ఇంటర్నెట్లో వెదికితే నన్ను ఆశ్చర్యపరిచే మరిన్ని ఆధారాలు దొరికాయి. ఆ సమాధానంలో చెప్పినట్లే మనిషి ఐదు లక్షలక్రితం నుండి పరిణామం చెందలేదు, డైనోసర్లతో కలిసి జీవించాడు అని నమ్మడం మొదలుపెట్టాను. ఉదాహరణకు నేను కనుగొన్న ఆధారాలతో కొన్ని ఇవిగో..

ఈ శిలాజాన్ని 1891లో దక్షిణ జర్మనీలోని బున్దేబాష్ అనే ప్రాంతంలో కనుగొన్నారు. మొదట్లో ఇది ఆకతాయిలు చేసిన అల్లరి పనేనని భావించినప్పటికీ నూతన పరిశోధనల్లో మానవచరిత్రలోనే ఇదొక అద్భుతమని తేల్చిచెప్పారు. శిలాజంపై హెలికల్ అల్ట్రాసౌండ్ పరీక్షలు చేసి అదొక మగ ష్వార్జ్నెగ్రోసారస్ అని, నిద్రపోతున్న యువకుడిని తలకిందులుగా మింగేసుండొచ్చని తెలిసింది. అంతేకాక ఆ శిలాజం వయసు 419.99 మిలియన్ సంవత్సరాల, 359 రోజులుగా లెక్కకట్టారు. మరికొన్ని రోజుల్లో ఔత్సాహికులు 420 మిలియన్ సంవత్సరాల పుట్టినరోజు వేడుకలు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. శిలాజంలో కేవలం నైలాన్ గుడ్డతో చేసిన వీపుసంచి, చెక్కతో చేసిన స్కెటింగ్బోర్డు బట్టి అప్పటికి మనిషి ఇంకా లోహాన్ని వాడకంలోకి తెచ్చిఉండకపోవచ్చని ఒక అంచనా.

అలాగే 1964 తవ్వకాల్లో దొరికిన 12 కోట్ల 32 రోజుల వయసుగల మరొక శిలాజం ద్వారా మానవులు అప్పటికే చిన్న డైనోసార్లను ఆహారంగా తీసుకునే అలవాటుందని అర్ధమవుతుంది. ముఖ్యంగా ఈ శిలాజం పాత్ర అప్పటిఆహారంలో డైనోసార్ల పాత్రను విశేషముగా వివరించింది.

బహుశా ఈ కారణంగానే ఆ సమాధానంలోని ఆధారాలకు అంత మద్దతు వచ్చిందని గ్రహించి నా అభిప్రాయాన్ని మార్చుకుంటున్నాను. ఇప్పటినుండి కేవలం మార్కుల కోసం మాత్రమే చదవాలని నిర్ణయించుకుంటూ మరోసారి జీవపరిణామ సిద్దాంతం తప్పని ఒప్పుకుంటున్నాను. ఇటువంటి ఆధారాలు మరిన్ని కోరాలో చూడాలని కోరుకుంటూ...

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?