Posts

Showing posts from March, 2022

లాటరీ ద్వారా బాగా డబ్బు సంపాదించినవారు ఎవరైనా మీకు తెలుసా? వాళ్ళ జీవితాలు ఏమయ్యాయి?

  చెప్పుకోదగ్గ మొత్తంలో లాటరీ తగిలినవారు నాకు వ్యక్తిగతంగా ఇద్దరు తెలుసు. ఒకరితో కేవలం ముఖపరిచయం మాత్రమే ఉంది. మరొకరు నాకు బాగా దగ్గరి చుట్టం, స్నేహితుడు కూడాను. ఆ ఇద్దరికీ లాటరీ టిక్కెట్లు కొనే అలవాటు లేదు కానీ ఇద్దరికీ ఒకే విధంగా లాటరీ తగిలింది. ఇరవై ఏళ్ళక్రితం వారు దుబాయిలో పనిచేసేటప్పుడు ఒక సూపర్ మార్కెట్లో షాపింగ్ చేసినప్పుడు ఆ సూపర్ మార్కెట్ కొనుగోలుదారులందరికీ బంపర్ లాటరీ ప్రకటించింది. ఆ లాటరీలో వీరిద్దరికీ కూడా అదృష్టం వరించి ఒకరికి కారు తగిలితే మరొకరికి మోటార్ సైకిలు తగిలింది. ఇద్దరూ కూడా తమకు తగిలిన వాహనాలకు బదులు డబ్బులు తీసుకున్నారు. మొదటి వ్యక్తి వెంటనే తన పని మానేసి తిరిగి మనదేశానికి వచ్చేసి ఆ డబ్బుతో వ్యాపారాన్ని మొదలుపెట్టాలనుకున్నాడు. అప్పట్లో పశ్చిమ గోదావరి జిల్లాల్లో పంటపొలాలు రొయ్యల చెరువులు, చేపల చెరువులుగా మారుతున్న రోజులవి. దానితో హెవీ మెషినరీ అద్దెకు ఇచ్చే వ్యాపారం మొదలుపెట్టి దినదినాభివృద్ధి చెందాడు. ప్రస్తుతం తణుకులో ఆర్ధికంగా మంచి స్థితిలో ఉన్నాడు. రెండో వ్యక్తికి అప్పుడే కూతురు పుట్టింది. తన కూతురే తన అదృష్టానికి కారణమని భావించి మోటారు సైకిలు డబ్బులు తన ...

రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో భారతదేశం ఇప్పటివరకూ రష్యా పక్షం వహించినట్టే కనిపిస్తోంది. కనీసం రష్యాకు వ్యతిరేకత అయితే చూపట్లేదు. మరి భారతీయులుగా మీ భావనలు ఎటువైపు ఉన్నాయి?

  "అమెరికాకు శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. కేవలం స్వప్రయోజనాలే ఉంటాయి. " -హెన్రీ కిస్సింజర్ శాంతి స్థాపన కోసం ఏం చేసాడో తెలియకుండానే నోబెల్ శాంతి బహుమతి తీసుకున్న కిస్సింజర్ చెప్పిన ఈ అక్షర సత్యానికి మాత్రం ఎదో ఒక అవార్డు ఇచ్చేయొచ్చు. నిజానికి ఈ మాటలు కేవలం అమెరికాకు మాత్రమే కాదు, ప్రపంచంలోని ప్రతీ దేశానికి వర్తిస్తాయి. నాటోను విస్తరించే క్రమంలో ఉక్రెయిన్ ను సభ్యదేశంగా చెయ్యాలని అమెరికా, దాని మిత్రదేశాలు చేసిన ప్రయత్నాలు ఉక్రెయిన్ ప్రజల జీవితాలను ఉద్దరించడానికి కాదన్న సంగతి వారికీ తెలుసు. అలాగే ఉక్రెయిన్ లోని రష్యన్ ప్రజలకోసం సైనిక చర్యకు పాల్పడుతున్నామని చెబుతున్న పుతిన్ మాటల్లో అది ఎత్నిక్ రష్యన్ ప్రజల మీద అభిమానమో లేక స్వప్రయోజనాలో అర్ధంకానంత రహస్యం కూడా ఏమి లేదు. మొహమాటం లేకుండా మాట్లాడాలంటే ఈ పరిస్థితులలో మన దేశం తటస్థ వైఖరి తీసుకున్నా, లేక భవిష్యత్తులో ఎదో ఒక పక్షం వహించినా ఆ నిర్ణయానికి కారణం కూడా అంతర్జాతీయంగా మన దేశం, దేశ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని అసలు ఏ పక్షం తీసుకోకూడదనే వారితో నేను ఏకీభవిస్తున్నాను.

తాబేలు మాంసం తినవచ్చా?

  వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కొన్ని రకాల తాబేళ్ల మాంసాన్ని తినడం మాత్రమే కాదు, వాటిని వేటాడినా, అవి గుడ్లు పెట్టడానికి కేటాయించిన అభయారణ్యాలను నాశనం చేసినా కూడా నేరమే.  [1] అయితే కోస్తా ప్రాంతాలలోని కొన్ని వర్గాలలో తాబేటి మాంసం ఆహారంగా తీసుకోవడం సాధారణమైన విషయం. ముఖ్యంగా మంచినీటిలో ఉండే డిప్ప తాబేళ్లు, మెట్ట తాబేళ్లను వీరు ఆహారంగా తీసుకుంటారు. ఒకప్పుడు పిల్లలు పుట్టని ఆడవారికి సంతానం కలగడానికి తాబేలు చేదుకట్టును పచ్చిగా బలవంతంగా తినిపించేవారు. ఈ మూఢ నమ్మకానికి ప్రత్యక్ష ఉదాహరణ మా అమ్మగారే. ఈ నాటు వైద్యాలన్నీ వికటించి చివరికి ఆరోగ్యం చెడిన తర్వాత డాక్టర్లను సంప్రదించి సరైన వైద్యం తీసుకుని కోలుకున్నారు. అవకాశం దొరికింది కాబట్టి నా సూక్తిముక్తావళి: ఇటువంటి మూఢనమ్మకాలకు మన సమాజంలో ఎప్పటికీ స్థానం ఉంటుంది. పిల్లలు పుట్టడంలేదని బొడ్డుతాడుని తినిపించి ఒకమ్మాయి చావుకు దారితీసిన అమానవీయ ఘటన జరిగింది 2021లోనే. 

మీకన్నా బాగా పెద్ద వయసువారితో మీకు స్నేహం ఉందా? వారి నుంచి మీరేం నేర్చుకున్నారు? వారితో మీ అనుబంధం ఏమిటి?

  మా తాతగారితో నాకు లేని చనువు ఆయన స్నేహితులు గోవిందరావుగారు, కృష్ణంరాజుగార్ల దగ్గర ఉండేది. ముఖ్యంగా గోవిందరావుగారు మా తాతగారి ఊళ్లోని టీనేజ్ పిల్లలందరికీ స్నేహితులే. అప్పట్లో ఊరి మొత్తానికి కేవలం రెండు చోట్లకి మాత్రమే వార్తాపత్రిక వచ్చేది. ఒకటి రామాలయం దగ్గర, మరొకటి గోవిందరావుగారింటికి. కానీ రామాలయం దగ్గర రాజకీయచర్చలు చెయ్యడానికి గోవిందరావుగారు కూడా అక్కడే పేపర్ చదివేవారు. నేను సెలవులకి వెళ్ళినప్పుడు నన్నొక్కడినే వదిలేసి మా అన్నయ్య, బావ, మా తమ్ముడు షికార్లకి వెళ్లిపోయేవాళ్లు. పొద్దునే ఏం తోచక మా తాతగారితో నేను కూడా పేపర్ చదవడానికి వెళ్ళేవాడిని. ఆవిధంగా వాళ్లిద్దరూ నాకు పరిచయమయ్యారు. కథల పుస్తకాలు చదవమని నన్ను ప్రోత్సహించిన గోవిందరావుగారు ఆ సంవత్సరమంతా వాళ్ళింటికి వచ్చే చందమామ, బాల రామాయణం పుస్తకాలన్నీ జాగ్రత్తపరిచి ఆ నెలరోజులూ నాకప్పగించేవారు. పార్టీలపరంగా ఆ ముగ్గురు స్నేహితులకి అభిప్రాయబేధాలున్నా, అప్పుడప్పుడూ ఒకరిమీద ఒకరు కోప్పడినా ఆ చిరాకు నా మీద ఎప్పుడూ చూపించేవాళ్ళు కాదు. మాంచి నాటుభాషలో కృష్ణంరాజుగారు చెప్పే కబుర్లే నాకు ప్రపంచాన్ని పరిచయం చేసాయి. వాళ్ళ చిన్నతనంలో చేసిన పనుల...

మహిళలు సమానం కాదు, ప్రత్యేకం. వారి స్థాయి సమానత్వం కన్నా ఎక్కువ అని ఒక వాదన వినిపిస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?

  ఈ వాదన వల్ల మహిళలకు మేలు జరగకపోగా ప్రస్తుతం సమాజంలో మహిళలకు సమాన స్థాయి కోసం పోరాడేవారి ఆశయాలకు కీడు జరిగే అవకాశమే ఎక్కువ ఉంది. ఈ వాదన పురుషుల నుండి వస్తున్నట్లయితే వారు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యతను పూర్తిగా ఆడవారిమీద మోపబోతున్నారని అర్ధం. ఆడవారు పువ్వులవంటివారు, అపురూపమైన వజ్రాలవంటివారు అని పోల్చి, వాళ్ళు వేసుకోవాల్సిన దుస్తులు ఆభరణాల నుండి ఇంట్లోనూ, ఇంటిబయటా వారి నడవడిక వరకూ అన్నింటి మీదా పురుషులకు వర్తించని ఆంక్షలు పెట్టబోయే వారే ఇటువంటి మాటలు మాట్లాడుతారు. ఇదే వాదన మహిళల నుండి వస్తే వారికి సమాజంలో ఆడవారు ఎదుర్కొనే వివక్ష గురించి అవగాహన లేదని నా అభిప్రాయం. ఆ అవగాహనే ఉంటే వారు సమానత్వం కావాలని కోరుకుంటారు తప్ప తామొక ప్రత్యేకమైనవారమని భావించరు. ఒకవేళ ఈ ఆడవారు కూడా ముందు మాట్లాడుకున్న కొంతమంది మగవారి అభిప్రాయంలాగా సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత కేవలం ఆడవారిమీదే ఉంటుంది కాబట్టి వారు ప్రత్యేకమని భావిస్తుంటే వారికి స్టాక్ హోమ్ సిండ్రోమ్ ఉందని అనుకోవచ్చు. ఇక సంతానోత్పత్తిలో ఆడవారు కష్టమైన బాధ్యత తీసుకుంటారు కాబట్టి వారు ప్రత్యేకం అనే వాదనను ఖండించలేను, ఏకీభవించలేను. ల...

తెలుగు సినిమాల్లో ప్రసిద్ధమైన షూటింగ్ లొకేషన్స్ మీకు తెలిసినవి పంచుకోగలరా? ఏ సినిమాల్లో చూడవచ్చు (ఉదా : రామచంద్రాపురం కోట, సాంఘి టెంపుల్)

Image
  రాజమండ్రి పుష్కరాల రేవు, ఆర్చ్ వంతెన, పాత వంతెన. వంశీగారు, ఈవీవీగారు దర్శకత్వం వహించిన సినిమాల్లో, రాజేంద్రప్రసాద్ గారు హీరోగా నటించిన చిత్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. మచ్చుకు కొన్ని, గోదావరి: సరదాగా కాసేపు: బెండు అప్పారావు R.M.P : శశిరేఖా పరిణయం:

రాసిన కోడ్ డీబగ్ చేయడం ఎందుకు అంత విసుగెత్తిస్తుంది?

  ఎవరు రాసిన కోడ్ వాళ్లే డీబగ్ చెయ్యడం మరీ అంతగా విసుగనిపించదు. పరిస్థితి బట్టి ఒక్కొక్కసారి ఆసక్తికరంగా ఉంటుంది. కానీ వేరెవరో రాసిన కోడ్ ని డీబగ్ చెయ్యాల్సి వచ్చినప్పుడు, పైగా వాళ్ళ కోడింగ్ శైలి మన కోడింగ్ శైలికి భిన్నంగా ఉన్నప్పుడు, అదే సమయంలో మన రిపోర్టింగ్ మేనేజర్ మన నెత్తి మీద డాన్స్ కట్టినప్పుడు మాత్రం ఆ అవస్థ పగవాడికి కూడా రాకూడదనిపిస్తుంది. నాకు తెలిసి ప్రతీ ప్రాజెక్ట్ లోనూ కోడింగ్ శైలికి సంబంధించి కొన్ని రకాల ప్రమాణాలు, నియమాలు ఉంటాయి. ఒక వేరియబుల్ కి పేరు పెట్టడం దగ్గర్నుండి, లాగింగ్, వ్యాఖ్యలు రాయడం లాంటి వాటివరకూ ప్రాజెక్ట్ లోని వారందరూ ఒకే నియమాలు పాటించాల్సి వస్తుంది. ఆ నియమాలను గుర్తుచేసే IDE ఎక్సటెన్షన్లు, మాన్యూవల్ కోడ్ రివ్యూలు ఉంటాయి. ఇన్ని ఉన్నప్పటికీ ఎదో ఒక సందర్భంలో ఎవరికీ అర్ధం కాకుండా రాయబడే కోడ్ ప్రోడక్ట్ లోకి వెళ్ళిపోతుంది. నూటికి తొంబై శాతం కోడింగ్ ఎర్రర్స్ ఈ ప్రదేశాల్లోనే ఉంటాయి. వాటిని డీబగ్ చెయ్యడానికి ముందు ఆ కోడ్ ని అర్ధం చేసుకోవడానికే పుణ్యకాలం గడిచిపోతుంది. ప్రాజెక్ట్ పరిమాణం కూడా డీబగ్గింగ్ ని బ్రహ్మ రాక్షసిలా మార్చే అవకాశం ఉంది. నేను ఇంతకు ముందు ...

ఠాగూర్ లో చిరంజీవి గారిలా, తెలుగు భాషలో మీకు నచ్చని పదం?

  " అయినా/అయినప్పటికీ " ఈ పదం ఉపయోగించారంటే నూటికి తొంభైసార్లు లోపం ఎత్తిచూపించి దానికి ఓదార్పు మాట జత చేస్తారన్నమాట. నువ్వు రంగు తక్కువైనప్పటికీ మొహం కళగా ఉంటుంది. ఆడపిల్లైనప్పటికీ సిటీలో ఒక్కత్తే ఉంటూ జాబు చేసేసుకుంటుంది. వాళ్ళావిడ లేకపోయినా పిల్లల్ని బానే పెంచేసాడు. అలవాటులో అనుకోకుండా ఇలా అనేవారు కొంతమందైతే, కావాలనే దెప్పిపొడవడానికి అనేవారు మరికొంతమంది. నేను అప్పుడప్పుడూ అనాలోచితంగా అనేస్తుంటాను. కానీ తర్వాత గుర్తొచ్చిన తర్వాత బాధపడుతుంటాను. "నీసు" అసలు తినే తిండికి నీసు/నీచు పదప్రయోగం నాకు ఇబ్బందిగా అనిపించింది. ఒకప్పుడు ఈ పదం అర్ధం తెలియనప్పుడు నేను కూడా మాంసాహారాన్ని "నీసు" అనే అనేవాడిని. కానీ ఆ తర్వాత అర్ధం తెలిసాక వాడడం మానేసాను.

ఎడమచేతి వాటాన్ని నిరసించే చులకన చేసే సంస్కృతిలో మీరు లేదా మీకు తెలిసిన వారు పెరిగితే మీ అనుభవాలు చెప్పగలరా?

  ఎడమ చేతివాటం వలన దైనందిక జీవితంలో, సామాజిక కార్యకలాపాలలో నేను పడిన ఇబ్బందులను గురించి నేను ఈ క్రింది సమాధానంలో వివరించాను. ఎడమచేతి వాటం ఉన్న వ్యక్తులు ఎదుర్కొనే సమస్యలు ఏమిటి?కు రాజా ద్వారంపూడి (Raja Dwarampudi)యొక్క సమాధానం ఒక మనిషికి కేవలం ఎడమ చేతివాటం ఉండడంచేతే ఆ వ్యక్తి ప్రతిభను తక్కువచేసి చులకనగా మాట్లాడేవాళ్ళను కొంతమందిని చూసాను. మా క్లాసులో నాతో కలిపి ముగ్గురు ఎడమ చేతివాటం వారు ఉన్నారు. అందులో నా స్నేహితుడు కిరణ్ కూడా ఒకడు. తను చాలా అద్భుతంగా క్రికెట్ ఆడతాడు. బాడ్మింటన్లో కూడా మంచి ప్రతిభ కనబరిచేవాడు. కానీ వాడు బాగా ఆడతాడు అనే మాట కంటే ఎడమ చేతివాటం వల్ల వాడికి అడ్వాంటేజ్ అవుతుంది అనే మాట ఎక్కువ వినబడేది. ఇక్కడ పోటిలేదుగాని అంతర్-పాఠశాల పోటీలలో దొరికేస్తాడు అనేవారు. కానీ అక్కడ కూడా పోటీలో ఉన్న వేరే ఎడమచేతివాటం ఉన్నవాళ్ళని ఓడించి పతకాలు తీసుకొచ్చాడు. వాళ్ళ మాటే నిజమైతే నేను కూడా కనీసం రెండో స్థానంలో ఉండాలి. కానీ ఈ విషయం ఎవరు మాట్లాడరు. ఇక చదువు విషయానికొస్తే నాకు లెక్కల్లో ఎప్పుడు మంచి మార్కులొచ్చినా అది నా చేతివాటం(దొంగతనం కాదులేండి) వల్ల మాత్రమే వచ్చిందనే వాదించే మనిషొకడుం...

ఇలాంటివి నాకు మాత్రమే ఎందుకు జరుగుతాయి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా ?

Image
  అదేంటో!!! భోజనాల్లో కూర్చున్నప్పుడు సరిగ్గా నాదగ్గరికి వచ్చినప్పుడే డేగిశాలో అన్నం అయిపోతుంది. అరటిపండు పెరుగన్నంలోకీ, పూర్ణంబూరె భోజనం తర్వాత మా తమ్ముణ్ణి ఊరిస్తూ తినాలి కాబట్టి చేసేదేంలేక అన్నం వచ్చేదాకా ఉప్పు రుచిచూస్తూ ఉండడమే. ఒక రెండు మూడు యుగాల తర్వాత అన్నం తెచ్చి వడ్డించాక, వెనక బకెట్ నిండా సాంబారుతో చిన్నాన్న వస్తుంటే "పోన్లే! సాంబారు కోసం ఎదురుచూపులక్కర్లేదు" మురిసిపోయేలోపు ముందు వరసలో ఒక పెద్దమనిషి మొదటి రౌండు పూర్తి చేసి "బాబు సాంబార్ ఇలా పట్రామ్మా" అని పిలుస్తాడు. మళ్ళీ సాంబార్ వచ్చేవరకు అన్నంతో డ్యాములు కడుతుంటాను. ఇక కిరాణా కొట్లో ఉన్నట్లుండి పక్క వరుస చాల వేగంగా వెళ్ళిపోతుంది. ఆఫీసుకి వెళ్ళేటపుడు సరిగ్గా నేను రోడ్డు దాటేటప్పుడే ఎర్రలైట్ పడుతుంది. ఒకపక్క ఆఫీసుకి టైం ఐపోతుంటే మా అమ్మాయికి పాపిడి కుడివైపుకు దువ్వాలో ఎడమవైపుకు దువ్వాలో గుర్తొచ్చి చావదు. సాయంత్రం ఇంటికి వెళ్ళడానికి తయారవుతూ నా లాప్టాప్ షట్ డౌన్ చేసిన తర్వాత టైంషీట్ రాయాలన్న సంగతి గుర్తొస్తుంది. ఇటువంటి అనుభవాలు నాకేకాదు తరచుగా చాలామందికి కలుగుతూ ఉంటాయి. కొంతమంది కొన్నివిషయాల్లో తమకెప్పుడ...

జీవితంలో నిజంగా జాతక ప్రభావం ఉంటుందా? అసలు జాతకం మీద మీకున్న అభిప్రాయాలు ఏమిటి?

  జాతకంతో జీవితాల్ని మార్చుకున్న కుటుంబాన్ని నా కళ్లారా చూసాను. కాబట్టి మన జీవితంపై జాతక ప్రభావం ఎదుటి వారికి జాతకంమీద ఉన్న నమ్మకం మీద ఆధారపడి ఉంటుందని అర్ధం అయ్యింది. మా చుట్టాలలో ఒకాయన కొన్ని చిల్లర చేష్టలు చేసి చుట్టాలలో గౌరవం కోల్పోయారు. సొంత వాళ్ళు సరిపెట్టుకున్నా చుట్టాలు దూరం పెట్టడం మొదలుపెట్టారు. ఇంట్లో పిల్లలు పెళ్లీడుకి వచేస్తుండడంతో ఆయనకి ఇమేజ్ మేకోవర్ అవసరం అయ్యింది. దానికి వాళ్లు జాతకం మీద ఉన్న నమ్మకాన్ని వాడుకోవడం మొదలుపెట్టారు. "మా ఆయనకి జాతకంలో ఉన్న దోషం వల్లే ఇలా జరుగుతున్నాయి. 2015 వరకు మాకు ఇటువంటి అపనిందలు తప్పవంట!" అని ఒక వంక ప్రచారంలోకి తెచ్చారు. ఇది ఎంత బాగా పని చేసిందంటే ఆయన ఏంచేసినా జతకమే కారణమని అందరూ నమ్మే అంత. 2015 అయిపోయింది ఆయన చిల్లర చేష్టలు వికృత చేష్టలుగా వృద్ధి చెంది వూళ్ళో ఒకసారి దేహశుద్ధి కూడా జరిగిపోయింది. చేసేదేంలేక ప్రాజెక్ట్ డెడ్లైన్ ముందుకు జరిపినట్లు ఇప్పుడు 2022 అంటున్నారు. విచిత్రం ఏంటంటే ఇది నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక పెళ్లి సంబంధాల విషయంలో జాతకాల ఉపయోగం అంత ఇంత కాదు. వచ్చిన సంబంధం నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో హుందాగా చెప్పలేక అల...

ఎడమచేతి వాటం ఉన్న వ్యక్తులు ఎదుర్కొనే సమస్యలు ఏమిటి?

Image
  ఇప్పటికే మిగిలిన సమాధానాలు చాలా కూలంకషంగా ఎడమచేతివాటంవారు ఎదుర్కునే సమస్యలను వివరించారు. నాది కూడా అదే క(వ్య)ధ. కత్తెర్లు, పెన్సిల్ మరలు, వాచీలు వంటివి రోజువారీ వాడకంవల్లో, లేక ఎడమచేతిని వంకరగా తిప్పి వాడడం అలవాటు చేసేస్కోవడంవల్లో వాటి ఇబ్బందిని పెద్దగా గమనించలేదు. ఎక్కువగా ఇబ్బంది పెట్టినవి, బాధ పెట్టినవి మాత్రం ఎడమచెయ్యంటే సమాజంలో ఉన్న చిన్న చూపు. పూజా కార్యక్రమాల్లో వస్తువులు ఎడమచేత్తో అందించినా, దీపం కోసం ఎడమచేత్తో అగ్గిపుల్ల వెలిగించినా ఇంట్లో తిట్లు పడిపోయేవి. చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు టేబుల్ మీద పెట్టిన స్వీటూ హాటు ప్లేటు చేత్తో తీసుకోగానే చెంచా కుడిచేత్తో పట్టుకోమని కంటి చూపుతో ఆర్డర్లు పడిపోయేవి. నేను ఏడవ తరగతి పరీక్షలకి వెళ్తున్నప్పుడు వినాయకుడి గుడిలో కొబ్బరికాయ కొట్టి వెళ్ళమని ఇంటి నుండి రామాజ్ఞ. సమయం లేక గుడి మెట్ల దగ్గరే దణ్ణం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టడానికి చెయ్యత్తబోతే చెయ్యి దింపేలోపే నా డిప్ప మీద వేరొక చెయ్యి బలంగా పడింది. ఏం జరిగిందో తెలిసేలోపే నా పక్కన ఉన్న స్నేహితుల క్లోసప్ యాడ్లు మొదలైపోయాయి. వెనక్కి తిరిగిచూస్తే పంతులుగారు "కుడి చేత్తో కొట్టి చావు...

తెలుగు ప్రముఖుల్లో ఎవరి జీవితాలను బయోపిక్స్‌గా తీస్తే బావుంటుంది? ఎందుకు?

Image
  అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జీవితాన్నీ సినిమాగా తీస్తే బాగుంటుందని నా అభిప్రాయం. పొట్టి శ్రీరాములు 1901 సంవత్సరం మద్రాసులో జన్మించారు. వీరి స్వగ్రామం ప్రస్తుత నెల్లూరు జిల్లా, పడమటిపాలెం. మద్రాసులో ప్రాథమిక విద్యాబ్యాసం, బొంబాయిలో శానిటేషన్ ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసారు. ఆయన వివాహ జీవితం మొదట్లోనే భార్యాబిడ్డల అకాలమరణంతో విషాదాంతం అయ్యింది. ఆ తర్వాత చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి గాంధీజీ పిలుపందుకుని స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు ఒకసారి, 1941-42 మధ్య క్విట్ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు మరో మూడు సార్లు ఖైదు చేయబడ్డారు. స్వాతంత్య్రం తర్వాత ఆయన దృష్టి అణిచివేయబడుతున్న వర్గాలమీద పడింది. నిమ్న వర్గాలకు ఆలయ ప్రవేశం జరగాలని నిరాహార దీక్ష చేసి విజయం సాధించారు. అప్పటికే భాషాప్రాతిపదికన రాష్ట్ర ఏర్పాటుకు మాట ఇచ్చి నిలుపుకోకపోవడంచేత రాష్ట్ర సాధనకోసం నిరాహారదీక్ష మొదలుపెట్టారు. దీక్షకు ఆంధ్ర కాంగ్రెస్ నాయకులనుండి కనీస మద్దతు కూడా రాలేదు. ఆ పరిస్థితులలో బులుసు సాంబమూర్తిగారు తన మద్దతు తెలియచేస్తూ దీక్షాస్థలిగా తన ఇంటిని వాడుకోమని ఇచ్చ...

మాంసాహారులతో శాకాహారులుగా జీవించడం అంటే ఎలా ఉంటుంది? ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి? దాని విషయంలో శాంతి నెలకొల్పడానికి మీరు ఏమి చేస్తారు? ఇది మీ సంబంధాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

  ఐదేళ్ల వయసులో భయంతో శాకాహారిగా మారిన నేను తిరిగి మాంసాహారం అలవాటు చేసుకోవడానికి పదేళ్లు పట్టింది. ఈ పదేళ్లలో నేనూ, నావల్ల నా కుటుంబం పడిన బాధలు అన్నీఇన్నీ కావు. చిన్నప్పుడు నా పెద్దమ్మ నాకు చేపలకురతో గోరుముద్దలు తినిపిస్తుంటే నా గొంతులో చేపముల్లు ఇరుక్కుని నరకయాతన పడ్డాను. ఇంట్లోవాళ్ల ఉరుకులుపరుగులు, తిట్లు, సోకండాళ్ల మధ్య వంటింటి చిట్కాలన్నీ ప్రయోగించేసి చివరికి డాక్టరుగారిని తీసుకొచ్చి నాకు ముల్లువిముక్తి కలిగించి అప్పటికి హమ్మయ్య అనుకున్నారు కానీ అసలు సమస్య ఆ తర్వాత మొదలయ్యింది. ఆరోజు నుండి నాకు మాంసాహారం అంటే భయం మొదలయ్యింది. చేప, కోడి, చివరికి కోడిగుడ్డులో కూడా ముళ్ళుంటాయేమో అనుకుడేవాడిని. మా ఇంట్లో మిగిలిన ముగ్గురికి మాంసాహారం అంటే మహాఇష్టం. ఇంట్లో మాంసాహారం వండిన ప్రతిసారీ నా కోసం ఇంకొక కూర వండాల్సివచ్చేది. ఒకట్రెండు సార్లంటే పర్లేదుగాని ప్రతిసారి ఇలాగే అంటే కుదరదని మాంసాహారం తినమని నన్ను బుజ్జగించేవాళ్ళు, ఒక్కోసారి చిరాకు పడేవాళ్ళు కూడా. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక వండడానికి ముందు తింటానని చెప్పి భోజనానికి కూర్చున్న తర్వాత పచ్చడి ఇమ్మని అడిగేవాడిని. ఆ తర్వాత ఈ పాచిక ...

గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలుగువారిలో కొందరు ఏ సమస్యా లేకుండా పనిచేయగా, మరికొందరు నానా అగచాట్లు పడుతున్నారు. తేడా ఎక్కడ వస్తోంది? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

  35 ఏళ్ళ క్రితం నా మేనమామ నుండి ఇప్పుడు నా తమ్ముడి వరకు నాకు బాగా దగ్గరైన వాళ్ళు తొమ్మిది మంది గల్ఫ్ దేశాల్లో పని చేసారు. కొంత మందికి పని వాతావరణం సాఫీగా సాగగా మరికొంతమంది అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. ముందుగా సమస్య ఇక్కడ ఉన్న ఏజెంట్లతోనే మొదలవుతుంది. ఏజెంట్లపేరుతో పల్లెటూళ్లలో తిరిగేవాళ్ళలో ఎంతమందికి అప్రూవల్ ఉందొ తెలీదు. వాళ్ళ దగ్గర అవకాశం ఉన్నా లేకపోయినా ఉద్యోగం ఇప్పిస్తామని పాసుపోర్టు తీసుకుని, కమిషన్లో కొంత డబ్బు ముందు కట్టాలని బలవంతపెడతారు. గవర్నమెంట్ నియమాల ప్రకారం ఇరవైవేలకంటే ఎక్కువ రుసుము వసూలు చెయ్యకూడదు. కానీ వీళ్లు కనీసం లక్ష వసూలు చేసేవాళ్ళు. డబ్బులు కట్టించుకుని మొహం చాటెయ్యడం, వర్క్ వీసా బదులు టూరిస్ట్ వీసా ఇచ్చి మోసం చెయ్యడం, చేయాల్సిన పని విషయంలో అబద్దం చెప్పి పంపడం వంటి మోసాలను చూసాను. కాబట్టి కేవలం అప్రూవల్ ఉన్న ఏజెంట్ని మాత్రమే సంప్రదించాలి. వీసా వచ్చేవరకు ఒక్క రూపాయి కూడా కట్టకూడదు. కంపెనీ పేరు, ఉద్యోగుల విషయంలో దాని నిబద్దత వంటివి ఇంటర్నెట్లో గాని, గల్ఫ్ లో పనిచేస్తున్నవాళ్ళనిగాని అడిగి తెలుసుకోవాలి. జీతాలు ఖచ్చితంగా ఇస్తున్నాయా, నివాస సదుపాయం ఎలా ఉంది, పాస్పోర...

ఇది మోసం , అని తెలిసి కూడా ఎపుడైనా మోసపోయారా ?

  అంగన్వాడీ టీచర్ గారు బలవంతపెడితే తమ్ముడి జీతంలో నెలనెలా పొదుపు చెయ్యడానికి గవర్నమెంట్ పథకం ఒకటి తీసుకున్నానని మా అమ్మ ఫోన్లో చెప్పారు. పేరు, వివరాలు అడిగితే అవేమి నాకు చెప్పడం రాదు, నువ్వింటికొచ్చినప్పుడు చదువుకో అని చెప్పారు. కొన్ని నెలల తర్వాత ఇంటికివెళ్ళినపుడు డబ్బులు కట్టిన రసీదులు చూస్తే అగ్రిగోల్డ్ అని ఉంది. ఇది గవర్నమెంట్ కాదు, అంగన్వాడీ టీచర్ గారు అబద్దం చెప్పారు అని అర్ధం అయింది. మానేయమని చెప్తే కట్టిన డబ్బులు రావు, ఇంకెంత మూడేళ్లే కదా అని ప్రతినెలా ఆరు వందలు కట్టారు. దాదాపు మొత్తం కట్టేసిన తర్వాత చివర్లో కంపెనీ జెండా పీకేసాడు. ఇక ఆ డబ్బుల సంగతి మర్చిపోతే మనఃశాంతిగా ఉంటుందని చెప్పాను.

మీరు దేవుణ్ణి నమ్ముతారా? నమ్మరా? నమ్మితే ఎందుకు నమ్ముతారు? నమ్మకపోతే ఎందుకు నమ్మరు? మీరు నమ్మేవాళ్ళైతే నమ్మని వాళ్ళని దేవుడున్నాడు అని ఎలా ఒప్పిస్తారు? ఒక వేళ నమ్మని వాళ్ళైతే నమ్మే వాళ్ళ నమ్మకాలు తప్పు అని ఎలా ఒప్పించగలరు?

  నేను అజ్ఞేయవాదిని. నేను పాఠశాలలో చదివే రోజుల్లోనుండే నాకు దైవం, మతాలమీద అనాసక్తి కలిగింది. ముఖ్యంగా నా ఎడమచేతివాటం వల్ల దేవాలయాలు, పూజ కార్యక్రమాల్లో జరిగిన కొన్ని సంఘటనలు నన్ను అజ్ఞేయవాదిగా మార్చాయి. దైవం మీద నా ఉద్దేశాలను చెప్పినపుడు మా అమ్మగారు లెంపలేసుకున్నారు, మా నాన్నగారు నాకు లెంపలు వేశారు. అందుకే ఈ అంశం గురించి నేను ఎవరితోనూ చర్చించను. నా జీవితంలో జరిగిన ముఖ్యమైన కార్యక్రమాలన్నీ నా తల్లిదండ్రుల, వారి తల్లిదండ్రుల ఇష్టం మేరకు హైందవ సంప్రదాయంలోనే జరిగాయి. దానివలన నాకొచ్చిన నష్టంలేదు కనుక నేను అడ్డు చెప్పలేదు. నా భార్యకు దైవం మీద విశిష్టమైన నమ్మకం. కానీ మేము ఒకరి నమ్మకాలలో మరొకరు తల దూర్చము. తనకి నచ్చిన దేవాలయాలకు, పూజ కార్యక్రమాలకు నేనే స్వయంగా తీసుకెళ్తా. ఎందుకంటే అది నా బాధ్యత. మా అమ్మాయి అన్నప్రాసన, పుట్టినరోజు దైవప్రార్ధనలతోనే ప్రారంభం అయ్యాయి. తన నమ్మకాన్ని తన కూతురికి చెప్పే హక్కు నా భార్యకి ఉంది కనుక నాకు అభ్యంతరం లేదు. నా కుటుంబ సభ్యుల మతస్వేచ్ఛకే భంగం కలిగించని వాణ్ణి ఇక బయటి వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోను. కానీ మతం పేరుతో మూఢనమ్మకాలను ప్రచారం చేస...

డైనోసార్లు ఉండేవన్నది కాదనలేని సత్యం కదా, మరి హైందవ పురాణాలలో వీటి ప్రస్తావన ఎక్కడైనా ఉందా?

  డైనోసార్లు భూమి మీద జీవించిన కాలాన్ని సైన్స్ పరిభాషలో జురాసిక్ కాలం అంటారు. ఇది సుమారు 20 కోట్ల సంవత్సరాల క్రితంనుండి 15 కోట్ల సంవత్సరాల క్రితం వరకు, అంటే దాదాపు 5 కోట్ల సంవత్సరాల కాలం జరిగింది. ఇంత సుదీర్ఘ కాలంలో ఎన్నో రాక్షసబల్లి జాతులు పరిణామం చెంది, అంతరించాయి. 5 కోట్ల సంవత్సరాలక్రితం జరిగిన ఉల్కాపాతం కారణంగా పెద్దజాతులు అంతరించాయి, అప్పుడు మిగిలినవి ఇప్పటి పక్షి జాతులకు పూర్వికులు అని శిలాజ అవశేషాలని అధ్యయనం చేసే శాస్త్రవేత్తల అంచనా. ఇక మానవుని పరిణామక్రమంలో నేటి చింపాంజీలకి, మనకి పూర్వికులైన హోంమినిని వర్గపు చీలిక 80 లక్షల సంవత్సరాలక్రితం జరిగింది. అక్కడినుండి తెలివైన హోమోసెపియాన్స్ ఆవిర్భవించింది సుమారు ఒక లక్ష నుండి 80 వేల సంవత్సరాలక్రితం మాత్రమే. అంటే రాక్షసబల్లి, మనిషీ ఒకేసారి భూమిమీద జీవించడం అనేది అబద్దం అని తెలుస్తుంది. వివిధ మతాల పురాణాల్లో, ఆలయాల మీద ఉన్న రాక్షసబల్లులు అని చెప్పబడుతున్న ఆకారాలకి కారణాలు విశ్లేషించుకుంటే 3 సిద్ధాంతాలు ప్రతిపాదించొచ్చు. ఒకటి, మన పూర్వీకులకు డైనోసార్ల అవశేషాలు దొరికి ఉండాలి. కానీ టా ప్రోహ్మ్ మీద ఉన్నాయి అని చెప్పబడుతున్న స్టెగోసర్స్ అ...

దేశంలోని ఇతర ప్రాంతాల వారు కూడా అభిమానించే తెలుగు వంటకాలు ఏవి?

Image
  నేను చెన్నైలో పనిచేసినప్పుడు నా తమిళ సహోద్యులకు బాగా నచ్చిన తెలుగు స్వీటు పూతరేకులు. తూర్పు గోదావరి జిల్లాలోని ఆత్రేయపురం గ్రామం పూతరేకుల తయారీకి ప్రసిద్ధి చెందింది. కానీ ఈ మధ్యకాలంలో పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి సమీపంలోని మంచిలి తయారీ పూతరేకులకు కూడా మంచి పేరు వచ్చింది. ఒకసారి పండక్కి ఇంటికొచ్చి మా అన్నయ్యని చూద్దామని మంచిలి వెళితే చెన్నై తీసుకెళ్లమని వద్దంటున్నా వినకుండా ముప్పై పూతరేకులు నా బ్యాగ్లో పెట్టేసాడు. అన్ని పూతరేకులు నేనేం చేసుకుంటానని నా సహోద్యుగుల కోసం కొన్ని ఆఫీసుకి తీసుకువెళ్లా. నా టీంలో నాతోపాటు ఇంకొక తెలుగాయనా, ముగ్గురు తమిళులు ఉన్నారు. తెలుగయనకి పూతరేకులు తెలుసు గనుక ఎగబడి ఒక రెండు తీసుకున్నారు. మిగిలిన ముగ్గురికి దాన్ని ప్రయత్నించడానికి కూడా ధైర్యం చెయ్యలేదు. పైగా టిష్యూ పేపర్ లా ఉంది అని జోకులు కూడా వేసుకున్నారు. తర్వాతి రోజు కూడా ఆ డబ్బా అక్కడే అలాగే ఉంది. మా లీడర్ నాగరాజ్ గారు నేను నొచ్చుకుంటానేమోనని ఒకటి తీస్కుని ఎలా తినాలని అడిగి తెలుసుకుని ఒక ముక్క కొరికారు. "మనం అనుకున్నట్లైతే లేదు" అని మిగిలిన ఇద్దరికీ చెప్పారు. వాళ్ళు నా ముందు తినడానికి ఇబ్బంది ...

మీ పిల్లలకు పేర్లు ఎలా వెతికారు? ఆ ప్రక్రియలో మీకు ఎదురైన అనుభవాలెటువంటివి?

  5వ నెల స్కానింగుకి వెళ్ళినప్పుడు అమ్మాయో అబ్బాయో తెలుస్తుంది, ఆ తర్వాత ఆలోచించొచ్చు అనుకున్నాము. కానీ స్కానింగ్ పూర్తయిన తర్వాత బిడ్డ కాళ్ళు ముడుచుకుని ఉంది, ఎంత ప్రయత్నించినా తెలియట్లేదు అని చెప్పారు. అమ్మాయి కోసం మూడు పేర్లు, అబ్బాయి కోసం ఒక పేరు(మా నాన్నగారి పేరు కృష్ణ) ఆలోచించాము. ఆఫీసులో నా స్నేహితులతో మాట్లాడేటప్పుడు నా సహోద్యోగి అడిగితే రియా లేదా కృష్ణ అని అనుకుంటున్నాం అని చెప్పాను. రియా అనే పదానికి స్వీడిష్ భాషలో "సేల్" అని అర్ధం అని గుర్తు చేసాడు. విషయం నా భార్యకి చెబితే చాలా సంతోషంగా తనకి బాగా ఇష్టమైన లిస్టులో రెండవ స్థానంలో ఉన్న పేరుని మొదటికి తెచ్చింది. నన్ను ఎంతో ప్రభావితం చేసిన ఒక జీవ శాస్త్రవేత్త పేరు మధ్య పేరుగా పెట్టడానికి నా భార్య అనుమతినిచ్చింది. అనాదిగా వస్తున్న తోకపేరుని నా బిడ్డ విషయంలో దరిచేరనివ్వలేదు. ఆ విధంగా మా అమ్మాయికి సహన షార్లెట్ అని పేరు పెట్టాము.

ఆన్లైన్లో మీకు జరిగిన లేదా మీరు చూసిన ఫ్రాడ్స్/మోసాలు గురించి తెలపగలరు?

  2014 సంవత్సరం. సంక్రాంతికి ఇంటికి వెళ్ళడానికి నిర్ణయించుకుని సెలవు పెట్టి, ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నాను. రిలయన్స్ ట్రెండ్స్లో పండుగ బట్టలు కొనుక్కుని, చెప్పులు ధర నచ్చక ఆన్లైన్లో కొందామని రూంకి వచ్చేసాను. అమెజాన్లో పండగ సేల్ మొదలయిందని చూసి చెప్పుల జాతకోసం వెదికాను. నీలం రంగులో ఒక మంచి జత దొరికింది. రేటు 2500 రూపాయలు, కానీ 50 శాతం తగ్గింపు ధరతో 1250 కే ఇచ్చేస్తున్నాడు. చెప్పులు నచ్చాయి, ధర నచ్చకపోయినా తగ్గింపు ధర నచ్చేసింది. కొనేసి పండగ వరకు ఆగలేక ముందే వాడడం మొదలుపెట్టి ఇంటికి వాటితోనే వెళ్లాను. గుమ్మం ముందు చెప్పులు విడుస్తుంటే అచ్చం అవే చెప్పులు, అదే కంపెనీ ఇంకో జత అక్కడ కనిపించింది. కాళ్ళు కడిగి లోపలికి వెళ్లి చెప్పులు ఎవరివి అని అడిగితే నావేనన్నాడు మా తమ్ముడు. వాడు కూడా పండక్కి అవే చెప్పులు రాజమండ్రిలో కొనడం యాదృచ్చికంగా జరిగింది. ఎంతరా అని అడిగితే ఎనిమిది వందలన్నాడు. దెబ్బకి నా మొహం నీలంగా మారింది. తగ్గింపు ధరా? అని అడిగితే, లేదు మాములు రేటే అన్నాడు. నేను కూడా అవే చెప్పులు కొన్నాను అని చెప్పా. రేటెంత అని అడిగితే నాది కూడా అంతే అని చెప్పాల్సొచ్చింది.

మీరు కోలుకోలేని కష్టంలో ఉన్నపుడు మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ మీకు సహాయం చేశారా?

  చాలా మంది ఉన్నారు. నాకు ఇంజనీరింగ్ సీట్ వచ్చినప్పుడు మా రెండో పెద్దమ్మ, పెద్ద పెద్దమ్మగారి అబ్బాయి, నా మేనబావ కలిసి నాకు కంప్యూటర్ కొనడానికి సాయం చేసారు. అప్పటి పరిస్థితిలో నా కాలేజీ ఫీజు కట్టడమే మా నాన్నగారికి తలకు మించిన భారంలా ఉండేది. వారు చేసిన సహాయం నా చదువుకు చాలా ఉపయోగపడింది. నా బాల్య స్నేహితుడు లోవరాజుకి నాకు చిన్న విషయంలో మనస్పర్థలు వచ్చి రెండేళ్లు పైగా మాట్లాడుకోలేదు. కానీ మా నాన్నగారు చనిపోయినప్పుడు మమ్మల్ని పరామర్శించడానికి వచ్చి ఇంట్లో ఉన్న ముగ్గురు భోజనం కూడా చెయ్యలేదని చూసి ఇంటికెళ్లి క్యారేజీ పట్టుకొచ్చాడు. కష్టం వస్తే నా వెనక నిలబడే వాళ్ళు ఉన్నారు అనే భరోసా ఇచ్చాడు వాడు.

సద్గురు పట్ల మీ అభిప్రాయం ఏమిటి?

  గౌతమ్ గారు రాసిన సమాధానంతో నేను ఏకీభవిస్తాను. జగ్గీ వాసుదేవ్ ఒక యోగ గురువు. ఆయన యోగాసనాల గురించి హిందూ జీవన విధానాల గురించి మాట్లాడితే అభ్యంతరం చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ ఆయన ప్రచారం చేసే నకిలీ శాస్త్రం ప్రజలకి హాని చేసే అవకాశం కూడా ఉంది.గౌతమ్ గారు ఎత్తిచూపిన తప్పులే కాక అయన పాదరసం గురించి, ఆత్మల గురించి, వైద్య విధానాల గురించి చేసిన వ్యాఖ్యలు వాస్తవానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. తాను చేసిన ఆవిష్కరణలకు గణిత రుజువులు సమర్పిస్తే తనకి నోబెల్ బహుమతి ఇస్తారని నోబెల్ బహుమతి వచ్చిన ఒక శాస్త్రవేత్త తనకి చెప్పారని, కానీ ఆ బహుమతి తనకి అవసరం లేదు కాబట్టే అసలు ఆ ప్రయత్నం కూడా చెయ్యదలచుకోలేదని అన్నాడు. పైగా తాను చేసిన ఆవిష్కరణలేంటో, నోబెల్ బహుమతి వచ్చిన ఆ శాస్త్రవేత్త ఎవరో చెప్పలేదు. పైగా ఈ మాటలు నోబెల్ బహుమతి తీసుకున్న వారి కృషిని అవమానించినట్లుఉంది. ఆయన చెప్పిన మాటలని ఎవరైనా ప్రశ్నించినా, వ్యతిరేకించినా ప్రశ్నించిన వారిని హేళన చేసి మాట్లాడుతారు. ఆయన భక్తులైతే ఇంటర్నెట్లో ప్రత్యక్ష యుద్ధమే చేస్తారు. చివరికి రుజువులు చూపించలేక ఇది హిందూ మతం మీద దాడి అంటారు. లేకపోతే పాశ్చాత్య బానిస అంటారు....

నేటి సమాజంలో మీరు మార్చాలనుకుంటున్న ఒక అంశం ఏమిటి?

  నా సమాధానం కొంతమందిని నొప్పించవచ్చు. కాని చెప్పాలనే నిర్ణయించుకున్నా. మన నమ్మకాలని, బలహీనతల్ని ఉపయోగించుకుని వాళ్ళ పబ్బం గడుపుకుంటున్న దొంగ సన్నాసులనుండి కనీసం నాకు తెలిసిన వాళ్ళనైనా కాపాడుదాం అనుకున్నా. కానీ విఫలమౌతూనే ఉన్నాను. ఆ మోసగాళ్ళలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు జగ్గీ వాసుదేవ్. ఈయనగారు ప్రాచీన విజ్ఞానం పేరుతో ప్రచారం చేస్తున్న నకిలీ శాస్త్రాన్ని చూస్తుంటే ఇది ఇంతకీ దారి తీస్తుందో అని భయం వేస్తుంది. పాదరసం ప్రాణాంతకం కాదు, మన ఋషులు దాన్ని తాగేవారు, నేను వట్టి చేతులతో శుద్ధ పాదరసాన్ని గడ్డ కట్టిస్తాను, సైన్సుకి కూడా అర్ధం కానీ విషయం ఇది అని నమ్మబలికాడు. ఇది నమ్మి అంధ భక్తులు వాళ్ళ పిల్లలకి ఎక్కడ పాదరసం తినిపిస్తారేమో అని గుబులు కలుగుతుంది. మన సాధువులు చనిపోయిన వారిని తిరిగి బతికించగలరు, చనిపోయిన వ్యక్తి 14 రోజుల వరకు ప్రాణం దేహాన్ని వదిలిపెట్టదు అని సొల్లు కబుర్లు చెప్పాడు. మదనపల్లెలో జరిగిన సంఘటనకి ఈయన అసత్య ప్రచారాలకి దగ్గర పోలిక ఉంది. తాను ఇప్పటి వరకు నాలుగు జన్మలెత్తానని తన భార్య పూర్వ జన్మలో తన చెల్లెలని, ఇప్పటి తన భక్తురాలైన భారతి తన పూర్వ జన్మ ప్రియురాలని రాసేసాడు. బ...

మీరు చదువుకునేటప్పుడు మీకు బాగా కష్టంగా అనిపించిన సబ్జెక్ట్ ఏది? ఎందుకు?

  బళ్ళో చదివేటప్పుడు నాకు కష్టంగా అనిపించే సబ్జెక్ట్ ఆంగ్లము. ముఖ్యంగా పదవ తరగతిలో మా శ్రీనివాసరావు మాస్టారు నా ఇంగ్లీష్ ఉచ్చారణ విని ఇంకా మెరుగు పడాలని చెబుతుండేవారు. చివరికి నాకు ప్రత్యేకంగా సిలబెల్స్ నేర్పించే ప్రయత్నం చేసారు కానీ నా బుర్రకెక్కలేదు. కానీ పబ్లిక్ పరీక్షల్లో ఇంగ్లీషులో చెప్పుకోదగ్గ మార్కులే వచ్చాయి. కళాశాలలో చదివినప్పుడు కూడా ఇంగ్లీష్ కొంచెం ఇబ్బంది పెట్టింది. కానీ భయపెట్టింది మాత్రం నెట్వర్క్ ప్రోగ్రామింగ్. అసలా సబ్జెక్టు ఒక్క క్లాస్ కూడా అర్ధం కాలేదు. పరీక్షలకి ఒక రోజు ముందు ఒక రెండు చాఫ్టర్లు చదివి పరీక్ష గట్టెక్కించేసాను.

పర్యావరణ సంరక్షణకు ఒక సగటు మానవుడుగా మీరు ఏమి చేస్తున్నారు?

  ప్రత్యేకించి పర్యావరణ పరిరక్షణ కోసం చేయకపోయినా నేను రోజువారీగా చేసే పనులు పర్యావరణహితమైనవని అనుకుంటున్నాను. నాకు కారు లేకపోవడం చేత నేను ఆఫీసుకి వెళ్ళడానికి, కూరగాయలు తీసుకురావడానికి, మా అమ్మాయిని బడిలో దింపి తీసుకురావడానికి సైకిలు మీదే వెళ్తాను. చలికాలంలో నడిచి వెళ్తాను. ఒక దశలో ఆఫీసుకి 7 కిలోమీటర్ల దూరంలో ఉండేటప్పుడు కూడా ఎండాకాలంలో సైకిలు వేసుకెళ్ళేవాడిని, చలికాలంలో 4 నెలలు బస్సు ప్రయాణం చేశాను. దూరప్రయాణాలు చేసేటప్పుడు ప్రజారవాణా ఉపయోగిస్తాను. గత ఆరు సంవత్సరాలలో నాకోసం నేను కేవలం మూడు జతల బట్టలు మాత్రమే కొన్నాను. అంతకు ముందు నా పెళ్ళికి కుట్టించుకున్న బట్టలు ఇప్పటికీ ఆఫీసుకి వేసుకెళతా. నా ఇంటి కరెంటు బిల్లు నేనుంటున్న దేశ జాతీయ సగటు కంటే చాలా తక్కువ వస్తుంది. మా ఇంట్లో సగం వరకు ఫర్నిచర్ సెకండ్ హ్యాండ్ లో కొన్నాము. మేముంటున్న ప్రదేశంలోని భారతీయులు తమ పిల్లల బొమ్మలు, బట్టలు తమ స్నేహితుల చిన్నపిల్లలకి ఇస్తుంటారు. అలా ఉపయోగపడే వస్తువులు నా స్నేహితులు ఇచ్చినపుడు మొహమాటపడకుండా తీసుకున్న. మేము కూడా మా అమ్మాయికి అవసరంలేని వాటిని ఇచ్చేస్తూఉంటాం. ఇలా నా దినచర్య కొంత వరకు పర్యావరణానికి ఉ...

మీ జీవితంలో మరువలేని రైలు ప్రయాణం ఏది? ఎందుకు?

  "రైలు ఐదింటికి. నేను ఇప్పుడే ఆఫీసునుండి స్టేషనుకి బయలుదేరా". అమ్మతో ఫోన్లో మాట్లాడి ఎగ్మోర్ స్టేషన్కి బయల్దేరాను. నేను ఎక్కాల్సిన రైలు సర్కార్ ఎక్స్ప్రెస్ ఐదూ ఇరవైకి బయల్దేరుతుంది. అలవాటైన బండే కదా ప్లాటుఫారం చూసుకోవడంలాంటివేపుడో మానేశా. ఎప్పుడు కనీసం ఒక గంట ముందు స్టేషన్కి వచ్చే వాడిని కానీ ఆ రోజు లోకల్ బస్సు తప్పిపోవడంతో కొంచెం ఆలస్యం అయింది. రెండు చేతుల్లో ఉతకాల్సిన దుప్పట్లు, బట్టలు కుక్కిన రెండు బ్యాగులు పట్టుకుని బ్రిడ్జిమీద నా ప్లాటుఫారంకి వెళ్తుంటే కింద రైలు నెమ్మదిగా మొదలయ్యింది. అప్పుడే టైమైపోయిందని గ్రహించి వెంటనే పరుగున వెళ్లి కొద్దిగా నెమ్మదిగా వెళ్తున్న రైలుని పట్టుకుని ఎక్కేసి ఎదో విన్యాసం చేసిన సినిమాహీరోలా ఉప్పొంగిపోయి నా సీట్లో కూర్చున్నా. నా ఎదురుగా ఒక విద్యార్థి బృందం వాళ్ళ మాస్టారు కలిసి ఎక్కడికో ఆటలపోటీకి వెళ్తున్నట్టున్నారు. రైలు మొదలైన పది నిమిషాలకే పై బెర్తులో సంచులు పడేసి నేను కూడా ఎక్కేసి ఫోన్లో ఎదో చదువుకుంటున్నాను. ఏడింటికి నేను తెచ్చుకున్న బిర్యానీ తినేసి ఇక నిద్రపోవడమే అనుకుంటున్న తరుణంలో విద్యార్థి బృందంలో ఒక కుర్రాడు "క్షమించండి, ఈ బెర్...

మీరు చాలా ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏది?

Image
  అమ్మోరు. రమారమి ఒక యాభై సార్లు చూసుంటా. బడి ఉన్న రోజుల్లో రోజుకి ఒకటి రెండు సార్లు. బడి లేని రోజుల్లో రెండు మూడు సార్లు. ఇరవై ఏళ్ల క్రితం నా చిన్నప్పుడు మా నాన్నగారు ఒక సినిమా థియేటర్నీ అద్దెకు తీస్కుని నడిపేవారు. కానీ ఇప్పటి థియేటర్లలా దానిలో కొత్త సినిమాలు ఆడేవి కాదు. అప్పటికే విడుదలయ్యి విజయం సాధించిన సినిమాలు, లేకపోతే బాగా తక్కువ రేటుకు వచ్చే పాత సినిమాలు ఆడేవి. అప్పట్లో వచ్చిన అమ్మోరు సినిమా విడుదలయిన ప్రతిచోటా రికార్డులు తిరగరాస్తుండడంతో మా నాన్నగారు కొంచెం ఎక్కువ రేటు పెట్టే తీసుకొచ్చారు. ఆ సినిమా వచ్చిన రోజు మా థియేటర్కి అప్పటివరకు నేనెప్పుడూ చూడనంత జనం వచ్చారు. ఎప్పుడూ నాకు నచ్చిన సీట్లో కూర్చునే నేను ఆ రోజు ప్రొజెక్షన్ రూంలో నుండి బల్ల వేసుకుని నిలబడి చూడాల్సొచ్చింది. అంత సేపు నిలబడలేక కాసేపటి తర్వాత ఇంటికి వెళ్ళిపోయా. తర్వాతి రోజు నుండి ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ, అసలెక్కడా ఖాళీ లేకపోతే ఎంట్రన్స్ దగ్గర మెట్ల మీద కూర్చుని కూడా చూసేవాడిని. కొన్ని సన్నివేశాల దగ్గర సినిమా చూస్తున్న ప్రేక్షకులలో ఉన్నట్టుండి ఎవరోఒకరికి పూనకం వచ్చేసేది. అలాంటివాళ్ల కోసం షో మొదలవ్వడానికి ముందే ...