స్వీడన్ లో ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు? ఆ దేశంలో నివసించడం, అక్కడ ఎటువంటి జాబ్ లకి డిమాండ్ ఉంది? దాని PR కి ఎలా అప్లై చేసుకోవచ్చు? భాష నేర్చుకోవడం సులువా? చదువు కోసం వెళితే మంచిదా లేదా పీ ర్ తీసుకొని వెళితే మంచిదా? కొంచెం వివరాలు చెప్పండి.
నేను గత ఐదేళ్లుగా స్వీడన్లో ఉంటున్నాను. ఈ ఐదేళ్ళలో కొన్ని సార్లు తిరిగి ఇండియా వచ్చేద్దామనుకున్న సందర్భాలు ఉన్నాయిగాని ప్రస్తుతానికి అన్నీ అనుకూలంగా ఉండడంతో ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాము. నా అనుభవంలో స్వీడన్లో ఉండడానికి అనుకూలంగా ఉండే అంశాలు. జీతం: ఐదేళ్లక్రితం ఇండియాలో నాకొచ్చిన జీతంకంటే ఇక్కడ ఎక్కువ జీతం వచ్చింది. కానీ ఉద్యోగ అనుభవం పెరిగేకొద్దీ జీతాలమధ్య ఆ తేడా తగ్గిపోతుంది. కారణం ప్రతికూలతల్లో చెప్తాను. పని : నేను ఇండియాలో పని చేసేటప్పుడు పనిగంటల విషయంలో పద్దతి అంటూ ఏం ఉండేది కాదు. సగటున పదిగంటలు ఆఫీసులోనే ఉండాల్సి వచ్చేది. ఈ అధిక పనిగంటలన్నీ అనధికారంగా మాత్రమే. మేనేజర్లు ఒప్పుకొన్న గడువులని అందుకోవడానికి అలా చెయ్యాల్సొచ్చేది. స్వీడన్లో గత నాలుగేళ్లలో నేనెప్పుడూ లెక్కలోకి రాని పనిగంటల్లో పనిచేయలేదు. నా పనిగంటలకంటే ఎక్కువగా చేసిన పనికి రెండు నుండి మూడు రెట్లు అధిక జీతం వస్తుంది. ప్రభుత్వ పనితీరు : స్వీడన్ పౌరులకున్న దాదాపు ప్రతి సౌకర్యం వలసదారులకి కూడా ఉంటుంది. ఉచిత(దాదాపుగా) వైద్యం, ఉచిత విద్య(ఉద్యోగి పిల్లలకు, ఉద్యోగి, ఉద్యోగి భాగస్వామికి కూడా) , పని భీమా, భాగస్వామ...